రాజమహేంద్రవరం సిటీ: జిల్లాలో జేఈఈ మెయిన్స్ పరీక్షలను బుధవారం నుంచి 30 వ తేదీవరకూ పకడ్బందీగా నిర్వర్తించాలని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జేఈఈ మెయిన్ –2025 పరీక్షల నిర్వహణపై సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జనవరి 22, 23 , 24, 28 , 29 , 30 తేదీలలో ఈ పరీక్షలను రాజమహేంద్రవరం లూథర్‌గిరి, రాజీవ్‌గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో నిర్వహిస్తున్నామన్నారు.
పరీక్ష సమయాలు : మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ , రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. పరీక్షా కేంద్రంలోకి ఉదయం షిఫ్ట్ నకు ఉదయం 7గంటల నుంచి 8.30 వరకూ, మధ్యాహ్నం షిఫ్ట్‌నకు 1 గంట నుంచి 2.30 గంటల వరకు అనుమతిస్తామన్నారు. పరీక్షా కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, వస్తువులను అనుమతించబోమన్నారు. పరీక్షా కేంద్రం ఆవరణలో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా పశు సంవర్థక అధికారి టి.శ్రీనివాసరావు, సిటీ కో ఆర్డినేటర్ ఎ.రాజేంద్రనాథ్, డిప్యూటీ తహసీల్దార్ వి.శ్రీనివాసరావు, వేగేశ్వరపురం జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జి. శ్రీనివాస్, డీటి బీవీ కృష్ణశాస్త్రి, వర్ష జైన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment