దస్తూరీతో దోస్తీ
పరీక్షలు రాస్తున్న విద్యార్థులు (ఫైల్)
● విద్యార్థులకు చదువుతోపాటు దస్తూరీపైనా శ్రద్ధ అవసరం
● మంచి దస్తూరీకి మార్కులు దాసోహం
● నేడు జాతీయ చేతిరాత దినోత్సవం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల సమయం దగ్గర పడుతోంది. ఇప్పటి వరకు విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా తమ పాఠ్యాంశాల్లోని సిలబస్‌పై మాత్రమే దృష్టి కేంద్రీకరించారు. అయితే చదువుతో పాటు దస్తూరీ పైనా దృష్టి సారిస్తే చక్కటి మార్కులు సొంతమంటున్నారు నిపుణులు. అక్షర దోషాలు, గజిబిజి చేతిరాత వల్ల ఒకటి, రెండు మార్కులు కోల్పోయే ప్రమాదముందంటున్నారు. విద్యార్థి కోల్పోయే ఆ ఒకటి, రెండు మార్కులే ర్యాంకును వేలల్లో తగ్గించేస్తుందనే విషయాన్ని గుర్తెరిగి దస్తూరీపై కూడా శ్రద్ధ చూపాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమాధాన పత్రాన్ని దిద్దే ఉపాధ్యాయుడికి మంచి దస్తూరీ కనిపిస్తే ఆ ప్రభావం ఆయన వేసే మార్కులపై సానుకూలంగా ఉంటుందని, ఈ క్రమంలో చక్కటి దస్తూరీతో పరీక్షలు రాస్తే మంచి మార్కులు అందుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. జవాబు సూటిగా, అక్షరాలు పొందికగా ఉంటే పత్రాలను మూల్యాంకనం చేసే ఉపాధ్యాయులు మంచి మార్కులు వేసే అవకాశముంటుందంటున్నారు. పరీక్షలు ప్రారంభమయ్యే లోపు ప్రతి రోజూ కొద్ది సేపు రాతపై కూడా శ్రద్ధ పెట్టి సాధన చేస్తే పరీక్షల్లో ఆందోళన లేకుండా సాఫీగా రాయవచ్చంటున్నారు. పెన్‌టిప్‌ను దూరంగా పట్టుకుని రాస్తే అక్షరాలు గుండ్రంగా వచ్చే అవకాశముంటుందని సూచిస్తున్నారు. దీనితో పాటు చేతిరాత మెరుగుపరుచుకోవడానికి మరిన్ని మెళకువలను సూచించారు. అవేమిటంటే..
విద్యార్థులు చేసే పొరపాట్లు
కొందరు విద్యార్థులు ఒక జవాబు పత్రంపై 25–30 లైన్లు రాస్తారు. గజిబిజిగా ఉంటే జవాబు పత్రం చూడగానే ఆకట్టుకోదు. అందువల్ల ఒక్కోపేజీలో 16–18 లైన్లకు మించకూడదు. లైన్లు సమాంతరంగా ఉండాలి. చాలా మంది విద్యార్థులు ఒత్తిపట్టి రాస్తుంటారు. పెన్నును వేళ్లతో బిగుతుగా పట్టుకుంటారు. దీంతో పేజీ రెండో వైపు అక్షరాలు కనిపిస్తూ చివరికి జవాబుపత్రం గజిబిజిగా తయారవుతుంది. కొందరు అంకెలను సరిగా రాయరు. 2 అంకెను ఇంగ్లీషు జెడ్ తరహాలో, 5ను ఎస్ తరహాలో, 0ను 6 తరహాలో రాస్తుంటారు. ఫలితంగా రావాల్సిన మార్కులు తగ్గిపోతాయి.
మెలకువలు పాటించండి.. మార్కులు సాధించండి
చేతి రాత గుండ్రంగా, అర్థమయ్యేలా ఉండేలా రాస్తే మంచిది.
మనం రాసే తీరు పరీక్ష పేపర్ దిద్దేవారిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు.
వ్యాకరణ దోషాలు లేకుండా చూసుకోవాలి.
దిద్దుబాటు, గజిబిజి ఉండకూడదు. పదానికి, పదానికి మధ్య దూరం ఉండాలి
ప్రశ్నపత్రాన్ని ఒకటికి రెండు సార్లు చదివి అర్థం చేసుకోవాలి. తర్వాతే జవాబు రాయాలి.
సమాధాన పత్రంలో పేజీకి 15 – 16 లైన్లు ఉండాలి.
పేజీకి పైన, కింద మార్జిన్ విడిచి పెట్టాలి.
మొదటి వరుసలో ఎంత బాగా రాశారో చివరి వరకు అదే దస్తూరీ కొనసాగించాలి.
తెలుగు, ఆంగ్లం, హిందీ సబ్జెక్టులలో లెటర్ రైటింగ్‌ను ఒకే పేజీలో వచ్చేలా రాయాలి.
అక్షర దోషాలు, దిద్దుబాట్లు లేకుండా చూసుకోవాలి
గణితంలో అంకెలు స్పష్టంగా ఉండాలి. కొట్టివేతలు వస్తే మార్కులు తగ్గుతాయి. గ్రాఫ్ చక్కగా గీయాలి
సైన్స్‌లో బొమ్మలు గీసేటప్పుడు కష్టమైన వాటిని వదిలేసి సులభంగా ఉన్న వాటిని ఆకర్షణీయంగా గీయాలి
సాంఘికశాస్త్రం సబ్జెక్టులో సమాధానాలను పాయింట్లవారీగా రాయాలి. శీర్షికలు, ఉపకీర్షికలు కింద అండర్‌లైన్ చేయాలి.
మంచి పెన్నులను ఉపయోగించాలి. అక్షరాలు గుండ్రంగా, స్పష్టంగా ఉండేలా చూసుకోవాలి
అక్షరాలు, పదాలు, వాక్యాలు, పంక్తుల మధ్య తగిన ఖాళీ ఉండేలా చూసుకోవాలి
జవాబులు రాసేటప్పుడు ప్యాడ్‌పైకి వాలిపోకుండా సాధ్యమైనంత వరకూ నిటారుగా కూర్చొని రాయడం మంచిది.
దస్తూరీపై దృష్టి పెట్టాలి
అందమైన చేతిరాత మూల్యాంకనం చేసే వారిని ప్రభావితం చేస్తుంది. చాలా మంది బాగా చదువుతారు. కానీ సరిగా రాయకపోవడంతో అనుకున్న మార్కులు సాధించలేకపోతున్నారు. అందువల్ల చిన్న వయసు నుంచే దస్తూరీపై దృష్టి సారిస్తే మంచిది. విద్యార్థుల తల్లితండ్రులు కూడా ఈ విషయంలో చొరవ తీసుకోవాలి.
–మజ్జి కాంతారావు, ప్రముఖ చిత్రకారుడు
మూల్యాంకనంలో ప్రాధాన్యం
మంచి దస్తూరీకి మూల్యాంకనంలో ప్రాధాన్యం ఉంటుంది. చక్కగా రాసిన వారికి మంచి మార్కులు వస్తాయి. తప్పులు, కొట్టివేతలు లేకుండా రాయాలి. చేతిరాతపై సాధన చేయాలి. సమాధానాలు అర్థమయ్యేలా రాయాలి. ప్రతి రోజూ కొద్ది సేపు రాతపై సాధన చేస్తే పరీక్షల్లో ఆందోళన లేకుండా సాఫీగా రాయవచ్చు.
– ఎండీ ఇర్షాద్ అహ్మద్, ప్రభుత్వ డ్రాయింగ్ టీచర్
Comments
Please login to add a commentAdd a comment