పవన్‌ కల్యాణ్‌ ప్రగల్భాలు ఆపాలి | - | Sakshi
Sakshi News home page

పవన్‌ కల్యాణ్‌ ప్రగల్భాలు ఆపాలి

Published Mon, Dec 23 2024 12:58 AM | Last Updated on Mon, Dec 23 2024 12:58 AM

పవన్‌ కల్యాణ్‌ ప్రగల్భాలు ఆపాలి

పవన్‌ కల్యాణ్‌ ప్రగల్భాలు ఆపాలి

మన్యంలో నేటికీ డోలీ మోతలే

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

పెద్దాపురం: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రగల్భాలు పలకడం ఆపాలని, మన్యం పర్యటన పేరుతో డాంబికాలు మినహా ఆయన వల్ల, రాష్ట్ర ప్రభుత్వం వల్ల గిరిపుత్రులకు ఒరిగేదేమి లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. సీపీఎం జిల్లా మహాసభల్లో పాల్గొన్న ఆయన ఆదివారం స్థానిక విలేకర్లతో మాట్లాడారు. డోలీ మోతలపై చర్యలు తీసుకుంటామని నాలుగు నెలల క్రితం ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం తెలియదా అని ప్రశ్నించారు.

గిరిజన ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం నెలకో రోజు మన్యం వెళ్లి ఉంటానని, డోలీ మోతలు లేని ఆరోగ్య సంరక్షణకు చర్యలు తీసుకుంటామని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారన్నారు. కానీ, ఇప్పటికీ మన్యంలో డోలీ మోతలు మినహా కాస్తంత అభివృద్ధి అయినా జరగలేదని అన్నారు. వైద్యం, విద్యా హక్కులతో పాటు ఆదివాసీలకు కీలకమైన భూ సమస్యను పవన్‌ కల్యాణ్‌ విస్మరించారన్నారు. మన్యంలో గ్రామసభల అనుమతులు లేకుండా మైనింగ్‌, జలవిద్యుత్‌ ప్రాజెక్టులకు, అదానీ కంపెనీలకు భూములను ధారాదత్తం చేసే విధానాలను పవన్‌ కల్యాణ్‌ వ్యతిరేకిస్తారా అని ప్రశ్నించారు, తప్పుడు విద్యుత్‌ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికే రూ.16 వేల కోట్ల విద్యుత్‌ భారాలు వేసిన కూటమి ప్రభుత్వం మరోసారి భారాలు మోపేందుకు సిద్ధంగా ఉందని దుయ్యబట్టారు. మీరు వేసే విద్యుత్‌ భారాలను ప్రజలు ఎందుకు భరించాలని ఆయన ప్రశ్నించారు.

పంట భూముల్లో ఎయిర్‌పోర్టు వద్దు

కాకినాడ సెజ్‌లో సుమారు 650 ఎకరాల ప్రభుత్వ భూమి నేటికీ ఖాళీగా ఉందని, వాటిలో పరిశ్రమలు పెట్టవచ్చని, అటువంటి చర్యలను ప్రభుత్వం ఎందుకు చేపట్టడం లేదని శ్రీనివాసరావు ప్రశ్నించారు. అన్నవరం వద్ద మూడు పంటలు పుష్కలంగా పండే భూములను విమానాశ్రయం కోసం రైతుల వద్ద తీసుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అటువంటి ప్రయత్నాలు విరమించుకుని, పంటలు పండని సాల్ట్‌ భూముల్లో ఎయిర్‌పోర్టు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. తమ భవిష్యత్‌ దెబ్బ తింటుందని రైతులు ఆందోళన చేస్తున్న చోట భూములు ఎందుకు సేకరిస్తున్నారని ప్రశ్నించారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పంటలు పండే భూమిని రైతుల అనుమతి లేకుండా తీసుకునే వీలు లేదని స్పష్టం చేశారు. రైతులకు అభివృద్ధి, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు వచ్చే విధంగా పరిశ్రమలు తీసుకురావాలని శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కన్వీనర్‌ రాజశేఖర్‌, మండల కన్వీనర్‌ డి.క్రాంతికుమార్‌, నాయకులు నీలపాల సూరిబాబు, సిరిపురపు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement