లక్ష్మీనృసింహుని సన్నిధిలో సెంట్రల్ డీజీ చంద్రశేఖర్
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనృసింహుని ఆలయంలో బుధవారం సెంట్రల్ డీజీ ఆజాద్ చంద్రశేఖర్ (ఐపీఎస్), కుటుంబ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి చిత్రపటం, లడ్డు ప్రసాదంను ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ అందజేశారు.
యూపీ వ్యక్తిని కాపాడిన
మైరెన్ పోలీసులు
కాకినాడ రూరల్: సూర్యారావుపేట ఎన్టీఆర్ బీచ్‌లో పండగ పూట ఒక నిండు ప్రాణాన్ని మైరెన్ పోలీసులు కాపాడారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఆల్‌టెక్ పనులు నిమిత్తం వలస వచ్చిన వికాష్ పాండే బీచ్‌కు వచ్చి సముద్ర స్నానం చేస్తూ మునిగిపోయాడు. స్థానికుల అరుపులతో ఒడ్డున ఉన్న మైరెన్ కానిస్టేబుల్ గంగాధర్ సముద్రంలోకి దిగి కాపాడారు. ఎస్సై సురేష్, హెచ్‌సీ వెంకటేశ్వర్లు, పీసీ ప్రసాద్ సాయం చేశారు. గంగాధర్‌ను మైరెన్ సీఐ రామ్మోహన్‌రెడ్డి అభినందించారు.
ఎల్.గన్నవరంలో కారు దగ్ధం
పి.గన్నవరం: మండలంలోని ఎల్.గన్నవరం గ్రామంలో మంగళవారం ఒక కారు దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు భావిస్తున్నారు. అంబాజీపేట మండలం చిరతపూడి గ్రామానికి చెందిన కర్రా శ్రీనివాస్ హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామానికి వచ్చారు. మంగళవారం ఉదయం అంబాజీపేటకు వెళ్లి అక్కడ నుంచి కారులో పి.గన్నవరం మండలం ఎల్.గన్నవరం గ్రామంలోని డొక్కా సీతమ్మ వారి నివాసాన్ని తిలకించేందుకు వచ్చారు. రోడ్డు పక్కన కారును పార్క్ చేశారు. సీతమ్మ ఇంటిని తిలకించి తిరిగి వస్తుండగా, ఇంజన్ భాగంలో మంటలు వ్యాపించి కారు దగ్ధమైంది. స్థానికులు మంటలను ఆర్పి వేశారు. ప్రమాద స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు.
జనంలోకి దూసుకొచ్చిన
రెండెడ్ల బండి
అంబాజీపేట: మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో జరిగే ఏకాదశ రుద్రుల ప్రభల తీర్థానికి కొంతమంది ప్రత్యేకంగా అలంకరించిన రెండ్లడ్డ బండిపై వస్తూ ఉంటారు. గంగలకుర్రు నుంచి రెండెడ్ల బండిపై జగ్గన్నతోట తీర్థానికి వస్తున్న సమయంలో అక్కడ ఉన్న జనాలు, బూరలు ఊదడంతో ఎడ్లు భయపడి జనాల్లోకి దూసుకువచ్చాయి. దీంతో తీర్థానికి వచ్చిన నలుగురు భక్తులకు గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. అక్కడ ఉన్న జనం ఎద్దులను కట్టడి చేయడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు, భక్తులు ఊపిరిపీల్చుకున్నారు.
బైక్‌లు ఢీకొని ఒకరి మృతి
ప్రత్తిపాడు: స్థానికంగా మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు కిర్లంపూడి మండలం జగపతినగరం గ్రామానికి చెందిన మొగ్గా అభిషేక్ (12) తన స్నేహితుడితో కలిసి బైక్‌పై ప్రత్తిపాడు వస్తున్నాడు. ప్రత్తిపాడు గ్రామానికి చెందిన రాసూరి మహేష్‌కుమార్, కన్నూరి దుర్గాప్రసాద్ బైక్‌పై కిర్లంపూడి వైపు వెళ్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న బైక్‌లు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఢీకొనడంతో మొగ్గా అభిషేక్ (12) అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన మహేష్‌కుమార్, దుర్గాప్రసాద్‌ను స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ప్రత్తిపాడు ఎస్సై ఎస్. లక్ష్మీకాంతం కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ కాలువలోకి దూసుకుపోయి..
తాళ్లరేవు: మండల పరిధిలోని జి.వేమవరం పంచాయతీలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కాలువలోకి దూసుకుపోయిన ఘటనలో గండి వీరభద్రరావు(45) మృతి చెందినట్టు కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఆయన తెలిపిన వివరాల మేరకు కరప మండలం గొర్రిపూడి గ్రామానికి చెందిన వీరభద్రరావు జి.వేమవరంలోని రొయ్యల చెరువుల వద్ద పనిచేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్న సమయంలో చెరువుల వద్ద నుంచి ఇంటికి బైక్‌పై వెళుతుండగా స్థానిక ఆశ్రమం వద్ద బైక్ అదుపుతప్పి కాలువలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో వీరభద్రరావు మట్టిలో కూరుకుపోయి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేసినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment