శిరసావహించండి
నాసిరకం వద్దు
ప్రజల అవసరాల రీత్యా బైక్‌ల వినియోగం పెరిగింది. ప్రజలు అధునాతన హంగులతో కూడిన ద్విచక్ర వాహనాలను రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. అయితే జీవితానికి అత్యంత భద్రత కల్పించే హెల్మెట్ విషయంలో మాత్రం అశ్రద్ధ చూపుతున్నారు. ప్రమాదాలు జరిగినప్పడు ఎక్కడ దెబ్బలు తగిలినా ప్రాణాలకు దాదాపు ముప్పు ఉండకపోవచ్చు. కానీ తలకు తగిలితే మాత్రం క్షణాల్లోనే ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. పోలీసులకు భయపడో.. తక్కువ ధరకు దొరుకుతున్నాయనే ఉద్దేశంతోనే కొంత మంది రోడ్ల పక్కన విక్రయించే నాసిరకం హెల్మెట్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే, అవి ప్రమాద సమయంలో వాహనచోదకులను ఏమాత్రం కాపాడలేవనే విషయం పరిశీలనల్లో తేలింది. అందువలన నాణ్యమైన హెల్మెట్లే వాడాలని అధికారులు సూచిస్తున్నారు. బీఐఎస్ స్టాండర్డ్ ప్రకారం తయారు చేసిన హెల్మెట్లలో సాగేతత్వం కలిగిన పాలిస్టర్ వినియోగిస్తారు. దీనివలన ప్రమాదం జరిగినప్పుడు తలకు దెబ్బ తగలకుండా రక్షణ లభిస్తుంది. అలాగే, ప్రమాద తీవ్రతను కూడా ఇది తగ్గిస్తుంది.
ఫ హెల్మెట్‌తో తలకు చక్కని రక్షణ
ఫ ధరించకుంటే ప్రాణాలకే ప్రమాదం
ఫ ఈ ఏడాది 91 మంది మృతి
ఫ నిర్లక్ష్యంపై హైకోర్టు సీరియస్
ఫ ద్విచక్రవాహన చోదకులకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు
రాజమహేంద్రవరం రూరల్: రోడ్లపై ద్విచక్ర వాహనాలు నడుపుతున్న కొంత మంది నిర్లక్ష్యానికి కేరాఫ్ అన్నట్టుగా ఉంటున్నారు. ఎంతమంది ఎన్నిసార్లు చెబుతున్నా హెల్మెట్ పెట్టుకోకుండా రయ్..మంటూ దూసుకుపోతున్నారు. అంతా సవ్యంగా సాగిపోయినప్పుడు ఏ ఇబ్బందీ ఉండదు. కానీ, ఊహించని విధంగా ప్రమాదానికి గురైతే.. రోడ్డుకు తల తగిలితే వారి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ జిల్లాలో జరిగిన 90 ద్విచక్ర వాహనాల ప్రమాదాల్లో కేవలం హెల్మెట్ ధరించనందువల్లనే తలకు తీవ్ర గాయాలై, ఏకంగా 91 మంది చోదకులు మృతి చెందారు. హెల్మెట్ ధరిస్తే ప్రాణాపాయం తప్పుతుందని తెలిసినా చాలా మంది పట్టించుకోవడం లేదు. పైగా శిరస్త్రాణం ధరించడాన్ని భద్రతగా కాకుండా భారంగా భావిస్తున్నారు. ఈ పరిస్థితిని నివారించేందుకే ద్విచక్ర వాహనాలు నడిపేవారితో పాటు వెనుక కూర్చున్న వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పోలీసులు, అధికారులు పదేపదే చెబుతున్నారు. చిన్నపాటి నిర్లక్ష్యం కుటుంబాలను రోడ్డున పడేస్తుందని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
హైకోర్టు ఆదేశాలతో..
ద్విచక్ర వాహనదారుల భద్రతకు, రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్యను తగ్గించేందుకు 1988లో మోటారు వాహన చట్టం కింద కేంద్ర ప్రభుత్వం 2019లోనే హెల్మెట్ ధారణ తప్పనిసరి చేస్తూ నిబంధన తీసుకుని వచ్చింది. 2010లో ఐక్యరాజ్య సమితి ఆదేశాల మేరకు దిచక్ర వాహనం నడిపే వారితో పాటు వెనుక కూర్చున్న వారు సైతం హెల్మెట్ పెట్టుకోవాలని స్పష్టం చేసింది. అయితే, ఎన్నిసార్లు చెప్పినా హెల్మెట్ పెట్టుకోవడంపై ప్రజలు పెద్దగా ఆసక్తి చూపకపోవడం.. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా పోలీసులు ఈ నిబంధన అమలును పెద్దగా పట్టించుకోవడం లేదన్న వాదనలు ఉన్నాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా మోటారు వాహన చట్టం సక్రమంగా అమలు కాక, ఏటా రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోందని గతంలో ఓ న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఇటీవల మన రాష్ట్ర హైకోర్టులో ఓ న్యాయవాది ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ద్విచక్ర వాహనాలు నడిపే వారు, వెనుక కూర్చున్న వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా పక్కా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. మోటార్ వాహన చట్టం నిబంధనలను ఉల్లంఘిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదనే సందేశాన్ని వాహనదారులందరికీ తెలియజేయాలని స్పష్టం చేసింది. హెల్మెట్ ధరించని వారికి అక్కడికక్కడే జరిమానాలు విధించాలని, వాటిని చెల్లించకుంటే 90 రోజుల్లోగా ఆ వాహనాన్ని జప్తు చేయాలని ఆదేశించింది. ఈ వ్యవహారాన్ని ఎంతమాత్రం తేలికగా తీసుకోవద్దని పేర్కొంది.
న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో
అవగాహన
రోడ్డు ప్రమాదాలపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సైతం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, రాష్ట్ర హైకోర్టు సూచనల మేరకు పేద విద్యార్థులకు, జూనియర్ న్యాయవాదులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యాన హెల్మెట్ ఆవశ్యకతను వివరిస్తూ అవగాహన ర్యాలీ సైతం నిర్వహించారు. హెల్మెట్ ధరించడంపై జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఆధ్వర్యాన అన్ని పోలీస్ స్టేషన్లలో అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించారు.
హెల్మెట్ తప్పనిసరి
జిల్లా పరిధిలో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరించడంపై ఇప్పటికే జిల్లాలో ర్యాలీలు, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాం. రోడ్డు ప్రమాదాల్లో అధిక మరణాలకు హెల్మెట్ ధరించకపోవడమే కారణం. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు, ప్రభుత్వ సూచనలతో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి. అలా కాకుండా నిబంధనలు అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని, జరిమానా విధిస్తాం.
– డి.నరసింహ కిషోర్,
జిల్లా ఎస్పీ,
తూర్పు గోదావరి
మాం...చి స్పీడ్ బైక్ ఎక్కి.. మెలికలు తిప్పుకుంటూ.. రోడ్డు మీద రివ్వుమంటూ వంద కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్నప్పుడు మజాగానే ఉంటుంది. కానీ.. ‘నాకేమవుతుందిలే’ అనే చిన్నపాటి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తే.. అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే.. ప్రాణాలకే ప్రమాదం వాటిల్లవచ్చు. అదే కనుక జరిగితే తనకే కాదు.. తన కుటుంబానికి సైతం ఎప్పటికీ తీరని విషాదమే మిగలవచ్చు. అందుకే ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించేలా చూడాలని.. ‘తల’కెక్కించుకోకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని సాక్షాత్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమే ఇటీవల ఆదేశించింది.
43 వేల మందికి జరిమానా
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ నిబంధనలను పక్కాగా అమలు చేసేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం నడుం బిగించింది. సోషల్ మీడియా వేదికగా హెల్మెట్ వినియోగంపై విస్తృత అవగాహన కల్పిస్తోంది. మరోవైపు ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ, నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు తీసుకుంటున్నారు. హెల్మెట్ ధరించని వారిపై చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా పోలీసులు చేపట్టిన తనిఖీల్లో హెల్మెట్ ధరించని 43 వేల మందికి జరిమానా విధించారు. హెల్మెట్ ధరించకపోవడంతో పాటు మద్యం తాగి వాహనాలు నడపడం, సెల్ ఫోన్ డ్రైవింగ్, మితిమీరిన వేగం, పరిమితికి మించి ప్రయాణం, ఎదుటి వాహనచోదకులను గమనించకపోవడం వంటి అంశాలు కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయనే విషయాన్ని గమనించాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment