క్రీడలకు అధిక ప్రాధాన్యం
రాజానగరం: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ (శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు అన్నారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీని ఆదివారం సందర్శించిన ఆయన.. ఖేలో ఇండియా నిధులతో క్రీడా ప్రాంగణంలో చేపట్టిన మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, స్మిమ్మింగ్ పూల్ నిర్మాణాలను పరిశీలించారు. 2022 మార్చిలో ప్రారంభమైన ఈ పనులు గత ఏడాది సెప్టెంబరు నాటికి పూర్తి కావాల్సి ఉందని, కానీ కాంట్రాక్టర్ అలసత్వంతో తీవ్ర జాప్యం జరిగిందని అన్నారు. అందువల్లనే తాను వస్తున్నానని తెలిసి కూడా కాంట్రాక్టర్ పత్తా లేకుండా పోయాడన్నారు. ఇటువంటి వారిని బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు. పాఠశాల స్థాయి నుంచే క్రీడలను ప్రోత్సహించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం యూనివర్సిటీల్లో కూడా సరైన క్రీడా సదుపాయాలు లేవని అన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ఉప కులపతి ఆచార్య వై.శ్రీనివాసరావు, స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, డిప్యూటీ రిజిస్ట్రార్ ఎస్.లింగారెడ్డి, యూనివర్సిటీ ఇంజినీర్ కె.నూకరత్నం, ప్రిన్సిపాల్ కె.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
పీఆర్‌టీయూ జిల్లా నూతన కార్యవర్గం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్‌టీయూ) నూతన కార్యవర్గం ఎన్నిక స్థానిక సంహిత డిగ్రీ కళాశాలలో ఆదివారం జరిగింది. తొలుత జరిగిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా కృష్ణయ్య మాట్లాడుతూ, ఉపాధ్యాయుల ఆర్థికేతర సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్థిక సంబంధమైన డీఏ బకాయిలు, పీఆర్‌సీ ఎరియర్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఉపాధ్యాయులకు 30 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే హైస్కూల్ ప్లస్‌లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా పల్ల రాజారావు, ప్రధాన కార్యదర్శిగా యర్ర ఆగ్నేష్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఐవీ రమణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
లెక్కలతో
జీవితంలో ఎదుగుదల
రాజమహేంద్రవరం రూరల్: లెక్కల్లో పురోగతి సాధిస్తే జీవితంలో చక్కగా ఎదుగుతారని, దీనికి గణితోపాధ్యాయుల సహకారం చాలా అవసరమని ఏపీ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ (జేడీ సర్వీసెస్) ఎస్.అబ్రహం అన్నారు. ఆ దిశగా మరింతగా మాథ్స్ టీచర్స్ ఫోరం కృషి చేయాలని సూచించారు. స్థానిక శ్రీ సత్యసాయి గురుకులంలో ఆంధ్రప్రదేశ్ మ్యాథమెటిక్స్ ఫోరం ఆదివారం నిర్వహించిన జాతీయ మ్యాథ్స్ డేలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత గణిత పితామహుడు శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి అబ్రహం పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కంది వాసుదేవరావు మాట్లాడుతూ, గణితోపాధ్యాయులు చక్కగా బోధిస్తున్నారని, కొన్ని స్కూళ్లలో గణితం చిట్కాలు ప్రత్యేకంగా చెబుతున్నారని అన్నారు. ఏపీ మ్యాథ్స్ ఫోరం అధ్యక్షుడు సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ, రంగోలీ పోటీలు, పేపర్ ప్రజెంటేషన్, క్విజ్ ప్రోగ్రాంలలో టీచర్లందరూ ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. ఫోరం మహిళా కన్వీనర్ మేకా సుసత్యరేఖ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 500 మంది టీచర్లు పాల్గొన్నారని తెలిపారు. కార్యక్రమంలో సత్యసాయి గురుకులం కరస్పాండెంట్ శ్యాంసుందర్, ప్రిన్సిపాల్ గురయ్య, ఫోరం ప్రధాన కార్యదర్శి గంగులపూడి భాస్కర్, అడ్వైజరీ మెంబర్ అట్ల నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment