ఎకో జోన్ వద్దంటూ నిరసన
ఆకివీడు: ప్రజల కొంప ముంచే కొల్లేరు ఎకో సెన్సిటివ్ జోన్ ఏర్పాటును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆకివీడు మండల ప్రజలు, నాయకులు స్పష్టం చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం ఏర్పాటు చేసిన సమావేశాన్ని నాయకులు, ప్రజలు, రైతులు తీవ్రంగా వ్యతిరేకించి సమావేశం ముందు బైఠాయించారు. ధర్నా చేసి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ కొల్లేరు అభయారణ్యం, 120 జీవో వల్ల తీవ్రంగా నష్టపోయామని, జిరాయితీ రైతులకు నేటికీ నష్టపరిహారం ఇవ్వలేదని వాపోయారు. ఎకో జోన్ వల్ల 10 కిలోమీటర్ల దూరం వరకూ ఏ విధమైన ఫ్యాక్టరీల నిర్మాణం, కట్టడాలు జరగవని దీనివల్ల గ్రామాలకు గ్రామాలు వలసలు పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పంట పొలాలు నష్టపోయామన్నారు. నష్టపరిహారం ఇవ్వాలని, కొల్లేరు కాంటూర్‌ను మూడుకు కుదించాలని, ఎకో జోన్ ప్రస్తావనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ మేరకు తహసీల్దార్, అభయారణ్య రేంజర్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎన్.వెంకటేశ్వరరావు, ఆర్‌ఐ ఆంజనేయులు, రేంజర్ సెక్షన్ అధికారిణి సుజాత, ఎస్సై హనుమంతు నాగరాజు, నాయకులు మోటుపల్లి ప్రసాద్, జంపన సత్యనారాయణరాజు, సుబ్రహ్మణ్యం రాజు, జేకే, భగవాన్‌రెడ్డి, కనుమూరు రామకృష్ణంరాజు, సర్పంచ్‌లు చిగురుపాటి చిట్టిబాబు, గురువెల్లి అన్నపూర్ణ, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment