ఈవారం కథ: మ్యావ్‌ | Story Of Week | Sakshi
Sakshi News home page

ఈవారం కథ: మ్యావ్‌

Published Sun, Nov 24 2024 9:03 AM | Last Updated on Sun, Nov 24 2024 9:03 AM

Story Of Week

తలెత్తి చూసేసరికి ఎదురుగా కనిపించాడు వాడు! నన్ను చూడగానే తత్తరపడ్డాడు. ‘పాడు పిల్లి’ అంటూ ఏవో బూతులు గొణుక్కుంటూ లోపలికి పోయాడు. ఇప్పుడు కాళ్ళు కడుక్కుని కాసేపు ఇంట్లో కూర్చుని వస్తాడు కాబోలు! అసలు పిల్లి ఎదురొస్తే ఈ ఛాందసులు ఎందుకు ఇంతగా భయపడి చస్తారో నాకు ఎప్పుడూ అర్థం కాదు. వీళ్ళని చూసి జాలిపడ్డం తప్ప ఏం చేయలేం!వాడి సంగతి వదిలేసి కలుగు దగ్గరకు వెళ్లి కాచుకు కూర్చున్నాను.

 ‘ఈరోజు నా చేతిలో ఈ ఎలుకగాడి పని సఫా! ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేడు’ అనుకున్నాను. ఏమాత్రం శబ్దం చెయ్యకుండా కామ్‌గా వున్నాను. అదను కోసం వేచి చూస్తున్నాను. ఈ ఎలుకగాడు ఏ టైముకి బైటకు వస్తున్నాడో ముందుగానే రెక్కీ నిర్వహించాను. ఆఫీసులకు అందరూ బైల్దేరి పోగానే వీడు బైటకొస్తున్నాడు. ఆ టైములో ఆడవాళ్ళు ఇంకా పనుల బిజీలోనే వుంటారు. కేరేజీలు కట్టి ఇచ్చాక తీరిగ్గా మిగిలిన పనులు చక్కబెట్టుకుంటూ వుంటారు. ఆ టైములో వాళ్ళు వంటగదిని వదిలి బైటకు వస్తారు. అదే సరైన సమయం. 

ఆ సమయంలో వంటగదిలోకి జొరబడగలిగితే వీడికి ఏదో తిండి దొరుకుతుంది. అదీ వాడి ప్లాన్‌! కానీ నా ప్లాన్‌ నాకుంది. సరిగ్గా ఆ సమయంలోనే వాడి కలుగు దగ్గరకు పోయి గప్‌ చుప్‌గా కూర్చున్నాను. నేను ఊహించినట్టే ఎలుకగాడు బైటికి వస్తున్న చప్పుడయింది. నేను అలర్టయ్యాను. వాడి దుంపతెగ.. తల బైటికి పెట్టి నన్ను చూసేసి వెంటనే మళ్ళీ కలుగులోకి తుర్రుమన్నాడు! నేను అప్పటికీ పంజా విసిరాను. కానీ ఏముంది? పంజాకి మట్టి తగిలింది.. ఎలుకగాడు తప్పించుకున్నాడు! ఇంక ఈరోజుకి వాడు నాకు దొరకడు. నేను ఇక్కణ్ణుంచి వెళ్తే తప్ప వాడు లోపల్నుంచి బైటకు రాడు! 

నాకు పిచ్చి కోపం వచ్చింది. అంతే కాదు, ఇంకో ఊహ కూడా వచ్చింది. వచ్చేటప్పుడు ఆ దరిద్రపుగొట్టు మొహం గాడు ఎదురుపడ్డం వల్లే ఇలా జరిగిందేమో? నేను ఎదురుపడ్డం వల్ల వాడికేమీ జరిగుండదు కానీ నాకు మాత్రం నా తిండి చేజారిపోయింది. అంటే నేను ఎదురుపడ్డం వల్ల వాడికి నష్టం కాదు, వాడు ఎదురుపడ్డం వల్ల నాకే దరిద్రం! ఇలా ఆలోచించుకుంటూ మళ్ళీ ‘ఛా.. ఇదేమిటి మరీ నేను మనుషుల్లా ఆలోచిస్తున్నాను? వాళ్ళ అజ్ఞానపు ఆలోచనా తీరు నాకు తగులుకుంటోందేమిటి? వాడి వల్ల నాకెందుకు నష్టం జరుగుతుంది? ఈ ఎలుకగాడు మరీ స్మార్ట్‌ అవడం వల్లే నాకు తిండి దొరకలేదు.. అంతే!’ అనుకున్నాను.  

నిరాశగా వీధిలోంచి వెళ్తూ వుంటే సుబ్బారాయుడు కన్పించాడు. ఈ సుబ్బారాయుడ్ని అందరూ ‘పిల్లికి కూడా బిచ్చం పెట్టడు’ అంటారు. అతను పరమ పిసినారి అని చెప్పడానికి మధ్యలో మా పేరెందుకు వాడుకుంటారో నాకర్థం కాదు. అసలు మాకు బిచ్చం పెట్టకపోతే పోనీ గానీ వున్నంతలో వాడు మంచి బట్ట కట్టి, మంచి తిండి తింటే చాలు! కానీ దానిక్కూడా ఎంతో ఆలోచిస్తాడు వాడు. అసలు ఈ మనుషులు తరతరాలకి సరిపడా దాచుకోవాలని ఎందుకంత తాపత్రయపడతారో అర్థం కాదు. మమ్మల్ని చూసి ఎప్పుడు నేర్చుకుంటారో ఏమిటో?! ఏ జంతువైనా సరే.. 

తన పిల్లలు కాస్త ఎదిగేవరకు, స్వయంగా ఆహారం సంపాదించుకునే వరకూ మాత్రమే వాటిని పోషిస్తుంది. తర్వాత వాటి తిండి అవే సంపాదించుకోవలసిందే! మనుషుల్లో మాత్రం తాతలు, తండ్రులు సంపాదిస్తే జల్సాగా ఖర్చు చేస్తూ కష్టపడకుండా హాయిగా బతికేవారు బోలెడు మంది కనిపిస్తారు. ఏదో ఆలోచించుకుంటూ నా బసకు వెళ్తున్నాను. పక్క వీధి చివర ఒక పాడుబడిన ఇల్లుంది. అందులోనే నా నివాసం! ఎదురుగా ఒక సరుకుల వ్యాన్‌ వెనకాల ఫుల్‌ లోడ్‌తో వస్తోంది. ఎవరివో ఇంటి సామాన్లు తీసుకెళ్తున్నారు. ఇటువైపు నుంచి ఏదో ఆటో వస్తుండటంతో ఆ ఇరుకుదారిలో వ్యాన్‌ని ఒక పక్కకు తీసి ఆపారు. 

డ్రైవర్‌ పక్కన రామాంజనేయులు గారు కూర్చున్నారు. ఆయన ఇల్లు మారుతున్నారని నాకర్థమైంది. ‘ఈ ఇల్లు మారడమంత దరిద్రం మరొకటి లేదు. ఇంకాస్త పెద్ద ఇల్లు చూసుకుందాం అని మావాళ్ళు ఒకటే పోరుపెట్ట బట్టి మారక తప్పడం లేదు.. గొప్ప యాతన ఇది!’ ధుమధుమలాడుతూ అన్నాడాయన. అసలీ మనుషులకు అన్నీ సమస్యగానే కనిపిస్తాయి. చక్కగా అన్ని గదులతో అమరివున్న ఇంట్లో వున్నా కూడా వారికి సంతృప్తి వుండదు. అలాగని ఇల్లు మారడం కూడా వాళ్లకి పెద్ద సమస్యే! ఏ విషయాన్నైనా భూతద్దంలో పెట్టి చూసి ఏవో లోటుపాట్లు ఎంచుతారు. మరి ఇల్లే లేని మా పరిస్థితి ఏమిటి? మా జాతిలో పిల్లలు చిన్నవిగా వున్నప్పుడు వాటిని సురక్షితంగా వుంచడానికి ఆ తల్లి ఎన్ని పాట్లు పడుతుందో, ఎన్నిసార్లు స్థలాన్ని మారుస్తుందో నాకు తెలుసు.           

వెళ్ళేదారిలో అదృష్టవశాత్తు కాస్త తినదగిన ఆహారం ఏదో దొరికింది. దాంతో అది తిని నా బసకు వెళ్లాను. కడుపు నిండా తిండి దొరకడంతో కంటి నిండా నిద్రొచ్చింది. పడుకుని లేచేసరికి బైట ఏవో మాటలు వినబడుతున్నాయ్‌. బైటికి వచ్చాను. ఎదురింటి అరుగు మీద ఎవరో ఇద్దరు కూర్చుని పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నారు. ‘గేదెను కొనడానికి సంతకు ఎళ్ళినోడివి నీతో పాటు ఆ శంకుగాణ్ణి ఎందుకు తీసుకెళ్ళావ్‌? ఆడితో పెమాదం! ఎక్కువకి బేరమాడి కొనిపించేస్తాడు. నిజానికి అక్కడి మారు బేరగాళ్ళతో ఈడికి లాలూచీలు వున్నాయి. బేరం సెట్‌ చేసినందుకు తర్వాతెళ్లి ఆళ్ళ దగ్గర కమీషన్‌ లాగుతాడు. నాక్కూడా తెలీదు గానీ మొన్న నేను మా తమ్ముడింట్లో కార్యానికి గొర్రెపోతుల్ని కొనడానికెళ్తే పిలవకపోయినా నాతో పాటు తోడొస్తానని వొచ్చాడు. 

పోతుల్ని కొని ఇంటికి తెచ్చాక తెలిసింది ఈడి నిర్వాకం. అక్కడ నన్ను ఎరిగిన మనిషొకడు తర్వాత కనిపించి ఈడి విషయం సెప్పాడు. ఎప్పుడూ ఈణ్ణి ఎంటబెట్టుకు రావొద్దని కూడా సెప్పాడు’ అందులో ఒకడు పక్కవాడితో అన్నాడు.‘అయితే నేను కూడా మోసపోయానేమో.. ఎక్కువ ఇచ్చేస్తున్నానని అనిపించింది గానీ వీడే పక్కనుంచి మంచి బేరం.. మంచి గేదె.. ఇంతకంటే తక్కువకి రాదు అని ఊదరగొట్టి కొనిపించాడు. అసలు సంగతి ఇదా?’ పక్కవాడు కోపం, ఉక్రోషం కలిసినట్టుగా అన్నాడు.‘మరింకేటనుకున్నావ్‌.. నన్నయినా అడిగావు గాదు.. నీకు తోడు వద్దును కదా.. పెళ్ళికి ఎళ్తూ పిల్లిని సంకనబెట్టుకు ఎళ్లినట్టు ఆణ్ణి తీసుకెళ్ళావ్‌’ అన్నాడు మొదటివాడు. 

చెప్పొద్దూ.. వాళ్ళ సంభాషణ వింటున్న నాకు ఒళ్ళు మండిపోయింది. వెళ్లి ఆ సామెత చెప్పిన వాణ్ణి గోళ్ళతో రక్కేద్దునా.. అనిపించింది. ఎవడో ఏదో వెధవపని చేస్తే మధ్యలో మమ్మల్నెందుకు తీసుకువస్తారు? బాగా అనువైపోయాం వీళ్ళకి!చిరాగ్గా లోపలికి వెళ్ళిపోయాను. కాసేపయ్యాక కాలు నిలవక మళ్ళీ బైటికొచ్చాను. ఎదురింటి అరుగు మీద కూర్చున్న వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. అప్పుడే కనుచీకటి పడుతోంది. వీధి లైట్లు వేసినట్టున్నారు. అవి గుడ్డిగా వెలుగుతున్నాయి. సరిగ్గా అప్పుడే ఒక బక్కచిక్కిన ముసలి వ్యక్తి ఎదురింట్లోకి వెళ్ళడం గమనించాను. ఆ ఇంట్లో వుండే సుబ్బారాయుడు ఏదో మంచి ఉద్యోగమే చేస్తున్నాడు. మంచి ఉద్యోగమంటే నా ఉద్దేశం అందర్నీ తన చుట్టూ తిప్పుకునే ఉద్యోగం! అతను పెన్షన్లు మంజూరు చెయ్యడం, రిటైరైన వారి పాత బకాయిలు విడుదల చెయ్యడం లాంటి పనులు చూసే సీట్లో వున్నట్టున్నాడు.

 అందువల్ల పాపం ముసలీ.. ముతకా అతని చుట్టూ తిరిగి, అతను అడిగిన డబ్బులు సమర్పించుకుని తొందరగా తమ పని చేసిపెట్టమని వేడుకుంటారు. ఈ వేళప్పుడు అతని ఇంటికి వచ్చేవారంతా అలాంటివారే! ఈ ముసలాయన కూడా అలాంటి బాపతే లాగుంది. దర్శనం ఇచ్చే దేవుడిలాగా బైట వున్న పెద్ద కుర్చీలో దర్జాగా కూర్చుని వున్నాడు సుబ్బారాయుడు. ఈ బక్కచిక్కిన శాల్తీ కూడా అతని ముందు నిలబడి ఏదో విన్నవించుకుని, ఆపైన మరేదో సమర్పించుకుని దణ్ణాలు పెడుతూ బైటపడ్డాడు. ఈ సుబ్బారాయుడు రోజూ ఉదయాన్నే పెద్ద గొంతేసుకుని అవేవో స్తోత్రాలు చదువుతూ దేవుణ్ణి తెగ పూజిస్తాడు. అవన్నీ నాకు వినబడుతూనే వుంటాయి. సాయంత్రమయితే తనే ఇలా వరాలిచ్చే దేవుడి అవతారమెత్తుతాడు. 

ఇక్కడ ఎవడి డ్యూటీ వాడు చెయ్యడానికి కూడా లంచాలు కావాలి! పైగా విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ అవినీతిపరుల్లో చాలామంది గొప్ప దైవభక్తులు! తాము చేసే వెధవ పనులు దేవుడు చూడ్డం లేదులే అనుకుంటారో ఏమిటో తెలీదు. వాళ్ళు చేసే పూజలు భగవంతుడు చూసి సంతృప్తి చెంది వరాలిస్తాడనీ, ఈ తప్పుడు పనుల్ని మాత్రం పట్టించుకోడనీ వాళ్ళ నమ్మకం! పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తనని ఎవరూ చూడ్డం లేదని అనుకుంటుందని మామీద సెటైర్లు వేస్తారు. కానీ ఇలాంటి వాళ్లకి ఆ సామెత సరిగ్గా సరిపోతుంది. వీళ్ళు ఏదో ఒకరోజు దెబ్బతినిపోకుండా వుంటారా? అని కసిగా అనుకున్నాను. కానీ అంతలోనే పిల్లి శాపనార్థాలకు కూడా ఫలితం వుంటుందా? అనే మాట గుర్తొచ్చి నాకే నవ్వొచ్చింది.  మర్నాడు ఉదయం మామూలుగానే ఆహారవేటకు బైల్దేరుతుండగా పక్కవీధిలో వుండే నల్లపిల్లిగాడు వచ్చి నా ఎదురుగా నిలుచున్నాడు. వాడెందుకు నా డెన్‌కు వచ్చాడో నాకస్సలు అర్థం కాలేదు. 


‘ఏంటి మావా ఇలా వచ్చావ్‌? నీది రాజభోగం కదా.. ఆ వీధి గుండా వెళ్ళేటప్పుడు గేటు లోపలున్న నిన్ను చూస్తుంటాను. కనీసం ఎవరినీ పట్టించుకోవు. అయినా మాలాంటి వీధి పిల్లులంటే నీకెందుకు లెక్కుంటుందిలే.. ఎంతైనా నువ్వు పెంపుడు పిల్లివి కదా! ఇంతకీ ఇక్కడికెందుకు వచ్చావు?’ కాస్త ఆశ్చర్యంతోనూ, కొంత అసూయతోనూ అడిగాను.వాడు విషాదంగా నవ్వి ‘ఏం చెప్పమంటావు మావా.. నా యజమాని నన్ను చాలా బాగా చూసుకునేవాడు. బైట పిల్లులతో అస్సలు కలవనిచ్చేవాడు కాదు. చిన్నపిల్లగా వుండగా బుజ్జిగా వున్న నన్ను చూసి ముచ్చట పడి తెచ్చుకున్నాడు. వాడు కూడా మన వూరి నల్లరాయి కొండలాగా కారునలుపుగా వుండడం కారణమేమో తెలీదు గానీ నా నల్లరంగంటే వాడికి మహా ఇష్టం. కానీ ఇప్పుడు ఆ నల్లరంగే నా కొంపముంచింది. 

ఎవడో తలకుమాసినవాడు నల్లపిల్లి ఇంట్లో వుంటే అరిష్టం అని చెప్పాడట! అంతేకాదు.. నల్లపిల్లుల్ని మంత్రగత్తెలు పెంచుకుంటారు అని కూడా చెప్పాడట. అంతే! మా యజమాని నన్ను వున్నపళంగా బైటికి గెంటేశాడు!’ విచారంగా చెప్పాడు.మనుషులు మరీ ఇంత మూర్ఖుల్లాగా ఎందుకుంటారో నాకెప్పటికీ అర్థం కాదు. అయినా ఈ నల్లపిల్లిగాడిని ఎదురుగా చూస్తూండేసరికి మళ్ళీ వాడి పూర్వపు ప్రవర్తన గుర్తొచ్చి మంటెక్కింది.‘వీడి తస్సాదియ్యా.. వీడు ఎంత పోజు కొట్టేవాడు? బాగా అయిందిలే..’ అనుకున్నాను. కానీ ఎంతైనా సాటి పిల్లే కదా అని జాలి కలిగింది. ఈ మనుషులు ఎంత తొందరగా బంధాల్ని తెంచుకుంటారు? అనిపించింది. ‘సరే. చేసేదేముంది? నువ్వూ ఇక్కడే వుండు. దొరికిందేదో తిని బతుకుదాం’ అన్నాను.

ఆ నల్లపిల్లిగాడు అప్పట్నుంచి నా డెన్‌లోనే వుంటున్నాడు. వాడు అంతవరకూ పెంపుడు పిల్లిగా వుండటం వలన ఆహారం సంపాదించుకోవాల్సిన అవసరం రాలేదు. వాడు వున్న ఇంట్లో ఎలుకలు కూడా లేకపోవడం వల్ల వేటాడాల్సిన పని లేకపోయింది. దాంతో వాడు వేటాడటంలో నైపుణ్యాన్ని కూడా కోల్పోయాడు. అందువలన వాడికి నేనే ఆహారం సంపాదించి పెట్టాల్సివచ్చింది. సరే.. పోనీ అని నేను కూడా వాడిని బాగానే చూసుకుంటున్నాను. వేటాడటం, ఆహార సంపాదనలో వాడు కాస్త రాటుదేలేవరకూ నేనే అండగా వుంటానని కూడా మాటిచ్చాను.

కానీ ఏం లాభం? నేను ఆశ్రయమివ్వడం కాదు గానీ వాడు నాకే ఎసరు పెట్టే పని చేశాడు. నాకెంతో ప్రియమైన నా డాళింగ్‌ పిల్లికి వాడు లైనెయ్యడం మొదలుపెట్టాడు. నా డాళింగ్‌ పిల్లి ఎదురింట్లోనే వుంటుంది. అది ఎదురింటి వాళ్లకి ప్రియమైన పెంపుడు పిల్లి! అసలు ఈ దిక్కుమాలిన ఇంట్లో ఏమీ సౌకర్యంగా లేకపోయినా ఇక్కడ వుంటున్నది ఎదురింట్లో వుంటున్న నా డాళింగ్‌ పిల్లి కోసమే! ఈ నల్లపిల్లి గాడొచ్చి మొత్తం సీన్‌ రివర్స్‌ చేశాడు. ఒళ్ళంతా తెల్లగా మెరిసిపోయే వెంట్రుకలతో, లేతాకు పచ్చని కళ్ళతో ఎంతో అందంగా వుండే నా డాళింగ్‌ పిల్లి ఇప్పుడు వాడి మాయలో పడింది. వాడి వైపే కులుకులొలికిస్తూ చూస్తోంది. నల్లపిల్లి గాడు నిన్న మొన్నటి వరకూ పెంపుడు పిల్లే కదా.. బహుశా పెంపుడు పిల్లులకు ఒకేరకమైన అభిరుచులు, ఆలోచనలు వుంటాయేమో మరి?!

నల్లపిల్లిగాడంటే నాకు ద్వేషం మొదలైంది. ఇప్పుడు వాడి ఆహారం వరకూ వాడే తిప్పలు పడుతున్నాడు. ఆ పని అవగానే అవతల నా డాళింగ్‌ పిల్లి గేటు లోపల తచ్చాడుతుంటే వీడు బైట నిల్చుని దానికి సైట్‌ కొడుతున్నాడు. నాకు లోపల్నుంచి ఉక్రోషం తన్నుకొస్తోంది. అంతకుముందు మా చూపులు కలిసేవి గానీ ఈ నల్లపిల్లిగాడు సీన్లోకి వచ్చిందగ్గర్నుంచీ నా డాళింగ్‌ పిల్లి నావైపు చూడ్డమే మానేసింది. నాలాంటి కేరాఫ్‌ ఫ్లాట్‌ ఫామ్‌ గాడికి నా డాళింగ్‌ పిల్లి మనసులో చోటు లేదేమో! అయినా ఇప్పుడు నల్లపిల్లి గాడు కూడా పెంపుడు పిల్లి కాదు కదా.. నా దగ్గరే పడి వుంటున్నాడు. 

ఏదేమైనా ఈ విషయం నా గుండెను రగిలిస్తోంది. తప్పకుండా ఏదో ఒకటి  చేసి నా డాళింగ్‌ పిల్లి ప్రేమను సొంతం చేసుకోవాలి.. ఈ నల్లపిల్లి గాడిని ఎలాగైనా నా దారి నుంచి తప్పించాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాను.
ఆలోచించగా ఒక మంచి పథకం తట్టింది. రోజూ సాయంత్రం నా డాళింగ్‌ పిల్లిని బైట లాన్‌లో వదులుతారు. అది స్వేచ్ఛగా అక్కడ తిరుగుతుంది. ఆ టైములోనే ఈ నల్లపిల్లిగాడు అక్కడక్కడే గేటు బైట తచ్చాడుతాడు. మళ్ళీ ఆ పిల్లి ఇంటి లోపలికి వెళ్లిపోయాకే మా నల్లపిల్లిగాడు తిరిగి మా ఇంటికొస్తాడు. ఆ వచ్చేదారిలో బాట పక్కనే ఒక పెద్ద కాలువ వుంది. వర్షాకాలం కావడం మూలాన అది పొంగి ప్రవహిస్తోంది. నల్లపిల్లిగాడు వచ్చేటప్పుడు నేను సరిగ్గా మధ్యలో వున్న చెట్టు పక్కనే నక్కి నిల్చుంటాను. వాడు నన్ను గమనించలేడు. నా దగ్గరికి రాగానే అదాటున వాడి మీద పడి కాలవలోకి తోసేస్తాను. అందులో పడి కొట్టుకుపోతాడు. అక్కడితో వాడి పీడ నాకు విరగడవుతుంది. 

ఈ ఆలోచన వచ్చిన దగ్గర్నుంచీ నాకు ఒకటే ఆత్రుతగానూ, కొంత ఆందోళనగానూ వుంది. ఆందోళన అంటే మరేం లేదు.. నేను అనుకున్నది సరిగ్గా జరుగుతుందా? లేదా? అని! ఆ సాయంత్రం చెట్టు పక్కన నిల్చున్నాను. నా గుండె కొట్టుకునే చప్పుడు నాకే వినిపిస్తోంది. అప్పుడప్పుడూ దారి వైపు తొంగి చూస్తున్నాను. కాసేపయ్యేసరికి నల్లపిల్లిగాడు ఎదురుగా వస్తూ కనిపించాడు. నేను అలర్టయ్యాను. వాడు నోటితో ఏదో గిన్నె కరుచుకుని వస్తున్నాడు. అదేమిటో నాకు అర్థం కాలేదు. మళ్ళీ తొంగిచూశాను. సరిగ్గా అప్పుడే నల్లపిల్లిగాడు నన్ను చూసేశాడు. గిన్నె కిందన దించి ‘మావా.. ఇలారా’ అని కేకేశాడు. చేసేదేమీలేక వాడి దగ్గరకు వెళ్లాను. ‘రాణీ లేదూ.. ఏం చేసిందనుకున్నావ్‌?’ ఉత్సాహంగా అన్నాడు. రాణి అంటే నా డాళింగ్‌ పిల్లి పేరు.

‘ఏం చేసింది?’ నిరాసక్తంగా అడిగాను‘దానికి పెట్టిన తిండి గిన్నెను నోట కరుచుకుని గేటు కింద నుంచి నాకు అందించింది. నన్ను తినమంది. నేనేం చేశాననుకున్నావ్‌? వెంటనే ఆ గిన్నెను నోట కరుచుకుని చక్కా వచ్చాను. చూశావా.. చిన్న చిన్న చేపలు! ఇలాంటివి మనకెక్కడ దొరుకుతాయి? అందుకే నీకోసమే ఎత్తుకొచ్చాను. నేను తిండి సంపాదించుకోలేనప్పుడు నువ్వే నాకు తిండి పెట్టి బతికించావు. అది ఎప్పటికీ నేను మర్చిపోలేను మావా.. అందుకే ఈ తిండి నీకోసమే తీసుకొచ్చాను.. తిను..’ నావంకే ఆప్యాయంగా చూస్తూ అన్నాడు నల్లపిల్లిగాడు. 

నా బుర్ర తిరిగిపోయింది. అరె.. వీణ్ణి నేను ఎంత అపార్థం చేసుకున్నాను? కాలవలో తోసి చంపాలనుకున్నాను. నేనసలు పిల్లినేనా? నేను కూడా మనుషుల్లాగా ప్రవర్తిస్తున్నానేమిటి? అయినా నేను రాణికి లైన్‌ వేస్తున్నట్టు వీడికి తెలీదు కదా! అంచేత వాడి పాట్లేవో వాడు పడుతున్నాడు. అందులో తప్పేముంది? నేనే అనవసరంగా ఏదేదో ఆలోచించి వాడి మీద కక్ష పెంచుకున్నాను. ఛీ.. ఛీ.. నాదీ ఒక జంతువు జన్మేనా? మనిషి కంటే దిగజారిపోయాను! నామీద నాకే అసహ్యం వేస్తోంది.

‘ఏవిటి మావా అలా వుండిపోయావ్‌? తిను మావా..’ మళ్ళీ అన్నాడు వాడు.‘కాదులే.. ఇవి మనిద్దరం కలిసి తిందాం. మన స్నేహానికి గుర్తుగా ఈ చేపలవిందు చేసుకుందాం’ అన్నాను. వాడు సంతోషంగా తలూపాడు. ఇద్దరం కలిసి ఆ చేపల్ని ఇష్టంగా తింటున్న సమయంలో నేను మరోసారి గుర్తు చేసుకున్నాను, నేను మనిషిని కాదు.. పిల్లిని! ఇక ఎప్పటికీ మనుషుల్లాగా ఆలోచించకూడదు అని!
∙ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement