తెరచుకునేదెప్పుడో..
● 20 రోజులుగా మూత పడిన వాడపల్లి, ఔరంగబాద్ బోట్స్‌మెన్ ర్యాంపులు
● ఇసుక కార్మికులకు తప్పని అవస్థలు
కొవ్వూరు: జిల్లాలోనే అతి పెద్ద బోట్స్‌మెన్ సొసైటీ ఇసుక ర్యాంపులు వాడపల్లి, ఔరంగబాద్. ఇవి మూత పడి 20 రోజులు పూర్తయినా, ప్రభుత్వం ఇంతవరకూ వీటిని తెరవలేదు. దీంతో పడవ కార్మి కులు ఉపాధి కరవై అల్లాడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 11 ర్యాంపులకు జల వనరుల శాఖ అధికారులు ఈ నెల 10వ తేదీన షార్ట్ట్ టెండర్లు పిలిచారు. కోటిలింగాల రేవుకు ఈ నెల 15 వరకూ గడువు ఇస్తూ ఈ నెల 4న అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ గడువు కూడా ముగిసింది. కొవ్వూరుకు మార్చి నెలాఖరు వరకూ, ఎరినమ్మ, వాడపల్లి–2, దండగుండ రేవు–1 ర్యాంపులను ఈ నెలాఖరు వరకూ పొడించారు. దండగుండ రేవు–2ను ఫిబ్రవరి 15వ తేదీ వరకూ, ఔరంగబాద్–2ను ఫిబ్రవరి నెలాఖరు వరకూ, గాయత్రీ ర్యాంపు–1ను మార్చి నెలాఖరు వరకూ, మరొకటి ఫిబ్రవరి నెలాఖరు వరకూ పొడిగించారు. కానీ, వాడపల్లి–1, ఔరంగబాద్–1 ర్యాంపుల గడువును ఇప్పటి వరకూ పొడిగించలేదు.
సాధారణంగా గోదావరిలో జూలై రెండో వారం వరకూ వరద జాడ ఉండదు. అప్పటి వరకూ బోట్స్‌మెన్ సొసైటీలతో నడిచే ర్యాంపుల్లో ఇసుక తవ్వకాలకు అనువైన పరిస్థితులుంటాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏడాదికి సరిపడే విధంగా ఆయా ర్యాంపుల్లో ఇసుక తవ్వకాలకు పరిమాణాన్ని లెక్కించి ఒకేసారి అనుమతులు ఇచ్చేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ మూడో వారంలో ఇచ్చిన అనుమతులు డిసెంబర్ నెలాఖరుకు పూర్తయ్యాయి. ప్రతి రెండు మూడు నెలలకోసారి అనుమతి పొందాల్సి రావడంతో ప్రతిసారీ వారం పది రోజుల పాటు ర్యాంపులు నిలిచిపోతున్నాయి. ఫలితంగా ఇసుకకు డిమాండ్ ఏర్పడి, ధర పెరిగి, వినియోగదారులు నష్టపోతున్నారు. మరోవైపు పడవ కార్మికులు తరచూ ఉపాధి కోల్పోతూ ఇబ్బందులు చవిచూస్తున్నారు. రాజకీయ కారణాలతో తాళ్లపూడి మండలంలోని బోట్స్‌మెన్ ర్యాంపులను ఇంత వరకూ తెరవనే లేదు.
అందుకే అనుమతులు ఇవ్వడం లేదా!
వాడపల్లి, ఔరంగబాద్ ర్యాంపుల నుంచి రోజుకు సగటున 500 లారీల ఇసుక సరఫరా చేసే అవకాశం ఉంది. అధికారిక లెక్కల ప్రకారం డివిజన్ మొత్తం మీద పడవల ర్యాంపుల ద్వారా రోజుకు 25 వేల టన్నుల ఇసుక సరఫరా జరుగుతూండగా.. దీనిలో 10 వేల టన్నులకు పైగా ఇసుక వాడపల్లి, ఔరంగబాద్–1 నుంచే సరఫరా జరిగేది. ఈ రెండు ర్యాంపులూ నడిస్తే ఈ ప్రాంతంలో ఇసుకకు కొరత అంటూ ఉండదు. కానీ, ఇంత పెద్ద ర్యాంపులను అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. కూటమి నేతలు కొత్తగా ఏర్పాటు చేసుకున్న ర్యాంపులు నడవడం కోసమే వీటికి అనుమతులు ఇవ్వడం లేదనే ఆరోపణలున్నాయి. ఈ రెండు ర్యాంపుల్లో 300కు పైగా పడవలున్నాయి. వేలాది మంది కార్మికులు నిత్యం ఉపాధి పొందుతున్నారు. రెండు గ్రామాలకూ సంబంధించి 120 వరకూ ఇసుక రవాణా చేసే లారీలున్నాయి. ర్యాంపులు మూతపడటంతో లారీలకు సైతం సకాలంలో ఇసుక దొరకని పరిస్థితి. ఔరంగబాద్–1, వాడపల్లి–1 మినహా మిగిలిన ర్యాంపులను ఇసుక పరిమాణం ఆధారంగా రెన్యువల్ చేశారు. వీటిని తెరవడంపై అధికారులు దృష్టి పెట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment