మన్యంలో పెరుగుతున్న చలి
బుట్టాయగూడెం: జిల్లాలోని మన్యం ప్రాంతంలో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతుంది. గత కొద్దిరోజులుగా తీవ్రమైన చలి గాలులు వీస్తున్నాయి. శీతాకాలం ప్రారంభంలోనే చలి గాలులు వీయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అటవీ ప్రాంతంలో సాయంత్రం 4 గంటలకే చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అలివేరు, లంకపాకల, రేగులపాడు, రేపల్లె, గొట్టాలరేవు, చింతకొండ, ఎర్రాయిగూడెం గ్రామాలతోపాటు ముంజులూరు, గడ్డపల్లి, గిన్నేపల్లి, వీరన్నపాలెం, గోగుమిల్లి గ్రామాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది. 5 గంటల తర్వాత చీకటిపడే పరిస్థితి రావడంతోపాటు చలి తీవ్రంగా ఉండడంతో చలి మంటలు కాగుతూ ప్రజలు సేదతీరుతున్నారు. తెల్లవారుజామున చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతోపాటు 9 గంటల వరకూ మంచు ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. ఉదయం పూట 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:
గిరిజన ప్రాంతంలో చలి తీవ్రత పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, శ్వాస కోశ వ్యాధులతో బాధపడేవారు కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. చలిలో బయట తిరగకూడదని చెబుతున్నారు. శీతాకాల సీజన్‌లో వృద్ధులు గుండెపోటుకు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment