తెగుళ్ల పొగ
దేవరపల్లి: వర్జీనియా పొగాకు తోటలకు పలు రకాల తెగుళ్లు సోకడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తోటలు వేసి దాదాపు నెల రోజులు దాటడంతో ఆశాజనకంగా ఉన్నాయని వారు ఆనందిస్తున్న తరుణంలో.. పలు గ్రామాల్లో తోటలకు నల్లకాడ, ఆకుముడత వంటి తెగుళ్లు వ్యాపిస్తున్నాయి. ఈ తెగుళ్లు సోకిన మొక్కలు మొదలు కుళ్లిపోయి చనిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. ఈవిధమైన తెగుళ్ల బారిన పడిన తోటలు కోలుకోవడం కష్టమని అధికారులు అంటున్నారు. ఎక్కువ శాతం మొక్కలకు తెగుళ్లు సోకితే దున్నివేసి మరలా వేయడం మంచిదని సూచిస్తున్నారు. ఈమేరకు పలు గ్రామాల్లో రైతులు ఇప్పటికే వేసిన తోటలను దున్నేసి, మళ్లీ నాట్లు వేస్తున్నారు. దీనివలన ఎకరాకు సుమారు రూ.50 వేల నష్టం వస్తోందని వారు వాపోతున్నారు. దేవరపల్లి, గోపాలపురం వేలం కేంద్రాల పరిధిలో పొగాకు తోటలకు ఈ తెగుళ్లు సోకాయి. గోపాలపురం వేలం కేంద్రం పరిధిలోని వాదాలకుంట, వెదుళ్లకుంట గ్రామాల్లో ఈ తెగుళ్లు విజృంభించాయి. దేవరపల్లి వేలం కేంద్రం పరిధిలో చిన్నాయగూడెం, సంగాయగూడెం, కృష్ణంపాలెం, బందపురం, దేవరపల్లి, యర్నగూడెం గ్రామాల్లో నల్లకాడ, ఆకుముడత తెగుళ్లు సోకాయని రైతులు చెబుతున్నారు. అయితే వీటి ఉధృతి తక్కువగా ఉందని వేలం నిర్వహణాధికారి పి.హేమస్మిత తెలిపారు. తెగుళ్లు సోకిన మొక్కలను తొలగించి కొత్త మొక్కలు వేసుకోవాలని ఆమె తెలిపారు. వాదాలకుంట, వెదుళ్లకుంట గ్రామాల్లో తెగుళ్లు సోకిన తోటలను ఇటీవల సీటీఆర్‌ఐ, ఐటీసీ శాస్త్రవేత్తలు, బోర్డు అధికారులు పరిశీలించి, రైతులకు సూచనలు చేశారు.
వాతావరణ మార్పులతో..
ఊహించని విధంగా వాతావరణంలో ఏర్పడుతున్న మార్పుల కారణంగా పొగాకు తోటలకు తెగుళ్లు సోకాయని అధికారులు చెబుతున్నారు. రెండు వారాలుగా చలిగాలుల తీవ్రత పెరిగింది. ఇదే సమయంలో మబ్బులతో కూడిన జల్లులు పడుతున్నాయి. ఇటువంటి వాతావరణం వల్లనే తోటలు తెగుళ్ల బారిన పడ్డాయని బోర్డు అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి పొగాకు తోటలకు మబ్బుల వాతావరణం అనుకూలం కాదు. 22 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉండరాదు. ప్రస్తుతం అదే పరిస్థితి నెలకొనడంతో పొగాకు తోటలకు తెగుళ్లు వ్యాపిస్తున్నాయి.
నల్లకాడ తెగులు లక్షణాలు
నల్లకాడ తెగులు మట్టి ద్వారా ఫైటోస్థోరా అనే శిలీంధ్రం వలన వస్తుంది. ఇది నారుమడిలో మానుమచ్చ (లీఫ్ బ్లెట్) గాను, ప్రధాన పంటలో నల్లకాడ (బ్లాక్‌షాంక్) గాను ప్రవర్ధనం చెందుతుంది. మేఘావృతమైన ఆకాశం, చెమ్మ వాతావరణం, చిత్తడి నేలలు, 22 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉంటే ఈ తెగులు ఆశించి, విస్తరిస్తుంది. ఇది నాలుగు వారాల నారుకు అధికంగా సోకుతుంది. ముందు సంవత్సరం తెగులు సోకిన ప్రదేశంలో మళ్లీ నారుమడి కట్టినా ఈ తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆకులపై కమిలినట్టు పెద్ద మచ్చలు (నీటిలో నానిన దూది మాదిరిగా) కనిపించడం వలన దీనిని ఆకుమచ్చ అని కూడా పిలుస్తారు. ఈ మచ్చలు పెద్దవై మొత్తం మొక్కకు విస్తరిస్తాయి. దీనివలన ఆకు కణజాలం, ఈనెలు, వేర్లు, క్రమేపీ మొక్క ఆసాంతం కుళ్లిపోతుంది.
ఫ నల్లకాడ తెగులు సోకి
చనిపోతున్న మొక్కలు
ఫ తోటలు దున్ని
మరలా వేయాల్సిన దుస్థితి
ఫ ఎకరాకు రూ.50 వేల నష్టం
ఫ పొగాకు రైతుల ఆందోళన
యాజమాన్య పద్ధతులు పాటించాలి
తెగుళ్లు సోకిన పొగాకు తోటల్లో యాజమాన్య పద్ధతులు పాటించాలి. తరచూ తెగులు ఆశించే తోటల్లో పంట మార్పిడి పాటించాలి. మురుగు నీటి కాలువలు ఏర్పాటు చేయాలి. తేమ అధికంగా ఉన్నప్పుడు నీటి తడులు ఇవ్వడాన్ని నియంత్రించాలి. ప్రస్తుతం తెగుళ్ల ఉధృతి తక్కువగానే ఉంది. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల నల్లకాడ, ఆకుముడత తెగుళ్లు అక్కడక్కడ వ్యాపించాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలి. బోదెల్లో నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తెగులు సోకిన మొక్కలను తొలగించి, కొత్తవి వేసుకోవాలి.
– జీఎల్‌కే ప్రసాద్, పొగాకు బోర్డు రీజినల్ మేనేజర్, రాజమహేంద్రవరం
Comments
Please login to add a commentAdd a comment