రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రాజానగరం: కూలీ పని చేసుకుని జీవనం సాగిస్తున్న వ్యక్తి, అత్తవారింట ఉన్న భార్యాపిల్లలను చూసేందుకు వస్తూ మృత్యువాత పడ్డాడు. అటుగా బైక్‌పై వెళుతున్న వ్యక్తిని లిప్ట్ అడిగి, ఎక్కాడు. అదే అతని పాలిట మృత్యువైంది. బైక్‌పై కొంతదూరం ప్రయాణించిన వారిద్దరూ అది అదుపు తప్పడంతో ప్రమాదానికి గురయ్యారు. అత్తవారింటికి వెళ్లేందుకు లిప్టు అడిగిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా లిప్టు ఇచ్చిన వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మండలంలో దివాన్‌చెరువు నుంచి శ్రీరామపురం వెళ్లే రోడ్డులో గురువారం జరిగిన ప్రమాదంలో కేశవరానికి చెందిన చుక్కా శ్రీను (38) మృతి చెందాడు. ఇంజినీరింగ్ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. కేశవరం నుంచి వచ్చిన చుక్కా శ్రీను శ్రీరామపురంలోని అత్తవారింటికి వెళ్లేందుకు దివాన్‌చెరువు సెంటర్‌లో వేచివున్నాడు. అదే సమయంలో అటుగా బైకుపై వెళ్తున్న ఇంజినీరింగ్ విద్యార్థిని లిఫ్ట్ అడిగాడు. ఇద్దరూ కలిసి బైకుపై ప్రయాణిస్తుండగా రోడ్డు మార్జిన్ సరిగా లేకపోవడంతో బైకు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బైకు వెనుక కూర్చున్న శ్రీను అక్కడికక్కడే మృతి చెందగా నడుపుతున్న ఇంజినీరింగ్ విద్యార్థి తలకు, శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతనిని 108లో రాజమహేంద్రవరం చికిత్స నిమిత్తం తరలించారు. ఆ విద్యార్థి ముక్కినాడకు చెందిన జె. వెంకటేశ్వరరావుగా భావిస్తున్నారు. పాలచర్లలోని బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న అతను ఇంటికి వెళ్తున్న క్రమంలో ప్రమాదానికి గురయ్యాడు. కాగా మృతిచెందిన శ్రీనుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసును బొమ్మూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment