రైతుల పక్షాన పోరాటం చేస్తాం
వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డి రఘురాం
తాడేపల్లిగూడెం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డి రఘురాం విమర్శించారు. బుధవారం ఆయన నివాసం వద్ద విలేకర్లతో మాట్లాడారు. రైతులకు పంటల బీమా ప్రీమియంను కూటమి ప్రభుత్వం ఎత్తివేయడం దారుణం అన్నారు. విజయవాడ ప్రాంతంలో బుడమేరు, తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాలలో ఎర్ర కాలువ ముంపు సంభవించినప్పుడు ఇన్యూరెన్స్ కంపెనీలతో మాట్లాడి రైతులను ఆదుకునేందుకు కొత్త పథకాలు తీసుకురానున్నట్లు గతంలో విజయవాడలో చంద్రబాబు హడావిడి చేశారన్నారు. రైతులకు కేంద్రం ఇచ్చే రూ.6,500తో పాటు కూటమి ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసా రూ.20 వేలతో కలుపుకుని మొత్తం రూ.26,500 సంక్రాంతి నాటికి రైతులకు చెల్లించాలని రఘురాం డిమాండ్ చేశారు. గూడెం ప్రాంతంలో ఎర్రకాలువ ముంపు సంభవించినప్పుడు రెండో పంటగా రైతులు మినుము, మొక్కజొన్న పంటలు వేసుకున్నారని అది కూడా ఎర్ర కాలువకు రెండో సారి వరద రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఆక్వారైతులకు రాయితీపై యూనిట్ రూ.1.50కు ఇవ్వకపోయినా, సంక్రాంతి నాటికి రైతు భరోసా అమలు చేయకపోయినా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడి, రాష్ట్ర స్థాయిలో రైతులతో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment