హరిదాసుడిపై టీడీపీ నేత జులుం
ఉంగుటూరు: కూటమి నాయకుల దందాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. చివరకు సంక్రాంతి నెలలో ఇంటింటా తిరిగి దానాలు తీసుకునే హరిదాసులను కూడా వీరు వదలడం లేదు. మండలంలోని కై కరం గ్రామంలో ఓ హరిదాసుడిని టీడీపీ నేత ముప్పుతిప్పలు పెడుతున్న వైనం వివాదానికి దారితీసింది. వివరాలిలా ఉన్నాయి.. ఏటా మాదిరిగా హరిదాసు రమేష్ గ్రామంలో సంచరిస్తూ దానాలు తీసుకుంటున్నారు. అయితే గ్రామానికి చెందిన ఓ టీడీపీ నేత రమేష్‌ను గ్రామంలో తిరగ డానికి వీలులేదని, దానాలు తీసుకోవాలంటే రూ.2.50 లక్షలు ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశాడు. ఇందుకు ససేమిరా అనడంతో దుర్భాషలాడుతూ, దౌర్జన్యం చేయడంతో పాటు తన ద్విచక్రవాహనం తాళం చెవి తీసుకుని టీడీపీ నేత ఇబ్బంది పెట్టాడని రమేష్ వాపోయారు. రమేష్ నాలుగేళ్ల నుంచి సంక్రాంతి నెలలో గ్రామంలో తిరుగుతున్నారు. అయితే నాలుగేళ్లకు ముందు మరో హరిదాసు ఇక్కడ తిరిగేవారు, ఆయన ఇప్పుడు మరలా వచ్చి గ్రామంలో తిరుగుతానని అనడం వివాదస్పదమైంది. దీంతో వీరి పంచాయితీ గ్రామపెద్ద టీడీపీ నేతకు వెళ్లడంతో ఒక ఏడాది ఒకరు, మరో ఏడాది మరొకరు తిరగమని ఆదేశించారు. ఇందుకు బాధితుడు రమేష్ అంగీకరించకపోవడంతో రూ.2.50 లక్షలు ఇవ్వాలని టీడీపీ నేత డిమాండ్ చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో రమేష్‌ను ఇబ్బంది పెడుతున్నట్టు హరిదాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై చేబ్రోలు ఎస్సై సూర్యభగవాన్‌ని వివరణ కోరగా అలాంటిది ఏమీ లేదని, ఇరువర్గాలను తగువు లేకుండా సరిచేశారని, హరిదాసుల పెద్దలు కూడా ఉన్నారని అన్నారు.
గ్రామంలో తిరగాలంటే రూ.2.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్
కైకరంలో రచ్చకెక్కిన వివాదం
Comments
Please login to add a commentAdd a comment