ఘనంగా మహాశక్తి యాగం
● రమణయ్యపేట శ్రీపీఠంలో
దసరా సందడి ఆరంభం
● తొలి రోజు దీక్ష వస్త్రాలతో కుంకుమార్చనలో
26 వేల మంది మహిళలు
కాకినాడ రూరల్: రమణయ్యపేట శ్రీపీఠంలో మహాశక్తి యాగం ఘనంగా సాగింది. పీఠంలో దసరా పూజా కార్యక్రమాలను గురువారం పరిపూర్ణానంద స్వామి ప్రారంభించారు. నవరాత్రుల్లో భాగంగా ప్రతి రోజూ ఇక్కడ భారీ ఎత్తున కుంకుమార్చనలు నిర్వహించనున్నారు. తొలి రోజే సుమారు 26వేల మంది మహిళలు దీక్షా వస్త్రాలు ధరించి పూజకు హాజరయ్యారు. తొమ్మిది గంటల నుంచి భక్తుల సందడి ప్రారంభయ్యింది. లలితా సహస్ర నామాలతో కుంకుమార్చనలు నిర్వహించేందుకు మహిళాభక్తులకు రెండు భారీ షెడ్లను ఏర్పాటు చేయడంతో వాటిలో కూర్చున్నారు. తొలుత స్వామిజీ భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ నెల 13వరకు శ్రీపీఠంలో దసరా పూజా కార్యక్రమాలు జరుగుతాయని, వేలాదిగా వచ్చే భక్తులకు అన్న ప్రసాదం ఏర్పాటు చేశామన్నారు. మూలా నక్షత్రం రోజు విద్యార్థులకు సరస్వతీ పూజ, అష్టమి నాడు అమ్మవారికి వేలాది మంది భక్తులతో కుంకుమార్చనలు నిర్వహిస్తామన్నారు. లలితా అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ పూజలు నిర్వహిస్తున్నామన్నారు. పది రోజుల పాటు వంద కోట్ల కుంకుమార్చనలు నిర్వహిస్తామన్నారు. తొలి రోజు సాయంత్రం అన్నపూర్ణ దేవి అలంకరణలో ఐశ్వర్యాంభిక అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం అన్న సూక్త, అన్నపూర్ణ హోమాలను వేద పండితులు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment