13 నుంచి సంక్రాంతి సంబరాలు
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చిన వెంకన్న దివ్య క్షేత్రంలో ఈనెల 13 నుంచి 15 వరకు సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ ఇన్‌చార్జి ఈఓ వేండ్ర త్రినాథరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. భోగి పండుగను పురస్కరించుకుని 13న ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతంలోని ఖాళీ ప్రదేశంలో కోలాట నృత్యాలు, హరిదాసులు, బుడబుక్కల వేషధారణలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 14న సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు చెప్పారు. అలాగే 15న కనుమ పండుగ సందర్భంగా దొరసానిపాడు గ్రామంలో శ్రీవారికి కనుమ ఉత్సవాన్ని అట్టహాసంగా నిర్వహిస్తామన్నారు. అందులో భాగంగా ఆరోజు మధ్యాహ్నం 2 గంటలకు స్వామివారు ఆలయం నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాట నృత్యాల నడుమ దొరసానిపాడుకు బయలుదేరి వెళతారని, అక్కడ కనుమ మండపంలో అర్చకులు, పండితులు వేద మంత్రోచ్ఛరణలతో ఉత్సవాన్ని వైభవంగా జరుపుతారని తెలిపారు. ఆ తర్వాత శ్రీవారు గిరి ప్రదక్షిణగా ఆలయానికి చేరుకుంటారని చెప్పారు. అధిక సంఖ్యలో భక్తులు వేడుకల్లో పాల్గొని తరించాలని ఈఓ త్రినాథరావు కోరారు.
చినవెంకన్న క్షేత్రంలో ప్రత్యేక ఏర్పాట్లు
14న నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలు రద్దు
15న కనుమ ఉత్సవం
Comments
Please login to add a commentAdd a comment