కూటమి గూడుపుఠాణి | - | Sakshi
Sakshi News home page

కూటమి గూడుపుఠాణి

Published Mon, Jan 20 2025 1:39 AM | Last Updated on Mon, Jan 20 2025 1:39 AM

కూటమి గూడుపుఠాణి

కూటమి గూడుపుఠాణి

ఏలూరు(మెట్రో) : పేదోడి సొంతింటి కల సాకారం చేసేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుని ఇల్లు లేని పేదలకు గృహాలను మంజూరు చేసింది. కోట్లాది రూపాయలు వెచ్చించి ఇంటి నిర్మాణాలను ప్రోత్సహించింది. అయితే పేదల ప్రభుత్వమంటూ హామీలు గుప్పించి గద్దెనెక్కిన కూటమి సర్కారు గత ప్రభుత్వంపై కక్షతో అప్పట్లో ఇచ్చిన గృహాలను, గృహ పట్టాలను రద్దు చేసేందుకు చర్యలు తీసుకోనుంది.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పెద్దపీట

పేదల సొంతింటి కలను వైఎస్సార్‌సీపీ సర్కారు నెరవేర్చింది. గృహ నిర్మాణాలు చేసుకోలేని పేదలకు సైతం రాష్ట్ర ప్రభుత్వమే గృహాలను నిర్మించి ఇచ్చింది. అంతేకాకుండా స్వయం సహాయక సంఘాల మహిళలకు సైతం బ్యాంకుల ద్వారా రుణా లు ఇప్పించి తద్వారా ఇంటి నిర్మాణాలకు ఊతమిచ్చింది. ప్రస్తుతం కూటమి సర్కారు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామని ఊకదంపుడు ప్రసంగాలు చేసినా వాస్తవ రూపంలో ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. గద్దెనెక్కిన ఏడు నెలల కాలంలో ఒక్క ఇంటిని కూడా మంజూరు చేయకపోగా, గతంలో మంజూరైన గృహాలను సైతం నిలుపుదల చేసింది. గృహ నిర్మాణాలకు ఒక్క రూపాయి విదల్చకపోగా.. గతంలో మంజూరు చేసిన ఇళ్లను సైతం లాక్కునే ప్రయత్నాలు చేస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గత ప్రభుత్వంలో 1.03 లక్షల ఇళ్ల మంజూరు

జిల్లాలో 1,03,264 ఇళ్లను గత వైఎస్సార్‌సీపీ ప్ర భుత్వం మంజూరు చేయగా వాటిలో 38,210 ఇళ్ల ను పూర్తిచేయించి లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు సైతం చేయించింది. నిర్దేశిత లక్ష్యాలతో ఇంటి నిర్మాణాలు పూర్తిచేయించింది. దీనిలో భాగంగా బిలో బేస్‌మెంట్‌ లెవల్‌లో 21,042, బేస్‌మెంట్‌ లెవిల్‌లో 11,646, లెంటల్‌ లెవిల్‌లో 4,340, రూఫ్‌ స్థాయిలో 3,478, శ్లాబ్‌ స్థాయిలో 2,810 గృహాలు ఉన్నాయి. ఇలా మొత్తం 43,316 గృహాలు వివిధ దశల్లో ఉ న్నాయి. మొత్తంగా 81,526 గృహ నిర్మాణాలు ప్రా రంభం కాగా 21,738 ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారు లు చేపట్టలేదు. వాస్తవానికి ప్రారంభించకుండా నిలిపివేసిన గృహాలను, వివిధ దశల్లో ఉన్న గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అయితే ఇందుకు భిన్నంగా రద్దు చేసేందుకు చర్యలు తీసుకోనుంది. ఈ మేరకు ఇప్పటికే శుక్రవారం నిర్వహించిన కేబినెట్‌ భేటీలో సర్కారు నిర్ణయం తీసుకుంది.

గత ప్రభుత్వంపై కక్షతోనే..

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జిల్లాలో గృహ నిర్మాణాలకు రూ.849.10 కోట్లు వెచ్చించింది. జిల్లాలో సుమారు 43 లేఅవుట్లలో విద్యుత్‌, రోడ్లు, నీటి సౌకర్యం వంటి మౌలిక వసతులు కల్పించింది. అయితే కేవలం గత సర్కారు మీద కక్షతో వివిధ దశల్లో ఉన్న ఇళ్లను, ప్రారంభించని ఇళ్లను సైతం రద్దుచేసి లబ్ధిదారులకు అందించిన పట్టాలను లాక్కునేందుకు కూటమి సర్కారు చర్యలు తీసుకోనుంది. ప్రస్తుతం గృహనిర్మాణానికి అందించే ఆర్థిక సహాయాన్ని సైతం రూ.4 లక్షలకు పెంచుతామని ప్రకటన చేసిన కూటమి సర్కారు.. కొత్తగా మంజూరు చేసే గృహాలకు మాత్రమే ఈ మొత్తం అని మెలిక పెట్టింది. ఇలా జిల్లావ్యాప్తంగా వివిధ దశల్లో ఉన్న 43,316 గృహ లబ్ధిదారులకు మొండిచేయి చూపింది. దీంతో వీరంతా నిరాశ చెందుతున్నారు. కొత్తగా ఇళ్లు మంజూరు చేయకుండా, ఉన్నవాటిని రద్దు చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గణపవరం మండలంలో మంజూరు చేసిన ఇళ్లు (ఫైల్‌)

పేదోడి గూడుపై కుట్ర

జిల్లాలో 25 వేలకు పైగా ఇళ్ల పట్టాలు రద్దు చేసే యత్నం

నేటికీ ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయని కూటమి సర్కారు

ఉన్న పట్టాలను రద్దు చేసి, వాటినే తిరిగి మంజూరు చేస్తామంటున్న వైనం

ఆందోళనలో గృహ లబ్ధిదారులు

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణాలు

ఇళ్ల నిర్మాణాలు పూర్తి 38,210

బిలో బేస్‌మెంట్‌ స్థాయిలో.. 21,042

బేస్‌మెంట్‌ స్థాయిలో.. 11,646

లెంటల్‌ స్థాయిలో.. 4,340

రూఫ్‌ స్థాయిలో.. 3,478

శ్లాబ్‌ స్థాయిలో.. 2,810

నిర్మాణం ప్రారంభం కాని ఇళ్లు 21,738

మొత్తం ఇళ్ల మంజూరు 1,03,264

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement