కాళ్లకూరు వెంకన్న హుండీ ఆదాయం రూ.21.31 లక్షలు
కాళ్ల: కాళ్లకూరు గ్రామంలో వేంచేసియున్న స్వయంభూః శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో దేవదాయ శాఖ ఆధ్వర్యంలో బుధవారం హుండీలు లెక్కింపు నిర్వహించారు. 97 రోజులకు గాను రూ.21,31,807 ఆదాయం వచ్చిందని దేవస్థానం ఈవో ఎం.అరుణ్‌కుమార్ తెలిపారు. దేవదాయ శాఖ అధికారి, ఆకివీడు సమూహ దేవాలయాల కార్యనిర్వహణాధికారి అల్లూరి సత్యనారాయణరాజు, గ్రామ పెద్దలు, భక్తులు, మహిళామండలి సభ్యులు, దేవస్థానం సిబ్బంది సమక్షంలో హుండీలు తెరిచి లెక్కించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అడ్డాల రాము పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
తాడేపల్లిగూడెం అర్బన్: రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లిగూడెం కడకట్ల ప్రాంతానికి చెందిన ములకలపల్లి అలీషా (69) బుధవారం మధ్యాహ్నం ఆర్‌టీసీ డిపో వైపు యాక్టీవా మోటారు సైకిల్‌పై వెళ్తున్నాడు. ఫైర్‌స్టేషన్ సమీపంలోకి వచ్చేసరికి అటువైపు వెళ్తున్న ప్రైవేటు అంబులెన్స్ అలీషా పక్క నుంచి వెళ్తూ ఢీకొనడంతో అదుపు తప్పి అలీషా డిపోకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో ఆలీషాకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ప్రైవేటు అంబులెన్స్ ద్వారా అతడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యులు పరీక్షించి అలీషా మృతి చెందినట్లు నిర్ధారించారు. పట్టణ ఎసై జి శ్రీనివాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలీషా పట్టణానికి చెందిన ఒక ఎరువుల దుకాణంలో పని చేస్తున్నాడు.
గుర్తు తెలియని రైలు ఢీకొని వ్యక్తి మృతి
పెంటపాడు: గుర్తు తెలియని రైలు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. ప్రత్తిపాడు రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గూడెం జీఆర్‌పీ ఎస్సై పి.అప్పారావు తెలిపిన వివరాలివి. ప్రత్తిపాడు ఎస్సీపేటకు చెందిన పెనుమాక పైడిరాజు (45) కూలీపని చేసుకొని జీవిస్తున్నాడు. ఇతను రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదవశాత్తూ గుర్తుతెలియని రైలు ఢీకొని మృతి చెందినట్లు జీఆర్‌పీ ఎస్సై అప్పారావు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బుధవారం కుటుంబసభ్యులకు అప్పగించామన్నారు. మృతుడు పైడిరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నగల చోరీపై కేసు నమోదు
అత్తిలి: బంగారు ఆభరణాల చోరీపై పోలీసులు కేసు నమోదు చేశారు. అత్తిలి రామన్నపేటకు చెందిన బయ్యే పూర్ణిమ తణుకులో ఒక ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఈనెల 11న యథావిఽధిగా డ్యూటీకి వెళ్లానని, 12వ తేదీన బీరువా చూడగా అది తెరచి ఉందని, బీరువాలో ఉండాల్సిన రెండు కాసుల బంగారు ఆభరణాలు కనిపించలేదని బాధితురాలు పూర్ణిమ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి.ప్రేమరాజు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment