![సామవేదం షణ్ముఖశర్మ - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/23/22rjc205-270080_mr_1.jpg.webp?itok=NtSBZUri)
సామవేదం షణ్ముఖశర్మ
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘పట్టాభిషేకమంటే రాముడు పొంగిపోలేదు. వనవాసమంటే కుంగిపోలేదు. ఆయన రెండింటినీ సమానంగానే స్వీకరించిన స్థితప్రజ్ఞుడు’ అని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. హిందూ సమాజంలో పదో రోజు సాగించిన ప్రవచనంలో అయెధ్య కాండలోని పలు కీలక సన్నివేశాలను ఆయన వివరించారు. ‘పట్టాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లన్నీ పూర్తయిన వైనాన్ని దశరథ మహారాజుకు విన్నవించడానికి మంత్రి సుమంత్రుడు అంతఃపురంలోకి ప్రవేశించాడు. ఆయన అంతఃపురంలోకి ప్రవేశించడానికి ఎటువంటి నియమాలూ లేవు. పున్నమి జాబిలిని చూసిన సముద్రునిలా ప్రజావాహిని ఉప్పొంగిపోతోందని రాజుకు నివేదించడానికి వచ్చిన సుమంత్రుడు.. రాజు ముఖంలోని దైన్యాన్ని చూసి, నివ్వెరపోయాడు. వెంటనే రాముడిని తీసుకురమ్మని కై కేయి చెప్పిన మాటలను అమలు చేయడానికి రాజాజ్ఞ లేదని ఆయన సందేహించాడు. దశరథుడు కూడా రాముడిని తీసుకురమ్మని ఆదేశించాడు. అంతఃపురానికి వస్తున్న రాముడిని చూసి ప్రజలు ఇలా భావించారు. ఎవడు రాముడిని చూడడో, రాముడు ఎవరిని చూడడో వాడు సర్వకాలాల్లో నింద్యుడు. రాముని వైపు ప్రసరించిన చూపు, మనస్సు వెనక్కు మళ్లవు. కై క ద్వారా ఆమెకు దశరథుడు ప్రసాదించిన వరాలు విన్న రాముడు తనకు ధనం, పదవీ వ్యామోహాలు లేవని, తాను రుషితుల్యుడినని ఆమెకు చెబుతాడు’ అంటూ కీలక సన్నివేశాన్ని కళ్లకు కట్టినట్టుగా సామవేదం వివరించారు. జీవితం ఎందుకని సాధకులు అడిగిన ప్రశ్నకు పరమాత్మను చూడటానికేనని రామకృష్ణ పరమహంస తడుముకోకుండా చెప్పాడని చెప్పారు. అయోధ్య కాండలో రత్నాల వంటి అనేక శ్లోకాలున్నాయని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment