సమగ్ర వివరాలు అందించండి
● ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్
చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా
● ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా
అధికారులతో సమీక్ష
కాకినాడ సిటీ: ఎస్సీ ఉప కులాల వారీగా సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులపై కచ్చితమైన గణాంకాలతో సమగ్ర వివరాలను అందించాలని ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధికారులను కోరారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆయన గురువారం కాకినాడ జిల్లా కలెక్టరేట్‌లోని వివేకానంద సమావేశపు హాలులో అధికారులతో సమీక్షించి, ఆయా ఉప కులాల ప్రజల నుంచి అభిప్రాయాలు, వినతులు, విజ్ఞప్తులను స్వీకరించారు. ఉమ్మడి జిల్లాలో భాగమైన నాలుగు జిల్లాలకు సంబంధించిన ఎస్సీలలోని ఉపకులాల జనాభా, వారి స్థితిగతులపై అధికారులతో చర్చించారు. సమావేశంలో కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ ప్రజల గణాంకాలను ఏకసభ్య కమిషన్ చైర్మన్ రంజన్ మిశ్రాకు వివరించారు. 2011 జనాభా గణాంకాల ప్రకారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల మొత్తం జనాభా 52,85,824 మంది కాగా ఇందులో 9,57,302 మంది (18.11 శాతం) ఎస్సీ జనాభా ఉన్నారని కలెక్టర్ వివరించారు. ఉమ్మడి జిల్లాలో అక్షరాస్యత 70.50 శాతం ఉండగా, ఎస్సీ కులాల జనాభాలో అక్షరాస్యత 69.37 శాతంగా ఉందన్నారు. పురుషులలో 72.96 శాతం, మహిళలలో 65.79 శాతం అక్షరాస్యులుగా ఉన్నారని వివరించారు. ఎస్సీలలోని 59 ఉపకులాలకుగాను, జిల్లాలో 44 ఉపకులాల ప్రజలు ఉన్నారన్నారు. వీరిలో ప్రధానంగా 68,507 శాతం మాల, మాల అయ్యవారు వర్గం, 22.132 శాతం మాదిగ వర్గం, 4.873 శాతం ఆదిఆంధ్ర వర్గం, 1.556 శాతం రెల్లి వర్గం ప్రజలు ఉండగా మిగిలిన ఉప కులాలలో ఒకటి కంటే తక్కువ శాతం ఉన్నారని తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతటా విస్తరించిన ఎస్సీ జనాభా, ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారన్నారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి అంశాలలో వారి స్థితిగతులను, ప్రభుత్వ పథకాల ద్వారా వారికి లభిస్తున్న తోడ్పాటు గురించి కలెక్టర్ షణ్మోహన్ కమిషన్‌కు వివరించారు. కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్‌మిశ్రా మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు, కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఉపకులాల సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులపై అధ్యయనానికి ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు. 2011 జనాభా ఆధారంగా పూర్వ 13 జిల్లాల స్థాయిలో ఎస్సీలలోని 59 ఉపకులాల పరిస్థితులపై అధ్యయనాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అధికారులు తమ శాఖలలో పనిచేస్తున్న ఎస్సీ ఉద్యోగుల వివరాలను, కేడర్, ఉపకులాల వారీగా కచ్చితమైన గణాంకాలతో సమర్పించాలని కోరారు. జెడ్పీ సీఈవో, డీపీవోలు స్థానిక సంస్థలలో ఎస్సీల ప్రజాప్రాతినిధ్యంపై ఉపకులాల వారీగా సమాచారం అందజేయాలని కోరారు. విద్య, ఉపాధి రంగాల్లో ఉపకులాల వారీ సమాచారాన్ని, డీఈవో, డీఆర్‌డీఏ, మున్సిపాలిటీ, ఆర్టీ సీ తదితర శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ విక్రాంత్ పాటి ల్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, అసిస్టెంట్ కలెక్టర్ హెచ్‌ఎస్ భావన, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
311 వినతులు అందజేత
అధికారులతో సమావేశం అనంతరం ఏకసభ్య కమిషన్ చైర్మన్ వివిధ ఎస్సీ ఉపకులాలకు చెందిన ప్రజలు, సంఘాల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు, వినతులు, విజ్ఞాపనలను స్వీకరించారు. మొత్తం 311 వినతులు వివిధ షెడ్యూల్డ్ ఉప కులాల ప్రతినిధులు కమిషన్‌కు అందజేయగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలుమూలల నుంచి సుమారు 2,468 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ఎస్సీ ఉపకుల సంఘాలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ, కులాల పునర్విభజనపై వచ్చిన ఫిర్యాదులు, విజ్ఞప్తులను పూర్తిగా చర్చించి తదుపరి చర్యల నిమిత్తం కమిషన్ ప్రభుత్వానికి అందజేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాకినాడ రెవెన్యూ డివిజన్ అధికారి ఎస్ మల్లిబాబు, డీఎస్పీ రఘువీర్ విష్ణు, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ ఇన్‌చార్జి జేడీ జి.శ్రీనివాసరావు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సాంఘిక సంక్షేమశాఖ డీడీ పి.జ్యోతిలక్ష్మిదేవి, రాజమహేంద్రవరం ఇన్‌చార్జి జేడీ ఎం.సందీప్, సూపరింటెండెంట్‌లు బి.దొర, శ్రీనివాసు, వివిధ సహాయ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment