సీతాల్.. గురక చేపకు చెక్
కై కలూరు: పైరులో కలుపు మొక్కల నివారణతో దిగుబడి పెరుగుతోంది. అదే విధంగా ఆక్వా చేపల చెరువుల్లో సీతాల్ చేపలతో దిగుబడులు పెరుగుతాయి. సీతాల్ చేపలు చెరువుల్లో మేతలను హరించే గురక జాతి చేప గుడ్లను, హాని కలిగించే ఇతర జీవులను తినేస్తాయి. లక్షల్లో పెట్టుబడుల పెట్టి సాగు చేస్తున్నా రైతులు రోజు వారీ చేపల చెరువుల్లో వాడే మేతలను కాపాడుకోడానికీ సీతాల్ చేపలు సాయపడుతున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో 1.25 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ఏటా 4.50 లక్షల టన్నుల ఉత్పత్తి చేస్తున్నారు. దాదాపు రూ.20 కోట్లపైనే టర్నోవర్ ఉంది. దేశంలోనే ఆక్వా ఉత్పత్తులలో ఏపీ అగ్రస్థానంలో ఉంది. అందులోనూ సింహభాగం కొల్లేరు ప్రాంతం నుంచి చేపల ఉత్పత్తి అవుతోంది. ఈ చేపల సాగులో తెల్ల చేపలకు తోడు చైనా గురక పెరుగుతోంది. సాగు చేపలకు వేసిన తవుడు, చెక్క వంటి మేతలను ఇవి తినేస్తున్నాయి. గురక చేపల సమస్యను నివారించడానికి సీతాల్ చేపలను రైతులు చెరువుల్లో వదులుతున్నారు.
ఏమిటీ సీతాల్.. సీతాల్ మాంసాహారి చేప. దీనినే చిటలా, సీతాల్, చిటోల్, కత్తిచేప అని పిలుస్తారు. ఇండియన్ ఫెదర్ బ్యాక్, ఇండియన్ నైట్ ఫిష్ అనే పేర్లు కూడా ఉన్నాయి. బంగారు, వెండి రంగుల్లో ఉంటూ పైన నల్లటి చారలు ఉంటాయి. నాలుగు అడుగుల వరకు పెరిగి 5 నుంచి 6 కేజీల బరువు ఉంటాయి. బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ సమీప బ్రహ్మపుత్ర, సింధు, గంగానది, మహానంది నదుల్లో కనిపిస్తాయి. పురాణేతిహాసాల ప్రకారం హిందూమతంలో మహావిష్ణువు అవతారాల్లో ఒకటిగా ఈ చేపకు స్థానం ఉంది. మత్స్యావతారంలో విష్ణువు రాక్షసుడిని కత్తి ఆకారం కలిగిన ఈ చేపతోనే సంహరించినట్లు భావిస్తారు.
సీతాల్‌తో ఉపయోగాలు
బెంగాల్ ప్రాంతం నుంచి సీతాల్ చేపల సీడును తీసుకొస్తున్నారు. నాలుగు అంగుళాల చేపను రూ.25 నుంచి రూ.30కు విక్రయిస్తున్నారు. ఎకరం చేపల చెరువులో సీతాల్ పిల్లలను 30 నుంచి 50 విడిచిపెడుతున్నారు. వీటిలో కొన్ని మరణించినా కనీసం 25 చేపలైన జీవిస్తున్నాయి. సీతాల్‌లు గుడ్లు పెట్టవు. మాంసహారులు కావడంతో పెంపకం చేపలకు వేసిన తవుడు, చెక్కలను ఇవి తినవు. గురక చేపల గుడ్లను వెంటనే తినేస్తాయి. చిన్న గురక పిల్లను వేటాడతాయి. ఒక్కో రైతు ఒకే చెరువులో నాలుగేళ్ళు సీతాల్ చేపలను పెంచవచ్చు. పట్టబడి సమయంలో ఈ చేపలను బయటకు తీసి విక్రయిస్తే మంచి గిరాకీ ఉంటుంది. సీతాల్ చేప మార్కెట్‌లో కేజీ రూ.350 నుంచి రూ.400 కొనుగోలు చేస్తారు. కొవ్వుతో కూడిన మాంసంతో సీతాల్ రుచికరంగా ఉంటుంది.
ఆక్వాలో శత్రు చేపలను భక్షించే చేప
చైనా గురక చేప గుడ్లు స్వాహా
బంగ్లాదేశ్ నుంచి కొల్లేరుకు చేరుతున్న చేప సీడ్
సీతాల్ సీడ్‌కు గిరాకీ
చేపల చెరువు సాగులో సీతాల్ చేపలను వదలడం వల్ల గురక చేప వ్యాప్తిని నివారించవచ్చు. బెంగాల్ నుంచి సీతాల్ సీడ్ వస్తోంది. సమీప ఏలూరు నుంచి తీసుకొచ్చి విక్రయిస్తాం. సైజను బట్టి ఒక్కో చేప పిల్ల రూ.30 పలుకుతుంది. ప్రస్తుతం చైనా గురక విపరీతంగా పెరగుతోంది. వీటిని నివారించడానికి సీతాల్ చేప సీడ్‌కు డిమాండ్ ఏర్పడింది.
– మంగినేని రామకృష్ణ, సీడ్ సరఫరా వ్యాపారి, కై కలూరు
చేపల రైతులకు నేస్తం
చేపల రైతులకు మంచి నేస్తంగా సీతాల్ చేప ఉంది. రూ. లక్షలు వెచ్చించి మేతలు వేస్తుంటే చైనా గురక చేపలు తినేస్తోన్నాయి. దీంతో సాగు చేపలకు మేత తగ్గుతోంది. సీతాల్ చేపలు గుడ్డు దశలోనే వాటిని తినేస్తున్నాయి. చేపల చెరువుల్లో పట్టుబడి చేసినప్పుడు కావాలంటే వీటిని మళ్ళీ చెరువులో వదిలిపెట్టవచ్చు. ఇతర చేపల గుడ్లు తినడం వల్ల సీతాల్ చేప మరింత రుచిగా ఉంటుంది.
– దండు రంగరాజు, చేపల రైతు, కై కలూరు
Comments
Please login to add a commentAdd a comment