తక్కువ రేటుకు బంగారం పేరిట టోకరా
కామవరపుకోట: బంగారు వస్తువులు తక్కువ రేటుకి ఇస్తామని నమ్మబలికి 50 మంది నుంచి సుమారు రూ.40 లక్షల వరకు వసూలు చేసి పరారైన ఘటన కామవరపుకోటలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరుకు చెందిన ఎస్.కె.నజీర్, ఎస్.కె.ఫిరోజ్ 10 ఏళ్ల క్రితం కామవరపుకోట ఇండియన్ బ్యాంకు ఎదురుగా మదీనా జ్యుయలరీ పేరుతో షాపు ప్రారంభించారు. చుట్టుపక్కల ప్రాంతాల వారికి బంగారు వస్తువులు తయారు చేసి తక్కువ రేటుకి ఇస్తూ వచ్చారు. వారిలో నమ్మకాన్ని కలిగించి, అదే నమ్మకంతో తక్కువ రేటుకి బంగారు ఆభరణాలు ఇస్తానని నమ్మబలికి సుమారు 50 మంది నుంచి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వరకు అడ్వాన్సుగా సుమారు రూ.40 లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు. రోజులు గడుస్తున్నా వస్తువులు ఇవ్వకపోవడంతో, అనుమానం వచ్చిన బాధితులు షాపు దగ్గరికి వెళ్ళగా తాళాలు వేసి, ఫోను స్విచ్ ఆఫ్ చేయటంతో మోసం పోయామని గ్రహించి స్థానిక తడికలపూడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి.చెన్నారావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment