నిబద్ధతతో భూసేకరణ
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో జాతీయ రహదారులు(ఎన్‌హెచ్), రైల్వే, విమానయాన సంస్థల ద్వారా చేపడుతున్న పనులకు అవసరమైన భూసేకరణలో అధికార యంత్రాంగం నిబద్ధతతో వ్యవహరించాలని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. భూసేకరణ తదితర అంశాలపై విమానయాన, ఎన్‌హెచ్, రైల్వే అధికారులతో డీఆర్‌ఓ, కొవ్వూరు ఆర్‌డీఓల సమక్షంలో ప్రాజెక్టుల వారీగా కలెక్టరేట్‌లో గురువారం ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్‌హెచ్, రైల్వేలకు సంబంధించి 13 అంశాల ప్రగతిపై సమీక్షించామని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పోలవరం ప్రాజెక్ట్‌కు అనుసంధానంగా జీలుగుమిల్లి – పట్టిసీమ జాతీయ రహదారి భూసేకరణపై సమగ్ర వివరాలు అందజేయాలని ఆదేశించారు. పట్టిసీమ నుంచి పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతాన్ని రోడ్డు మార్గంతో కలపడంతో పాటు, పట్టిసీమ నుంచి కొవ్వూరుకు ప్రతిపాదించిన జాతీయ రహదారిపై కూడా సమీక్షించారని చెప్పారు. ఈ అంశాలపై సమగ్ర నివేదికను ఇరిగేషన్, ఎన్‌హెచ్, ఆర్‌అండ్‌బీ, రెవెన్యు అధికారులు సంయుక్తంగా పరిశీలించాలన్నారు. ఈ అంశంపై ఎన్‌హెచ్ అధికారులు ఈ నెల 23, 26 తేదీల్లో క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించనున్నారని కొవ్వూరు ఆర్‌డీఓ రాణి సుస్మిత తెలిపారు. తొలుత విమానాశ్రయ భూ సేకరణ ప్రక్రియలో మ్యుటేషన్, డ్రైనేజీ, విద్యుత్ సంస్థల ద్వారా ప్రతిపాదిత పనుల పురోగతిపై విమానాశ్రయ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ ప్రక్రియ సజావుగా జరుగుతోందని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ జ్ఞానేశ్వర్ తెలిపారు. నిడదవోలు ఆర్‌ఓబీ పనుల పురోగతిపై మాట్లాడుతూ, పిల్లర్ నిర్మాణం, ఇతర పనులను సమాంతరంగా చేపట్టడం వల్ల ఇబ్బందులను అధిగమించవచ్చని కలెక్టర్ చెప్పారు.
నేటి నుంచి ‘ప్రశాసన్ గావ్ కీ ఓర్’ వారోత్సవాలు
‘గరిష్ట పాలన – కనిష్ట ప్రభుత్వం’ విధానంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ ప్రశాంతి అన్నారు. ‘ప్రశాసన్ గావ్ కీ ఓర్’ సుపరిపాలనపై కేంద్ర పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం ఆధ్వర్యాన వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, జిల్లాల కలెక్టర్లతో వెబ్ కాస్టింగ్ ద్వారా నిర్వహించిన శిక్షణలో కలెక్టరేట్ నుంచి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారం, మెరుగైన సుపరిపాలన అందించేందుకు ఐదేళ్లుగా ‘ప్రశాసన్ గావ్ కీ ఓర్’ కార్యక్రమం చేపడుతున్నారని వివరించారు. దీనిపై శుక్రవారం నుంచి ఈ నెల 24 వరకూ వారోత్సవాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎల్‌డీఓలు పి.వీణాదేవి, స్లివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వాయు కాలుష్య నివారణకు చర్యలు
వాయు కాలుష్య నివారణకు సమన్వయ శాఖల అధికారులు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. ‘జాతీయ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం’లో భాగంగా కాలుష్య నియంత్రణ మండలి, రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ, రవాణా, వ్యవసాయ శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వాయు కాలుష్య నివారణకు ఉత్తమ పద్ధతులు అమలు చేయాలని అన్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అందజేసే నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. జైపూర్, న్యూఢిల్లీ తదితర నగరాల్లో వాతావరణ కాలుష్య నియంత్రణకు అమలు చేస్తున్న కార్యక్రమాలపై చర్చించారు. సమావేశంలో జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఈఈ ఎం.శంకరరావు, కేంద్ర ప్రభుత్వ కాలుష్య నివారణ సలహాదారు ఎ.కోమలి, నగరపాలక సంస్థ ఎస్‌ఈ జి.పాండురంగారావు, జిల్లా వ్యవసాయ, రవాణా అధికారులు ఎస్.మాధవరావు, ఆర్.సురేష్, జిల్లా పరిశ్రమల కేంద్రం సహాయ సంచాలకుడు ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు.
ఫ అధికారులకు కలెక్టర్ ప్రశాంతి ఆదేశం
ఫ భూ సంబంధ అంశాలపై సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment