పశువధ ఫ్యాక్టరీ కావాలా? ప్రజలు కావాలా?
తణుకు అర్బన్: తేతలిలో అక్రమమార్గంలో నడుస్తున్న పశు వధశాల కావాలో? ఇబ్బందులు పడుతున్న ప్రజలు కావాలో? తణుకు ఎమ్మెల్యే తేల్చుకోవాలని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ సభ్యుడు వెలగల సాయిబాబారెడ్డి సవాల్ విసిరారు. తణుకు వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్రమ మార్గంలో నడస్తున్న పశువధ శాల వెనుక ఎవరు ఉన్నారో? ఏంటో? అనే విషయాన్ని ప్రజలు గ్రహించారని, వారు భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలో లాహం ఫుడ్ ప్రొడక్ట్స్ సంస్థ అనుమతులు అక్రమమని తహిహసీల్దారు సమక్షంలోనే నిరూపించినా పోలీసు పహరాలో సంస్థను నడిపించడం దుర్మార్గమన్నారు. ఈ నెల 8వ తేదీన పశువధశాల సంస్థకు సంబంధించిన జనరల్ మేనేజరు అరవింద్ సరీన్, గోసేవా సమితి సభ్యులు, లీగల్ సెల్, తహసీల్దారు డి.అశోక్‌వర్మ సమక్షంలో కర్మాగారానికి ఉన్న పత్రాల అనుమతులు సక్రమంగా లేవని ఈ విషయాన్ని తహసీల్దారు ముందే నిర్ధారణ చేశామని గుర్తు చేశారు. ముఖ్యంగా తేతలి పంచాయితీ ఎన్‌ఓసీ ఇవ్వకపోవడం, సంస్థ నిర్వహణకు ఉండాల్సిన భూమి లేకపోవడం, కర్మాగారంలో మూడో షెడ్డు రెసిడెన్షియల్ అనుమతి పత్రంతో నడుస్తున్న వైనం, కర్మాగారం వ్యవహారం హైకోర్టులో పెండింగ్‌లో ఉండడం, తప్పుడు పొల్యూషన్ ధ్రువపత్రం వంటి విషయాలను తహసీల్దారు ముందు నిరూపించామని చెప్పారు. అక్రమంగా నడుస్తున్న వ్యవహారంలో అడ్డుపడుతున్న గోసేవా సమితి సభ్యుడు శ్రీనివాస్‌ను ఎలా బైండోవర్ చేశారు? అని 144 సెక్షన్ ఎలా విధించారు? అని, ఎవరు ఆదేశిస్తే చేయాల్సి వచ్చిందని అధికారులను నిలదీశారు. అయితే అనుమతులు అక్రమమని తహసీల్దారు సమక్షంలో నిర్ధారణ చేసిన తరువాత జిల్లా కలెక్టరు వారం రోజుల్లో విచారణ చేసి నివేదిక ఇస్తామని ప్రకటించారని ఆ నివేదిక కోసం వేచిచూస్తున్నట్లు వైఎస్సార్ సీపీ పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరి జగదీష్, నాయకులు వి.సీతారాం అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా సెక్రటరీ ఆర్గనైజేషన్ యిండుగపల్లి బలరామకృష్ణ, పట్టణ అధ్యక్షులు మంగెన సూర్య, ఏఎంసీ మాజీ చైర్మన్లు నత్తా కృష్ణవేణి, ఉండవల్లి జానకి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment