పోలవరం కాలువ గట్టుపై ఆగని మట్టి తవ్వకాలు
మామూళ్ల మత్తే కారణమంటున్న స్థానికులు
ద్వారకాతిరుమల: అధికారం మనదే.. మన వెనుక ఖద్దర్ చొక్కా ఉంది.. మనల్ని ఎవడ్రా ఆపేది.. అంటూ పోలవరం కుడి కాలువ గట్టుపై గ్రావెల్ మట్టి అక్రమ తవ్వకాలు జరుపుతున్న తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. డబ్బు ఇచ్చి.. మట్టిని పట్టుకెళ్లండి అంటూ ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు. అడ్డుకట్ట వేయాల్సిన అధికార యంత్రాంగం నిద్ర నటిస్తోంది. మండలంలోని ఎం.నాగులపల్లి, లైన్ గోపాలపురం గ్రామాలకు చెందిన కొందరు తెలుగు తమ్ముళ్లు పోలవరం కాలువ గట్టును ఆదాయ వనరుగా ఎంచుకున్నారు. కాలువ గట్టుపై పగలు, రాత్రి అనే తేడా లేకుండా మట్టి తవ్వకాలను జోరుగా సాగిస్తున్నారు. దీనిపై ఈనెల 9న సాక్షి దినపత్రికలో శ్రీపచ్చ ముఠాశ్రీ మట్టి మాఫియా శీర్షికన క నం ప్రచురితమైంది. దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ అక్రమార్కులు ఆ రోజు తవ్వకాలను నిలిపివేశారు. అధికార యంత్రాంగం చూసిచూడనట్టు వ్యవహరించడంతో మట్టి మాఫియా యథావిధిగా ఆదివారం మట్టి తవ్వకాలు జరిపింది. ఏలూరుకు చెందిన టిప్పర్లు పెద్ద ఎత్తున మట్టిని తరలించాయి. మామ్మూళ్ల మత్తులో అధికారులు జోగడం వల్లే మట్టి మాఫియాకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని స్థానికులు ధ్వజమెత్తుతున్నారు. ఏలూరుకు చెందిన ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ యజమాని ఇప్పటికే మట్టి కోసం పెద్ద మొత్తంలో నగదును సదరు పచ్చనేతలకు ముట్టజెప్పినట్టు తెలుస్తోంది. ఇంతవరకూ ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment