![పరిహా](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/08jrgkknr01-290036_mr-1739040710-0.jpg.webp?itok=RtyMRAIG)
పరిహారం.. గందరగోళం
కుక్కునూరు: పోలవరం ప్రాజెక్ట్ పరిహారం చెల్లింపుల్లో అధికారులు అనుసరిస్తున్న తీరు అయోమయంగా ఉందని నిర్వాసితులు వాపోతున్నారు. ముంపు గ్రామాల గుర్తింపుపై విస్తుపోతున్నారు. తమ గ్రామాలు చిన్నపాటి వరదకే ముంపు బారినపడుతున్నాయని ఏటా అధికారుల వద్ద గోడు వెళ్లబోసుకున్నా ఫలితం ఉండటం లేదని ఆవేదన చెందుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ 41.15 కాంటూర్ పరిధిలో పేర్కొన్న గ్రామాలు వరద నీటిలో మునగకముందే 45 కాంటూర్‌లోని గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఈ విషయం అందరికీ తెలిసినా ఇక్కడి నిర్వాసితులకు న్యాయం చేయలేని పరిస్థితి. 2017లో అధికారులు ముంపు గ్రామాలను గుర్తించే ప్రక్రియను గుడ్డిగా చేపట్టడమే ఈ అయోమయ పరిస్థితి కారణంగా కనిపిస్తోంది.
కాంటూర్ లెక్కలను పక్కన పెట్టి..
ఏదైనా రెండు గ్రామాలు 41.15 కాంటూర్ పరిధిలో ముంపునకు గురవుతున్నాయని పరిహారం ఇచ్చినప్పుడు ఆయా గ్రామాల మధ్య ఉన్న గ్రామాల పరిస్థితిని విస్మరించారు. మధ్య గ్రామాలకు ప్రజలు ఎలా వెళ్లాలనే ప్రశ్నకు సమాధానం లేదు. అలాగే 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఏదైనా గ్రామానికి సంబంధించి భూసేకరణ జరిగితే ఆ గ్రామంలో 70 శాతం ముంపు భూములను ప్రభుత్వం సేకరిస్తే గ్రామం మొత్తాన్ని యూనిట్‌గా తీసుకుని ఆర్‌అండ్‌ఆర్ పరిహారం చెల్లించాలి. అయితే పోలవరం ప్రాజెక్టు విషయంలో 41, 45 కాంటూర్ అంటూ విభజించడం ఏంటని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. కాంటూర్ లెక్కలను పక్కనపెట్టి నిర్వాసితులందరికీ పరిహారం చెల్లించి పునరావాస కేంద్రాలకు తరలించాలని కోరుతున్నారు.
అధికారులే తేల్చాలి
మా గ్రామం పోలవరం ప్రాజెక్ట్ 45 కాంటూర్ పరిధిలో చేర్చారు. మా ఊళ్లో ప్రజలు పనుల ని మిత్తం బయట ప్రాంతాలకు వెళ్లాలంటే సీతారామనగరం గ్రామం మీదుగా వెళ్లాలి. సీతారామపురం ముంపునకు గురవుతుందని పరిహారం చెల్లించారు. అలాంటప్పుడు మేం పనుల నిమిత్తం ఏ దారి మీదుగా వెళ్లాలే అధికారులే తేల్చాలి.
– బొర్రా క్రిష్ణ, గ్రామస్తుడు, ఉప్పరమద్దిగట్ల
2006లో భూములిచ్చినా..
2006లో భూములిచ్చినా ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదు. మేం పనులకు బయటకు వెళ్లాలంటే చిరవెల్లి, కివ్వాక గ్రామా లు దాటాలి. అక్కడి వారికి పరిహారం ఇచ్చారు. ఆ రెండు గ్రామాలు నీటమునిగితే మేం బయటకు ఎలా వెళ్లాలి. 45 కాంటూర్‌కు పరిహారం చెల్లించే వరకూ ఇక్కడే ఉండాలా. ఏటా వరద భయంతో మేం అడవుల్లోకి వెళ్లి తలదాచుకుంటున్నాం.
– కోలపూడి వసంత్‌కుమార్,
గ్రామస్తుడు, గుండంబోరు
అధికారుల తీరుపై అయోమయం
ముంపు గ్రామాల గుర్తింపుపై విమర్శలు
నష్టపోతున్నామంటున్న 45 కాంటూర్‌లోని గ్రామాల నిర్వాసితులు
పై ఫొటోలో కనిపిస్తున్న గ్రామం పేరు ఉప్పరమద్దిగట్ల. కుక్కునూరు మండలం గొమ్ముగూడెం పంచాయతీ పరిధిలోనిది. ఈ గ్రామానికి కుక్కునూరు మండలంలోని దాచారం, సీతారామపురం మీదుగా వెళ్లాలి. అటు వేలేరుపాడు మండలం నుంచి వస్తే రుద్రమకోట మీదుగా రావాలి. అయితే ఈ గ్రామానికి సమీపంలోని గొమ్ముగూడెం, సీతారామపురంను పోలవరం ప్రాజెక్ట్ 41.15 కాంటూర్ పరిధిలో పేర్కొన్న అధికారులు పరిహారాన్ని అక్కడి నిర్వాసితుల ఖాతాల్లో జమచేశారు. అయితే ఉప్పరమద్దిగట్ల గ్రామాన్ని మాత్రం 45 కాంటూర్‌లో ఉందంటూ ఇక్కడి నిర్వాసితులకు పరిహారం చెల్లించలేదు. 41 కాంటూర్ పరిధిలో నీటిని నిల్వచేస్తే ఉప్పరమద్దిగట్ల గ్రామానికి ఎటుగా వెళ్లాలో అధికారులే చెప్పాలని నిర్వాసితులు అంటున్నారు.
![పరిహారం.. గందరగోళం 1](https://www.sakshi.com/gallery_images/2025/02/9/08jrgkknr02-290036_mr-1739040710-1.jpg)
పరిహారం.. గందరగోళం
![పరిహారం.. గందరగోళం 2](https://www.sakshi.com/gallery_images/2025/02/9/08jrgkknr03-290036_mr-1739040710-2.jpg)
పరిహారం.. గందరగోళం
Comments
Please login to add a commentAdd a comment