ఉద్యోగులపై కత్తి
సాక్షి, రాజమహేంద్రవరం: ప్రభుత్వ సంక్షేమ ఫలాలను గుమ్మం వద్దనే అందించేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థపై కూటమి ప్రభుత్వం కుట్ర పన్నింది. హేతుబద్ధీకరణ పేరుతో ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కంకణం కట్టుకుంది. ఇప్పటికే జాబ్‌చార్ట్‌లో లేని పనులు చేయిస్తూ ఒత్తిడికి గురి చేస్తున్న సర్కారు.. తాజాగా ఉద్యోగుల కుదింపునకు శ్రీకారం చుట్టింది. అమరావతిలో శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే.. జిల్లా వ్యాప్తంగా వందలాది మంది సచివాలయ ఉద్యోగులు ఇతర శాఖలకు బదిలీ కానున్నారు. కొత్తగా భర్తీ చేయాల్సిన పోస్టులకు సైతం మంగళం పాడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఉద్యోగుల కుదింపునకు కుట్ర
జిల్లా వ్యాప్తంగా 512 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో 119 వార్డు, 393 గ్రామ సచివాలయాలు. వీటిలో 5,513 మంది ఉద్యోగులు ఉండాలి. కానీ, 4,323 మంది మాత్రమే ఉన్నారు. 1,190 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటి వరకూ ఒక్కో సచివాలయంలో 10 నుంచి 11 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారి సంఖ్య గణనీయంగా తగ్గనుంది. 2,500 కంటే జనాభా తక్కువగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆరుగురు, 2,500 నుంచి 3,500 మధ్య జనాభా ఉండే సచివాలయాల్లో ఏడుగురు, 3,500 పైబడి జనాభా ఉండే సచివాలయాల్లో ఎనిమిది మంది చొప్పున మాత్రమే ఉద్యోగులను కొనసాగించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా ఒక్కో సచివాలయం నుంచి ఇద్దరు ముగ్గురు ఉద్యోగాలకు ఎసరు పెట్టింది. సగటున ఒక్కో సచివాలయంలో ఎనిమిది మంది ఉద్యోగులను లెక్కగట్టినా.. 1,417 మందికి స్థాన చలనం కలగనుంది. వారిని ఇతర శాఖలకు బదిలీ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సచివాలయాలకు ప్రస్తుతం ఉన్న ప్రత్యేక సెక్రటరీలకు బదులు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, పట్టణాల్లో వార్డు పరిపాలనా కార్యదర్శి హెడ్‌గా ఉంటారని ప్రభుత్వం చెబుతోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో సచివాలయ ఉద్యోగులకు అత్యంత ప్రాధాన్యం లభించేది. ప్రత్యేకంగా డిపార్ట్‌మెంటల్ పరీక్షలు నిర్వహించి, అర్హత పొందిన కొందరికి పే స్కేల్స్ సైతం అమలు చేశారు. ఇప్పుడు తమ భవిష్యత్తు ఎలా ఉంటుందోననే ఆందోళన పే స్కేల్స్ పొందని వారిలో నెలకొంది.
1,190 పోస్టుల భర్తీకి మంగళం?
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో జీరో వేకెన్సీకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. శాఖలో ఖాళీ అయిన ఉద్యోగాల భర్తీకి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 1,190 పోస్టుల భర్తీకి మూడో విడత నోటిఫికేషన్ జారీ చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆ ప్రక్రియకు అప్పట్లో బ్రేక్ పడింది. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న హేతుబద్ధీకరణ పూర్తయితే కొత్త పోస్టుల భర్తీకి మంగళం పాడినట్లేనని పలువురు భావిస్తున్నారు.
మూడు కేటగిరీలుగా..
హేతుబద్ధీకరణ పేరుతో సచివాలయాల ఉద్యోగులను ప్రభుత్వం మూడు కేటగిరీలుగా విభజించనుంది. మల్టీపర్పస్, టెక్నికల్, ఆస్పిరేషనల్ ఫంక్షనరీలుగా విభజించి, జనాభా ఆధారంగా వారిని సచివాలయాలకు కేటాయించనుంది. పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్, ఎడ్యుకేషనల్ అసిస్టెంట్లు, మహిళా పోలీసు మల్టీపర్పస్ ఫంక్షనరీలుగా వ్యవహరిస్తారు. సచివాలయాల్లో కేటాయింపుల అనంతరం మిగిలిన ఉద్యోగుల్లో ఆస్పిరేషనల్ ఫంక్షనరీలను ఎంపిక చేస్తారు. ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్(ఎంఎల్) వంటి ఆధునిక సాంకేతికతను ప్రజల్లోకి తీసుకుని వెళ్లే కార్యక్రమాలకు వీరిని వినియోగిస్తారు.
మళ్లీ పాత కష్టాలు
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఆవిర్భావానికి ముందు నాలుగు గ్రామాలకు ఒక్క పంచాయతీ కార్యదర్శి మాత్రమే ఉండేవారు. వ్యవసాయ అసిస్టెంట్లు ఎక్కడో ఉండేవారు. మండలానికి ఒక సర్వేయర్, కొన్ని మండలాలకు ఇన్‌చార్జ్ సర్వేయర్లతో ప్రజలు ఇక్కట్లు పడేవారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న హేతుబద్ధీకరణ నిర్ణయంతో పాత రోజులు పునరావృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేషనలైజేషన్‌తో కీలకమైన ఉద్యోగులు రెండు మూడు గ్రామాలకు ఒకరి చొప్పున పని చేయాల్సిన పరిస్థితి మళ్లీ రానుంది. సర్వేయర్ల సమస్య తీవ్రంగా వేధించనుంది.
నిర్వీర్యమే లక్ష్యంగా..
ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేయాలనే సదుద్దేశంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు మన రాష్ట్రంలో అంకురార్పణ చేసింది. కలెక్టర్ల పర్యవేక్షణలో పరీక్ష నిర్వహించి మరీ సచివాలయ ఉద్యోగులను ఎంపిక చేశారు. మెరిట్‌కు ప్రాధాన్యం ఇస్తూ, ఎలాంటి పైరవీలకు తావు లేకుండా ఉద్యోగులను నియమించారు. ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కాయి. వీరితో పాటు ఈ వ్యవస్థలో కీలకమైన వలంటీర్లను స్థానిక అధికారులు ఎంపిక చేశారు. వీరందరూ ప్రజలకు వివిధ ప్రభుత్వ సేవలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకుని వచ్చారు. గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చిన పాలనా సంస్కరణలకు సమాధి కట్టే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే వలంటీర్ల వ్యవస్థను పూర్తిగా పక్కన పెట్టగా.. సచివాలయ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తోంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సింది పోయి వారిపై కత్తి దూస్తోంది.
జగన్ పాలనలో మాదిరిగా కాదు..
ఇప్పుడు అధికారం మాది..
మిమ్మల్ని కుదించక తప్పదు జాగ్రత్త!
సచివాలయ వ్యవస్థ
నిర్వీర్యానికి ప్రయత్నాలు
హేతుబద్ధీకరణ దిశగా
కూటమి సర్కార్ అడుగులు
ఉద్యోగుల కుదింపే లక్ష్యం
ప్రస్తుతం ఒక్కో సచివాలయంలో
11 మంది సిబ్బంది
రేషనలైజేషన్ ద్వారా 6 నుంచి 8 మందితో సరిపెట్టాలని యోచన
ఇతర శాఖలకు మిగిలిన వారిని
బదిలీ చేసేందుకు యత్నం
జిల్లాలో సచివాలయాల వివరాలు
సచివాలయాలు ఉండాల్సిన ఉన్న ఖాళీలు ఖాళీల
ఉద్యోగులు ఉద్యోగులు శాతం
119 (వార్డు) 1,190 940 250 21.01
393 (గ్రామ) 4,323 3,383 940 21.74
Comments
Please login to add a commentAdd a comment