‘బంగారుకొండ’కు సీఎస్‌ఆర్ నిధులు
గెయిల్ ప్రతినిధులతో కలెక్టర్ ప్రశాంతి సమావేశం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): పిల్లల ఎదుగుదల ను సాధారణ స్థితికి తీసుకుని వచ్చే క్రమంలో జిల్లాలో బంగారు కొండ ప్లస్ కార్యక్రమాన్ని కార్పొ రేట్ సామాజిక బాధ్యత కింద చేపట్టే ప్రతిపాదనలను సిద్ధం చేశామని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గెయిల్ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వయసుకు తగ్గ బరువు, ఎదుగుదల లేని, రక్తహీనత, తీవ్ర పోషకాహార లోపం గల పిల్లలను గుర్తించి వారిని సాధారణ స్థితికి తీసుకురావడం కోసం బంగారు కొండ కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా చేపట్టామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రజల భాగస్వామ్యంతో ప్రయోగాత్మకంగా చేపట్టామన్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసే విధానంలో పోషికాహార లోపం లేకుండా చూడడంతో, అంగన్వాడీ కేంద్రాల్లో బోధన సంబంధ అంశాలను జోడించి ‘ బంగారు కొండ ప్లస్’ కార్యక్రమాన్ని ఈ ఏడాది చేపట్టనున్నట్లు కలెక్టరు ప్రశాంతి తెలిపారు. గత ఏడాది చేపట్టిన బంగారు కొండ కింద 1,283 మందికి బంగారుకొండ కిట్స్ అందించి 1,169 మందిని సాధారణ స్ధితికి తీసుకువచ్చామని తెలియజేశారు. నూటికి నూరు శాతం ఫలితాలు సాధించడం లక్ష్యంగా చేసుకుని అడుగులు వేస్తున్నట్టు కలెక్టర్ వివరించారు. ప్రస్తుతం జిల్లాలో 469 మంది చిన్నారులు ఈ కేటగిరిలో ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇతర కార్పొరేట్ సంస్థల సహకారంతో కౌమార దశలో ఉన్న బాలికలకు ‘మునగపొడి ‘ అందించి రక్తహీనతను అధిగమించి అనీమియా లేకుండా పరిరక్షణ బాధ్యతలు నిర్వహించినట్లు తెలియ చేశారు. గెయిల్ ఆధ్వర్యంలో ‘బంగారు కొండ ప్లస్‘ కార్యక్రమానికి సహకారం అందించాలని కోరారు. పిల్లలకి ప్రభుత్వం అందించే సంపూర్ణ పోషణకి అదనంగా బంగారుకొండ కిట్లను అందించి, ప్రతివారం వారీ ఆరోగ్య వివరాలు, ఎదుగుదల విధానం పరిశీలిస్తామని తెలిపారు. గెయిల్ చీఫ్ జనరల్ మేనేజర్ (ఓఎం)కేవీఎస్ రావు మాట్లడుతూ, జిల్లా యంత్రాంగం తరఫున అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ, పోషకాహారలోపం నిర్మూలన, సంక్షేమ వసతి గృహాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం తదితర కార్యక్రమాలను అమలు చేసేందుకు సహాయ సహకారాలు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. గెయిల్ మేనేజర్ (హెచ్‌ఆర్) ప్రభాకర్, ఐసీడీఎస్ జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ అధికారి కె.విజయకుమారి, ఇండస్ట్రీస్ అధికారి ప్రదీప్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment