కొండెక్కి సంచోరీస్తూ.. | - | Sakshi
Sakshi News home page

కొండెక్కి సంచోరీస్తూ..

Published Fri, Oct 18 2024 3:06 AM | Last Updated on Fri, Oct 18 2024 3:06 AM

కొండె

అన్నవరం: దొంగలు కొండెక్కారు.. అందినకాడకు దోచుకుంటున్నారు.. భక్తుల ముసుగులో రెచ్చిపోతున్నారు.. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలోని శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. నిత్యం వీరి బారినపడి అనేక మంది భక్తులు మోసపోతున్నారు. గతంలో దేవస్థానంలోని 30 వీఐపీ సత్రంలో పోలీసు ఔట్‌ పోస్ట్‌ ఉండేది. అక్కడొక హెడ్‌ కానిస్టేబుల్‌, మరో ఇద్దరు పోలీసులు విధులు నిర్వహించేవారు. గతేడాది ఆ సత్రాన్ని కూల్చేశారు. తరువాత ఔట్‌ పోస్టును ఆలయానికి దూరంగా సీతారామ సత్రానికి మార్చారు. అక్కడ పోలీసులు ఉంటున్నారో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో దొంగల పని సులువైంది. భక్తుల్లా నటిస్తూ చోరీలకు పాల్పడుతున్నారు.

బ్యాగ్‌లు, పర్స్‌లు కొట్టేస్తూ..

రత్నగిరిపై కొలువైన సత్యదేవుని ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. భక్తుల ముసుగులో కొంతమంది దొంగలు దేవస్థానంలో పలుచోట్ల చోరీలు చేస్తున్నారు. దొంగల బారిన పడిన భక్తులు దేవస్థానం అధికారులకు విషయం చెబితే, మైక్‌ ద్వారా వస్తువులు లేదా పర్స్‌ పోగొట్టుకున్నారని చెప్పి.. దొరికిన వాళ్లు తేవాలని ప్రకటిస్తున్నారు. ఇలా ఎవరూ తెచ్చి ఇచ్చిన దాఖలాలు లేవు. బ్యాగ్‌లు లేదా, పర్స్‌లు పోగొట్టుకున్న వారు రోజూ కనీసం ఇద్దరు, ముగ్గురు భక్తులు అధికారుల దృష్టికి తీసుకు వస్తున్నారు. కొంతమంది ఎటువంటి ఫిర్యాదు చేయకుండా వెళ్లిపోతున్నారు.

రోజుల తరబడి ఇక్కడే..

ఎక్కడెక్కడి నుంచో భక్తుల మాదిరిగా రత్నగిరికి వస్తున్న దొంగలు రోజుల తరబడి కొండపైనే ఉంటున్నారు. భక్తుల కోసం రోజూ ఉదయం పంపిణీ చేసే పులిహోర, దద్దోజనం, మధ్యాహ్నం అన్నదానంలో భోజనం చేస్తారు. తరువాత విశ్రాంతి మండపాల్లో భక్తుల పక్కనే నిద్రిస్తున్నట్లు నటిస్తారు. భక్తులు నిద్రపోయే సమయంలో వారి బ్యాగ్‌లు తస్కరించి మాయమవుతుంటారు. అదే విధంగా కామన్‌ బాత్‌రూమ్‌ల వద్ద స్నానాలు చేసేటప్పుడు బ్యాగ్‌లు పట్టుకుపోతున్నారనే ఫిర్యాదులు కోకొల్లలు.

తనిఖీలు నామమాత్రం

గతంలో రత్నగిరిపై అనుమానాస్పదంగా కనిపించే వారిని పోలీసులు, దేవస్థానం సిబ్బంది తనిఖీ చేసేవారు. ఇక్కడ ప్రస్తుతం అటువంటి తనిఖీలు లేవు. దేవస్థానంలో 36 మంది హోమ్‌ గార్డులు, వందకు పైగా ప్రైవేట్‌ సెక్యూరిటీ సిబ్బంది, సెక్యూరిటీ ఆఫీసర్‌ ఉన్నారు. కానీ అనుమానాస్పదంగా సంచరించే వారిని, రోజుల తరబడి ఉంటున్న వారిని ఎవరూ ప్రశ్నించడం లేదు. గతంలో రెండు, మూడు రోజులు దాటి కొండపై కనిపిస్తే వారి అడ్రస్‌, ఏం పని మీద ఉంటున్నారని అడిగేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. దీనివల్ల దొంగల సంచారానికి అడ్డు లేకుండా పోయింది.

విస్తృత తనిఖీలు అవసరం

రత్నగిరిపై రామాలయం పక్కన విశ్రాంతి మండపంలో లేదా, అనౌన్స్‌మెంట్‌ చేసే రామారాయ కళామందిరం వద్దో పోలీస్‌ ఔట్‌ పోస్టు ఏర్పాటు చేయాలి.

అందులో 24 గంటలూ పోలీసులు విధుల్లో ఉండాలి. అదే విధంగా అనుమానాస్పదంగా కనిపించిన వారిని, రోజుల తరబడి రత్నగిరిపై ఉంటున్న వారిని పంపించేయాలి. అదేవిధంగా పలుచోట్ల సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలి. కనీసం వారానికొకసారైనా స్థానిక ఎస్‌ఐ దేవస్థానంలో తనిఖీలు చేయాలి.

అందరికీ కనిపించేలా ఔట్‌పోస్ట్‌

రత్నగిరిపై పోలీస్‌ ఔట్‌పోస్ట్‌ సీతారామ సత్రంలోని ఒక గదిలో ఉంది. ఇది చాలా మందికి తెలియదు. ఈ ఔట్‌ పోస్ట్‌ను అందరికీ కనిపించేలా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసేందుకు గది కేటాయించాలని దేవస్థానం అధికారులను కోరతాం. అదే విధంగా దేవస్థానంలో విస్తృతంగా తనిఖీలు చేస్తాం

– శ్రీహరిబాబు, ఎస్సై, అన్నవరం

ఫ భక్తుల్లా వచ్చి దొంగతనాలు

ఫ రత్నగిరిపై రెచ్చిపోతున్న దొంగలు

ఫ విశ్రాంతి మండపాలు,

క్యూలో చేతివాటం

No comments yet. Be the first to comment!
Add a comment
కొండెక్కి సంచోరీస్తూ..1
1/1

కొండెక్కి సంచోరీస్తూ..

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement