![డెల్టాలో కలుపు సలుపు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07amp01-607560_mr-1738981899-0.jpg.webp?itok=2FrcILcp)
డెల్టాలో కలుపు సలుపు
●
●
● రైతులకు ముప్పుగా మారిన ఫిస్టియా
● తీర ప్రాంత మండలాల్లో
రబీ వరికి అవరోధం
● మూడు జిల్లాలో 1.25 లక్షల
ఎకరాల్లో ప్రభావం
● మనుషులతో తొలగించడం వల్ల అదనపు భారం
● ఎకరాకు రూ.3 వేల నుంచి
రూ.5 వేల వరకూ అదనపు ఖర్చు
● తొలగింపునకే రూ.50 కోట్లకు
పైగా వ్యయం
సాక్షి, అమలాపురం: గోదావరి డెల్టాలో రైతుల రబీ వరి సాగు కష్టాలు అనంతం. ఖరీఫ్ గిట్టుబాటు కాలేదు.. ప్రభుత్వం ఇస్తానన్న రైతు ప్రోత్సాహం రూ.20 వేలు ఇవ్వలేదు. దీనితో అయినకాడికి అప్పులు చేసి రైతులు సాగు మొదలు పెట్టారు. ఎప్పుడో డిసెంబరు నెలాఖరుకు పూర్తి కావాల్సిన నాట్లు ఇంకా పడుతూనే ఉన్నాయి. అష్టకష్టాలు పడి నాట్లకు సిద్ధమైతే ‘ఫిస్టియా’ కలుపు రైతులను ముప్పుతిప్పలు పెడుతోంది. చేనంతా పాకి నాట్లు వేసేందుకు లేకుండా చేస్తోంది. గోదావరి డెల్టా పరిధిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో ఈ కలుపు అధికంగా ఉంది. సుమారు 1.25 లక్షల ఎకరాల్లో కలుపు ప్రభావం అధికంగా ఉంది. పంట కాలువ నుంచి వస్తున్న ఈ కలుపు.. చేలకు ఇచ్చే ఎరువుల సారం మొత్తం పీల్చేస్తోంది. అత్యంత వేగంగా పాకిపోయి టన్నుల మేర కలుపు వస్తోంది. దీని తొలగింపు రైతులను వ్యయప్రయాసలకు గురి చేస్తోంది. సాగు కాలంలో దీని తొలగింపునకు ఎకరాకు రూ.3 వేల నుంచి రూ.5 వేల అదనపు భారం పడుతోంది.
గోదావరి డెల్టా పరిధిలో దీని తొలగింపునకే రైతులకు ఈ సీజన్‌లో రూ.50 కోట్ల వరకూ అవుతోందని అంచనా. సాగు మొదలైన పొలాల్లో దీనిని మనుషులతో తొలగించడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. దమ్ములకు ముందు కలుపు మందులు వాడినా తొలగించడం అసాధ్యంగా మారింది. చివరకు కలుపు ఉండగా దమ్ములు చేసినా ఇది తాత్కాలికంగా చనిపోవడం, వారం రోజులకు యథావిధిగా రావడం జరుగుతోంది. కోనసీమ జిల్లా రాజోలు మండలం కడలిలో ఇద్దరు రైతులు వలతో ఫిస్టియా పువ్వును రెండుసార్లు తొలగించారు. ఎకరం చేనులో దీని తొలగింపునకే ఒక దఫాకు కనీసం ఆరుగురు కూలీలు అవసరమవుతున్నారని వారు చెబుతున్నారు. ‘ఇప్పటికే ఇది రెండోసారి. ఇప్పుడు తొలగించి నాట్లు వేసిన పది రోజులకే మరోసారి వస్తోంది. ఇది మా పొలాలకు పీడలా మారింది’ అని రైతు వెంకట్రావు ‘సాక్షి’ వద్ద వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment