టీడీపీ నేతల మాటల యుద్ధం
నూజివీడు: నూజివీడు, గన్నవరానికి చెందిన టీడీపీ నాయకుల మధ్య అక్రమ మైనింగ్ వ్యవహారంపై విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. గన్నవరం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు ఈ నెల 6న నూజివీడులో అక్రమ మైనింగ్ జరుగుతుందని విమర్శించగా, దానికి కౌంటర్‌గా నూజివీడు టీడీపీ నాయకులు మంగళవారం రాత్రి పట్టణంలో విలేకర్ల సమావేశం నిర్వహించి ప్రతివిమర్శలు చేశారు. రావిచర్ల సర్పంచి కాపా శ్రీనివాసరావు, టీడీపీ నాయకుడు లింగమనేని కిషోర్‌లు మాట్లాడుతూ అసలు జరగని మైనింగ్‌కు మంత్రి పార్థసారధి ప్రమేయం ఉందనే ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. నూజివీడులో సొంత పార్టీలో కొంతమంది నాయకుల మధ్య ఏవైనా సమస్యలు ఉంటే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండటం బాధాకరమన్నారు. గన్నవరం టీడీపీ నాయకులు తనపై చేసిన ఆరోపణలను లింగమనేని కిషోర్ తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార సభకు తనకు రావలసిన బిల్లులు ఇప్పటికీ రాక ఆఫీసర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై ఏ చర్చకై నా సిద్ధమన్నారు. మంత్రి పార్థసారథిపై గన్నవరం టీడీపీ నాయకులు అవాకులు చవాకులు పేలితే సహించేది లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment