![ఆవుల మంద దాడిలో వ్యక్తికి తీవ్రగాయాలు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07amp147-270015_mr-1738981900-0.jpg.webp?itok=m7JjXk5S)
ఆవుల మంద దాడిలో వ్యక్తికి తీవ్రగాయాలు
తాళ్లరేవు: రహదారిపై సంచరిస్తున్న ఆవుల మంద దాడిలో తాళ్లరేవు గ్రామానికి చెందిన వల్లు చిన్న అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు కొన్ని నెలలుగా సుమారు పది నుంచి 15 ఆవులు రహదారులపై సంచరిస్తూ రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఎండలో వచ్చిన ఆవులకు నీళ్లు పెట్టేందుకు చిన్నా వెళ్లగా వెనుక వైపు నుంచి ఆంబోతు ఒక్కసారిగా రావడంతో ఆవులు పరుగులు తీశాయి. ఈ క్రమంలో చిన్న చేయి విరిగి దుమ్ము బయటకు వచ్చేసింది. స్థానికులు హుటాహుటిన 108లో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. రహదారులపై ఆవులను వదిలివేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
మహా శివరాత్రి ఏర్పాట్లపై
11న సమీక్ష
కె.గంగవరం: కోటిపల్లి ఛాయా సోమేశ్వరస్వామి ఆలయంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై ఈ నెల 11న సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ జె. భీమశంకరం శుక్రవారం విలేకరులకు తెలిపారు. రామచంద్రపురం ఆర్డీఓ దేవరకొండ అఖిల నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ సమావేశానికి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొనాలని కోరారు. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని తెలిపారు.
సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నీకి
ఏర్పాట్లు చేయాలి
కాకినాడ సిటీ: నగరంలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో ఈ నెల 15 నుంచి 28వ తేదీ వరకూ జరిగే ఆలిండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఆదేశించారు. ఈ టోర్నమెంట్ నిర్వాహక ఉప కమిటీలతో కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. 14 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో పాల్గొనే జాతీయ స్థాయి క్రీడాకారులకు చక్కటి బస, ఆతిథ్యం, సదుపాయాలు కల్పించాలని అన్నారు. వారి బసకు, అక్కడి నుంచి క్రీడా మైదానానికి వెళ్లేందుకు కాకినాడ, సామర్లకోట రైల్వే, బస్ స్టేషన్ల నుంచి బస్సులు, కార్లు ఏర్పాటు చేయాలని సూచించారు. క్రీడాకారుల నమోదు, పోటీల నిర్వహణ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆహారం, వైద్య సేవలకు ఉపకమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రారంభ, ముగింపు వేడుకల నిర్వహణ, సాంస్కృతిక కార్యక్రమాలు, పారిశుధ్యం, ట్రాఫిక్, క్రౌడ్ నియంత్రణ, పార్కింగ్, లైటింగ్ తదితర అంశాలపై ఆయా కమిటీల అధికారులతో జేసీ మీనా సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో ఆర్డీవోలు ఎస్.మల్లిబాబు, కె.శ్రీరమణి, డీఎస్‌డీవో బి.శ్రీనివాసకుమార్, సీపీవో పి.త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.
రేపటి నుంచి
జ్ఞాన చైతన్య మహాసభలు
పిఠాపురం: స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య, ఆధ్యాత్మిక పీఠంలో ఆది, సోమ, మంగళవారాల్లో 97వ వార్షిక జ్ఞాన చైతన్య మహాసభలు నిర్వహిస్తున్నారు. పిఠాపురంలోని పీఠం ప్రధానాశ్రమం వద్ద శుక్రవారం ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు ఈ విషయం తెఇపారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అధ్యక్షతన వార్షిక జ్ఞాన చైతన్య మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. మూడురోజుల పాటు జరిగే ఈ సభల్లో దేశ విదేశాల నుంచి సుమారు 36 వేల మంది సభ్యులు పాల్గొంటారని తెలిపారు. సభల్లో పాల్గొనే వారికి పీఠం వద్ద భోజన ఏర్పాట్లు చేశామన్నారు. పీఠాధిపతి ఉమర్ ఆలీషా మాట్లాడుతూ 1472లో స్థాపించిన ఈ పీఠం 553 సంవత్సరాలుగా ఆర్ష సూఫీ వేదాంత సారాన్ని ఏకత్వ రూపంగా ప్రబోధిస్తోందని చెప్పారు. 1928లో పంచమ పీఠాధిపతి నిర్వాణానంతరం, ఏటా మాఘ మాసం శుక్ల పక్షంలో తాత్విక విజ్ఞానాన్ని బోధిస్తూ మూడు రోజుల పాటు మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కుల, మత, జాతి, వర్ణ, లింగ, వర్గ తారతమ్యాలు లేని, సర్వ మానవ సమానత్వం కోసం అందరికీ ఆచరణ యోగ్యమైన తత్వాన్ని తమ పీఠం బోధిస్తోందని చెప్పారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, ఎస్సై జాన్ బాషా, పీఠం సెంట్రల్ కమిటీ సభ్యులు ఎన్‌టీవీ వర్మ, పింగళి ఆనంద్, ఏవీవి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment