పరిమితికి మించి పండించొద్దు
దేవరపల్లి: పరిమితికి మించి పొగాకు పండించవద్దని పొగాకు బోర్డు చైర్మన్ సీహెచ్ యశ్వంత్‌కుమార్ రైతులకు విజ్ఞప్తి చేశారు. 2024–25 పంట నియంత్రణపై మంగళవారం దేవరపల్లి పొగాకు వేలం కేంద్రం వద్ద రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు వేలం నిర్వహణాధికారి హేమస్మిత అధ్యక్షత వహించగా చైర్మన్ యశ్వంత్‌కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అంతర్జాతీయంగా పొగాకు ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోందని తెలిపారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు బ్రెజిల్, జింబాబ్వే దేశాల్లో 310 మిలియన్ల కిలోలు, ఆఫ్రికా దేశాల్లో 200 మిలియన్ల కిలోలు, టాంజానియాలో 200 మిలియన్ల కిలోలు పొగాకు ఉత్పత్తి అవుతుందని తెలిపారు. ప్రపంచంలో అతి పెద్ద ఉత్పత్తిదారు అయిన చైనాలో 650 మిలియన్ల కిలోలు ఉత్పత్తి అవుతుందని అంచనా ఉందని తెలిపారు. దీనిని బట్టి చూస్తే వచ్చే 2024–25 పంట కాలంలో అంతర్జాతీయంగా పొగాకు ఉత్పత్తి గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. 2023–24 పంట కాలంలో అంతర్జాతీయంగా పొగాకు ఉత్పత్తి గణనీయంగా తగ్గడం, డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి జరగకపోవడంతో మన పొగాకుకు ఎన్నడూ లేని డిమాండ్ ఏర్పడిందన్నారు. దీంతో కిలో గరిష్ఠ ధర రూ. 410 లభించిందని వివరించారు. 2023–24 పంట కాలంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌ఎల్‌ఎస్, ఎస్‌బీఎస్, ఎన్‌బీఎస్ ప్రాంతాల్లోని 18 వేలం కేంద్రాల పరిధిలో 142 మిలియన్ల కిలోల ఉత్పత్తికి అనుమతి ఉండగా, 172 మిలియన్ల కిలోలు ఉత్పత్తి జరిగిందన్నారు. అదనపు పంటపై అపరాధ రుసుం రద్దు చేసి రైతులను ఆదుకోవాలన్న రైతు సంఘాల నాయకుల అభ్యర్థన మేరకు ప్రజాప్రతినిధుల కృషి వల్ల ఆంధ్రప్రదేశ్‌లో రూ. 120 కోట్ల అపరాధ రుసుం రద్దు చేయగా, ఎన్‌ఎల్‌ఎస్ ప్రాంతంలో రూ.19 కోట్లు రద్దు చేసినట్టు ఆయన తెలిపారు. 2024–25 పంట కాలంలో రాష్ట్రంలో 170 మిలియన్ల కిలోల ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇచ్చిందని, దీనికి మించి ఉత్పత్తి చేయరాదని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు.. బర్లీ పొగాకు విపరీతంగా వేస్తున్నారని, ఇది మన పొగాకుకు పోటీ కాబోతుందని ఆయన తెలిపారు. మన దేశంలో పండిన పొగాకును ఇండోనేషియా, దుబాయ్, జర్మనీ దేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు తెలిపారు. వర్జీనియా పొగాకుకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంటుందని తెలిపారు. రాజమహేంద్రవరం రీజనల్ మేనేజరు జీఎల్‌కే ప్రసాద్ మాట్లాడుతూ పొగాకు వాణిజ్యసరళి పంట కావడం వల్ల స్థితిగతులు మారుతుంటాయని తెలిపారు. నాణ్యతా ప్రమాణాలకు డిమాండ్ ఉంటుందన్నారు. రైతులు కాట్రు సత్యనారాయణ, ఈలపోలు చిన్ని, నరహరిశెట్టి రాజేంద్రబాబు, కాట్రగడ్డ సత్యనారాయణ, రైతు సంఘం అధ్యక్షులు కరుటూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ పొగాకు బయట అమ్మకాలను అరికట్టాలని చైర్మన్ యశ్వంత్ కుమార్‌ను కోరారు. గత ఏడాది విజిలెన్స్ లేకపోవడం వల్ల బయట అమ్మకాలు విచ్చవిడిగా సరిగాయని, వచ్చే ఏడాది గట్టి నిఘా ఏర్పాటు చేసి బయట వ్యాపారులను కట్టడి చేయాలని రైతులు కోరారు.
పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment