నకిలీ జడ్జి అవతారంలో మోసం
ఏలూరు టౌన్: ఒక వ్యక్తి నకిలీ జడ్జి అవతారం ఎత్తాడు. యువతకు ఉద్యోగాలకు ఇప్పిస్తానని లక్షలు వసూలు చేసి మోసం చేశాడు. ఒక మహిళను తాను జడ్జినని చెప్పి నమ్మించి ఆమెను వివాహం చేసుకుని బురిడీ కొట్టించాడు. అంతేకాకుండా ఇటీవల అదనపు కట్నం కోసం ఆమెను వేధించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిని పోలీసులు ఏలూరు రైల్వేస్టేషన్‌లో అరెస్ట్ చేశారు. డీఎస్పీ డీ.శ్రావణ్‌కుమార్ కేసు వివరాలు బుధవారం వెల్లడించారు. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల వేములవాడకు చెందిన నామాల నరేందర్ నకిలీ జడ్జి అవతారం ఎత్తాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో యువతను మోసం చేస్తూ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి లక్షల వసూలు చేశాడు. ఇదే క్రమంలో ఏడాది క్రితం ఏలూరులోని కొత్తపేట ప్రాంతానికి చెందిన సామంతుల నిర్మల అనే యువతిని మ్యాట్రిమోనిలో పరిచయం చేసుకుని తాను జడ్జిని అంటూ నమ్మించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో రూ.25 లక్షలు కట్నంగా తీసుకున్న నరేందర్ మరో రూ.50 లక్షలు కావాలంటూ డిమాండ్ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నాడు. నరేందర్ నకిలీ జడ్జిగా గుర్తించటంతోపాటు వేధింపులు భరించలేని నిర్మల గతేడాది నవంబర్‌లో ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన ఎస్సై క్రాంతిప్రియ దర్యాప్తు చేయగా నరేందర్ నకిలీ జడ్జి అవతారంలో అనేకమందిని మోసం చేసినట్లు తెలిసింది. అలాగే ఖమ్మం, ఉప్పల్, చందానగర్ ప్రాంతాల్లోనూ పలు కేసుల్లో అతడు నిందితుడిగా ఉన్నట్లు గుర్తించారు. అతను మూడు నెలల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. బుధవారం పక్కా సమాచారంతో ఏలూరు రైల్వే స్టేషన్‌లో రైలు తనిఖీ చేసి మరీ నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రావణ్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment