ఉరుకులు... పరుగులు | - | Sakshi
Sakshi News home page

ఉరుకులు... పరుగులు

Published Thu, Nov 21 2024 12:11 AM | Last Updated on Thu, Nov 21 2024 12:11 AM

ఉరుకులు... పరుగులు

ఉరుకులు... పరుగులు

రైల్వే స్టేషన్‌లో భీతావహం

రైలు పట్టాలు తప్పిందని హడావుడి

మాక్‌డ్రిల్‌తో అవగాహన

కల్పించిన అధికారులు

ఎలా రక్షించాలో చూపించిన

ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు

రాజమహేంద్రవరం సిటీ: ఏం జరిగిందో తెలియదు.. అంతా హడావుడి.. ఒక్కసారిగా అధికారుల ఉరుకులు, పరుగులు.. ఈ పరిణామాలతో రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌లో భీతావహ పరిస్థితి.. స్టేషన్‌లోని కోల్‌ యార్డ్‌ వద్ద రైలు పట్టాలు తప్పిందని తెలియడం, ఒక్కసారిగా ఆ రైలులోని ప్రయాణికులు భయంతో కేకేలు వేయడం.. సంఘటనా స్థలానికి రైల్వే ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం, వైద్య అధికారులు, రెవెన్యూ, పోలీస్‌, తదితర శాఖల సిబ్బంది కంగారుగా వెళ్లడం.. రైలు బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులను రక్షించేందుకు అత్యాధునిక కట్టర్లు ఉపయోగించి బోగీ కిటికీలను కట్‌ చేయడం.. అందులోంచి ప్రయాణికులను బయటకు లాగి, రోప్‌ ద్వారా సురక్షితంగా తీసుకురావడం చూసి స్టేషన్‌ వద్ద ప్రయాణికులు వామ్మో అనుకున్నారు. చివరికి ఇదంతా రైల్వే ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా నిర్వహించిన మాక్‌ డ్రిల్‌ అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. రైలు ప్రమాదాల సమయంలో ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి సాధ్యమైనంత తక్కువ సమయంలో త్వరితగతిన రెస్క్యూ కార్యకలాపాలను ఏ విధంగా చేపట్టాలనే అంశాలపై రాజమహేంద్రవరం ప్రధాన రైల్వే స్టేషన్‌లో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌పీఏఆర్‌ఎంవీ సిబ్బంది నిర్వహించిన మాక్‌ డ్రిల్‌ ఆద్యంతం కళ్లకట్టినట్టు అయ్యింది. విజయవాడ అదనపు డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ (ఆపరేషన్స్‌) శ్రీనివాసరావు కొండ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక రైల్వే స్టేషన్‌ కోల్‌ యార్డ్‌లో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ 10వ బెటాలియన్‌, వివిధ శాఖల అధికారులతో కలసి మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు కొండ మాట్లాడుతూ ప్రయాణాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. దీనిపై మెకానికల్‌, సేఫ్టీ, మెడికల్‌, ఎస్‌అండ్‌టీ విభాగాల్లోని సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు అత్యవసర సమయంలో తీసుకోవాల్సిన అంశాలను తెలియజేస్తున్నామన్నారు. ప్రమాద సమయంలో రెస్క్యూ కార్యకలాపాలను చేపట్టడానికి త్వరితగతిన స్పందించే విధంగా విజయవాడలోని ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌పీఏఆర్‌ఎంవీ సిబ్బంది మాక్‌డ్రిల్‌ను సమర్థంగా నిర్వహించారన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.చిన్న రాములు మాట్లాడుతూ రైలు ప్రమాదాల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడేందుకు అత్యవసరంగా చేపట్టాల్సిన చర్యలను మాక్‌డ్రిల్‌ ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించడం అభినందనీయమన్నారు. ప్రయాణికులకు రక్షించి సమీప ఆసుపత్రులకు ఎలా తరలిస్తారో చూపారన్నారు. మొత్తం 100 మంది రైల్వే సిబ్బంది రెస్క్యూ, పునరుద్ధరణ కార్యకలాపాల్లో పాల్గొని సమర్థంగా చర్యలు చేపట్టారన్నారు. కార్యక్రమంలో రైల్వే అధికారి బి.ప్రశాంతకుమార్‌, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement