జగన్‌ను కలిసిన జేపీ
ఏలూరు టౌన్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వైఎస్సార్‌సీపీ ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ముందుస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఏలూరు నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులపై పార్టీ అధ్యక్షుడికి వివరించారు. పార్టీ కార్యకర్తలతో నిత్యం మమేకమవుతూ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వ పాలనలో పేదవర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలకు భరోసా కల్పిస్తూ రాబోయే కాలంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల్లోకి వచ్చేందుకు సన్నద్ధం అవుతున్నారని జేపీ తెలిపారు.
దేహదారుఢ్య పరీక్షలకు 459 మంది హాజరు
ఏలూరు టౌన్: ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చేపట్టిన కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ కొనసాగుతుంది. ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో బుధవారం దేహదారుఢ్య పరీక్షలకు అభ్యర్థులు హాజరయ్యారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో 600 మంది పురుష అభ్యర్థులకు హాల్ టిక్కెట్లు జారీ చేశారు. ఎంపిక పోటీలకు 459 మంది హాజరుకాగా.. వారిలో 313 మంది ఎంపికైనట్లు ఎస్పీ శివకిషోర్ చెప్పారు. అభ్యర్థులు ఎంపిక పోటీలకు హాజరయ్యే సమయంలో తమ ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్లతో రావాలని ఆయన తెలిపారు.
రోడ్లు, మంచినీటి పథకాలపై సమీక్ష
ఏలూరు(మెట్రో): జిల్లాలో ఆర్‌అండ్‌బీ రహదారుల పనులు త్వరితగతిన పూర్తిచేయాలని జెడ్పీ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ చెప్పారు. బుధవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్థాయి సంఘం సమావేశం జరిగింది. ఆర్‌అండ్‌బీ రహదారుల పురోగతి, ఆర్‌డబ్ల్యూఎస్ స్కీం కింద అమలు చేస్తున్న మంచినీటి పథకాల ఏర్పాటు, ఇరిగేషన్‌కు సంబంధించి కాల్వలకు నీటి విడుదల వంటి అంశాలపై చర్చించి సూచనలు చేశారు. ఎమ్మెల్సీ గోపిమూర్తి, ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాసరావు, బడేటి రాధాకృష్ణయ్య (చంటి), పత్సమట్ల ధర్మరాజు, బొమ్మిడి నాయకర్ తదితరులు పాల్గొన్నారు.
32 మంది పోలీస్ సిబ్బందికి బదిలీలు
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా పోలీస్ శాఖలో పనిచేస్తున్న 32 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ ఎస్పీ కొమ్మి ప్రతాప శివ కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే ఆయా స్టేషన్లల్లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. బదిలీ చేసిన వారిలో ఏఎస్సై, పది మంది హెడ్ కానిస్టేబుళ్లు, ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు, 18 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు.
రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలి
ఏలూరు(మెట్రో): జిల్లాలో రూ.97 కోట్లతో చేపట్టిన ఆర్‌అండ్‌బీ రహదారుల అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సూచించారు. బుధవారం జెడ్పీ స్థాయి సంఘ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంతలు రహిత ఏలూరు జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కోరారు. కీలకమైన ఏలూరు, జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారులతోపాటు మరికొన్ని రహదారుల అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తిచేయాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment