ఏలూరు టౌన్: దారి దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరిని ద్వారకాతిరుమల మండలం కప్పలగుంటలో బుధవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు జంగాలకాలనీకి చెందిన మానిపాటి విజయ్‌కుమార్, రాజమహేంద్రవరంలోని చింతలనామవరం ప్రాంతానికి చెందిన దామిరెడ్డి త్రిమూర్తులుగా గుర్తించారు. వీరి నుంచి రూ.5 వేలు, ఒక బంగారు ఉంగరం, ఆటో సీజ్ చేశారు. మానిపాటి విజయ్‌కుమార్ రెండేళ్ల కిందట నుంచి తన స్నేహితులు సాల వెంకన్న, అతని భార్య ముంతాజ్, ధవళేశ్వరానికి చెందిన రవి, సానిటోరియానికి చెందిన మానస (హిజ్రా) గోకవరం బస్టాండ్ ప్రాంతానికి చెందిన కారు డ్రైవర్ సంజీవ్‌లు దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. కారును అద్దెకు తీసుకుని విజయవాడ వైపు వెళుతూ ఏలూరు జిల్లా దెందులూరు మండలం గుండుగొలను బస్టాండ్ సమీపంలో కారు రోడ్డు పక్కగా పార్కింగ్ చేసి ఉండటాన్ని గమనించారు. కారు డ్రైవర్ సీట్ వైపు అద్దం కిందకు దింపి ఉండడంతో డ్రింక్ తాగేందుకు ఆపినట్లు నిందితులు కారును ఆపి వేరొక కారులోని సీటులో ఉన్న పర్సులో బంగారు చైను, బంగారపు ఉంగరాన్ని, రూ.5 వేల నగదును కాజేశారు. జగ్గంపేట దగ్గరలోని ఎర్రవరం ప్రాంతంలో నాలుగేళ్ల కిందట విజయ్‌కుమార్, సాలా బలరాం ఇద్దరూ కలసి రాత్రి సమయంలో జాతీయ రహదారిపై టార్చ్‌లైట్ వేస్తూ వారివద్దకు వచ్చిన వ్యక్తిని కొట్టి రెండు బంగారు ఉంగరాలు లాక్కున్నారు. మూడేళ్ల కిందట సిద్ధాంతం ఇటుకల బట్టీ రోడ్డు పక్కన ఒక వ్యక్తి మద్యం మత్తులో తన మోటారు సైకిల్‌పై ఉండగా విజయ్‌కుమార్, సాల వెంకన్న, అతని భార్య ముంతాజ్, రవి, మానస (హిజ్రా), సంజీవ్ కలసి అతడ్ని కొట్టి 3 బంగారు ఉంగరాలు లాక్కున్నారు. రాజానగరం దాటిన అనంతరం మల్లేపల్లి సమీపంలో పామాయిల్ తోటల వద్ద చేప పిల్లల వ్యాన్ డ్రైవర్‌ను కొట్టి అతని మెడలోని బంగారు చైను లాక్కుని పారిపోయారు. దేవరపల్లి మండలం చిన్నాయగూడెం గ్రామానికి చెందిన ఆలూరి చిన్న వెంకటేశ్వరరావు అక్టోబర్ 25న మోటారు సైకిల్‌పై భీమడోలు వస్తున్నాడు. ద్వారకాతిరుమల మండలం కప్పలగుంట గ్రామంలో జాతీయ రహదారిలో ఒక కల్వర్టు వద్ద మోటారు సైకిల్‌ను ఆపగా అప్పటికే పొలంలో దాగి ఉన్న ఇద్దరు వ్యక్తులు వెంకటేశ్వరరావుపై ఆకస్మికంగా దాడి చేశారు. రూ.10 వేలు, సెల్‌ఫోన్, బంగారు ఉంగరాన్ని బలవంతంగా లాక్కున్నారు. ఈ ఘటనపై ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్‌కుమార్ పర్యవేక్షణలో భీమడోలు సీఐ యూజే విల్సన్ ఆధ్వర్యంలో ఎస్సై సుధీర్, సిబ్బందితో దర్యాప్తు చేపట్టారు. దారి దోపిడీకి పాల్పడిన విజయ్‌కుమార్, త్రిమూర్తులను సాంకేతిక పరిజ్ఞానంతో అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment