విశ్వనగరంగా రూపాంతరం చెందుతున్న హైదరాబాద్ సిగలో మరో కీర్తి కిరీటం చేరింది. పెట్టుబడులకు గమ్యస్థానంగా, ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లోని ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థలకు నెలవుగా మారిన హైదరాబాద్ ఇప్పుడు న్యాయ వ్యవస్థకు కూడా కేంద్రంగా మారుతోంది. నగరంలో ఏర్పాటైన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ప్రపంచంలోనే ప్రఖ్యాత ఆర్బిట్రేషన్లలో ఒకటిగా ఎదగబోతోంది. అంతర్జాతీయ సంస్థలు తమ వివాదాలను పరిష్కరించుకునేందుకు, రాజీ కుదుర్చుకునేందుకు హైదరాబాద్ బాట పడుతున్నారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్‌వీ రమణ మదిలో పుట్టిన ఆలోచనను నిజం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో ఆర్బిట్రేషన్ ఏర్పాటుకు అడుగులు వేయడం హైదరాబాద్ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా మారబోతోంది.
కొన్నేళ్లుగా హైదరాబాద్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా ఎదుగుతోంది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలన్నీ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఆసియాలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం మనది. అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువ పెట్టుబడులను ఆకర్షిస్తున్న నగరాల జాబితాలోనూ మన హైదరాబాద్ నిలుస్తోంది. ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించడానికి తీసుకువచ్చిన సులభతర, పారదర్శక విధానాలు అంతర్జాతీయ సంస్థలను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ హైదరాబాద్‌లో ఐఏఎంసీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రికి సూచించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చకచకా పూర్తిచేసింది.
ఆర్బిట్రేషన్ అంటే మధ్యవర్తిత్వం. రెండు సంస్థల మధ్య తలెత్తే వివాదాన్ని జటిలం కాకుండా... సమయం, డబ్బు వృథా కాకుండా సులువుగా, వేగంగా వివాదాన్ని పరిష్కరించి రాజీ కుదుర్చుతాయి ఆర్బిట్రేషన్ సెంటర్లు. ఇంతటి ప్రాధాన్యం కలిగినా కూడా అంతర్జాతీయ స్థాయి ఆర్బిట్రేషన్ కేంద్రాలు లండన్, సింగపూర్, హాంకాంగ్, జెనీవా, న్యూయార్క్, వాషింగ్టన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత నగరాల్లో పదికి లోపే ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ కూడా ఈ నగరాల సరసన చేరింది. మన దేశంలో ఇది మొదటి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్. ఆర్బిట్రేటర్లుగా అంతర్జాతీయ చట్టాలపై సంపూర్ణ అవగాహన ఉన్న న్యాయ నిపుణులు, విశ్రాంత న్యాయమూర్తులు ఉంటారు. (క్లిక్: మన విదేశీ వ్యూహం స్వతంత్రమేనా?)
హైదరాబాద్ కేంద్రంలో ఎంతోమంది ప్రపంచ ప్రఖ్యాత ఆర్బిట్రేటర్లను ఎంచుకునే అవకాశం ఉండటం కలిసి వచ్చే అంశం కానుంది. ఆర్బిట్రేషన్ రంగంలో ప్రముఖులైన జస్టిస్ రవీంద్రన్ వంటి వారు హైదరాబాద్ ఆర్బిట్రేషన్ సెంటర్‌కు సేవలు అందిస్తున్నారు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఆర్బిట్రేషన్ చేసుకునే ఏర్పాట్లు ఉన్నాయి. ఆర్బిట్రేషన్ ప్రక్రి యను వెంటనే 160 విదేశీ భాషల్లోకి అనువదించే సౌకర్యం ఉంది. ఇలాంటి ఎన్నో వసతులూ, ప్రత్యేకతలతో హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ఏర్పాటైంది. ఈ సెంటర్ న్యాయవ్యవస్థపైన భారాన్ని తగ్గిస్తుంది. మన రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థ బలపడటానికి ఉపయోగపడుతుంది. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంలో హైదరాబాద్‌కు ఇది అదనపు ఆకర్షణగా మారుతోంది. (చదవండి: వ్యవస్థల్లో విపరీత ధోరణులు)
- ఎన్. యాదగిరి రావు
జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment