![శ్రీవారి క్షేత్రం.. భక్తజన సంద్రం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/08jrgdwa11-290069_mr-1739040672-0.jpg.webp?itok=Jgx29zFs)
శ్రీవారి క్షేత్రం.. భక్తజన సంద్రం
ద్వారకాతిరుమల: చినవెంకన్న దివ్య క్షేత్రం శనివారం భక్తజన సంద్రమైంది. శ్రీవారికి ప్రీతికరమైన రోజు, అందులోనూ భీష్మ ఏకాదశి పర్వదినం, రెండో శనివారం కావడంతో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించారు. తెల్లవారుజామునుంచే భక్తుల రాక మొదలవడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లతో పాటు, అనివేటి మండపం, ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతం, కల్యాణకట్ట ఇలా అన్ని విభాగాలు భక్తులతో పోటెత్తాయి. స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించేందుకు పెద్ద ఎత్తున భక్తులు అన్నదాన భవనం వద్ద బారులు తీరారు. భక్తుల వాహనాలు భారీగా కొండపైకి చేరడంతో ఘాట్ రోడ్లలలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
23 మందిపై కేసులు
నరసాపురం: పట్టణంలోని అరుందతీపేటలో శుక్రవారం జరిగిన ఘర్షణ ఘటనలో ఇరువర్గాలకు చెందిన 23 మందిపై కేసులు నమోదు చేసినట్లు టౌన్ ఎస్సై సీహెచ్ జయలక్ష్మి చెప్పారు. గురువారం రాత్రి రోడ్డుపై ఇరువర్గాలకు చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన చిన్న గొడవ ఇరువర్గాలు కర్రలు, కత్తులు, రాళ్లతో దాడి చేసుకునే వరకూ వెళ్లింది. ఓ వర్గం వ్యక్తులు బైక్‌పై వెళుతుండగా, మరోవర్గం వారు దారి ఇవ్వకుండా రోడ్డుకు అడ్డంగా ఉన్నారని ఆరోపించారు. కావాలనే బైక్ హారన్ పెద్దగా కొట్టి రెచ్చగొట్టారని మరో వర్గం ఆరోపించింది. ఈ నేపధ్యంలో ఇరు వర్గాలు బాహాబాహీకి సిద్ధపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment