పట్టపగలే భారీ బరులు సిద్ధం
కై కలూరు: జూదాలు వద్దు.. సాంప్రదాయ క్రీడలే ముద్దు.. అంటూ పోలీసులు మొత్తుకుంటున్నారు. కై కలూరు నియోజకవర్గంలో ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో చూసినా భారీ బ్యానర్లతో ఆయా గ్రామాల్లో ప్రజలకు పోలీసు సిబ్బంది అవగాహన కలిగిస్తున్నారు. కై కలూరులో అయితే పోలీసుశాఖ ఆధ్వర్యంలో యువత జూదాలకు ఆకర్షితులు కావద్దని క్రికెట్ టోర్నమెంట్ సైతం ఏర్పాటు చేశారు. ఒక వైపు ఇంతలా పోలీసు ప్రచారం జరుగుతున్నా.. మరోవైపు పందాల నిర్వాహకులు పట్టపగలే భారీ బరులను ఏర్పాటు చేస్తున్నారు. కలిదిండి నుంచి భోగేశ్వరలంక వెళ్లే రహదారిలో పంటపొలాల మధ్య భారీగా బరి ఏర్పాటు చేస్తున్నారు. ఇదే కాకుండా ముదినేపల్లి, మండవల్లి మండలాల్లో సైతం బరులకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో పండగ మూడు రోజులు ముందు బారులు వెలిసేవి. కూటమి ప్రభుత్వంలో నిర్వాహకులు ముందుగానే పందాలకు బరులను సిద్ధం చేసుకుంటున్నారు. కలిదిండిలో ఏర్పాటు చేస్తున్న భారీ బరిపై ఎస్సై వెంకటేశ్వరరావును వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.
జూదాలు వద్దని హెచ్చరిస్తున్న పోలీసులు
పట్టించుకోని కోడి పందాల నిర్వాహకులు
Comments
Please login to add a commentAdd a comment