ప్రారంభమైన టెట్
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఉపాఽధ్యాయ అర్హత పరీక్ష (టెట్) కాకినాడ జిల్లాలో గురువారం ప్రారంభమైంది. జిల్లావ్యాప్తంగా నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేయగా తొలిరోజు రెండు కేంద్రాల్లో మాత్రమే పరీక్ష నిర్వహించారు. ఉదయం జరిగిన పరీక్షకు అచ్యుతాపురం అయాన్ కేంద్రంలో 459 మంది హాజరుకాగా 61మంది గైర్హాజరయ్యారు. రాయుడుపాలెం సాఫ్ట్ టెక్నాలజీ కేంద్రంలో 128మంది హాజరు కాగా 19మంది పరీక్ష రాయలేదు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు అచ్యుతాపురం అయాన్ కేంద్రంలో 469 మంది హాజరుకాగా 51మంది గైర్హాజరయ్యారు. సాఫ్ట్ టెక్నాలజీ కేంద్రంలో 133 మంది హాజరుకాగా 13మంది గైర్హాజరయ్యారు.
డ్వామా పీడీగా మహేశ్వరరావు
రాజమహేంద్రవరం రూరల్: జిల్లా డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఎ.నాగమహేశ్వరరావు గురువారం సాయంత్రం బొమ్మూరులోని డ్వామా కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన కృష్ణా జిల్లా డ్వామా కార్యాలయంలో ఏవోగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇప్పటి వరకూ జిల్లా సహకార అధికారి శ్రీరాములు నాయుడు ఇన్‌చార్జిగా వ్యవహరించారు. కాగా.. డ్వామా పీడీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మహేశ్వరరావు.. కలెక్టర్ పి.ప్రశాంతిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
మద్యం దుకాణాలకు
పది దరఖాస్తులు
రాజమహేంద్రవరం రూరల్: జిల్లాలో మద్యం దుకాణాలకు సంబంధించి గురువారం పది దరఖాస్తులు వచ్చినట్టు జిల్లా ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ లావణ్య తెలిపారు. మొత్తం 125 మద్యం దుకాణాల కోసం ఈ నెల 9వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వారు రాజమహేంద్రవరం నార్త్, రాజమహేంద్రవరం సౌత్, కోరుకొండ, రంగంపేట, కొవ్వూరు, దేవరపల్లి, నిడదవోలులోని ఎకై ్సజ్ స్టేషన్‌లో దరఖాస్తులను అందజేయాలని సూచించారు.
పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలపై మార్గదర్శకాలు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): పట్టా భూముల్లో ఇసుకను తవ్వడానికి ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. గురువారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ పట్టా భూముల నుంచి ఇసుకను తీయడం, ప్రభుత్వం ఇచ్చిన భూములలో వ్యవసాయం చేయకుండా ఇసుకను తొలగించడానికి మార్గదర్శకాలతో జీఓ జారీ అయిందన్నారు. పట్టాదార్ పాస్‌బుక్, టైటిల్ డీడ్ పుస్తకం, గ్రామ మ్యాప్‌లో ఉన్న భూమి నకలుతో పాటు కలెక్టర్‌కు దరఖాస్తు చేయాల్సి ఉంటుందన్నారు. క్షేత్ర స్థాయిలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ పట్టా భూమి తనిఖీ చేపట్టాలన్నారు. కమిటీలోని గ్రౌండ్ వాటర్, ఇరిగేషన్, వ్యవసాయ, రెవెన్యూ, మైనన్స్ అధికారులతో పాటు సంబంధిత డివిజన్ పరిధిలో ఆర్డీవో, డీఎస్పీలు తనిఖీ సమయంలో హాజరవ్వాల్సి ఉంటుందన్నారు. జిల్లా పంచాయతీ అధికారులతో పాటు ప్రాంతాన్ని గుర్తించి, క్షేత్ర స్థాయిలో సరిహద్దుల నిర్ధారణ చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కిక్కిరిసిన రత్నగిరి
అన్నవరం: దసరా వేడుకల తొలి రోజు గురువారం రత్నగిరి సత్యదేవుని ఆలయం భక్తులతో కిటకిట లాడింది. విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రారంభమవడంతో పెద్ద సంఖ్యలో భక్తులు సత్యదేవుని ఆలయానికి విచ్చేశారు. దూర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు వచ్చి వ్రతాలాచరించారు.
Comments
Please login to add a commentAdd a comment