తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురు కులాలు, కేజీబీవీలు, సంక్షేమ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో ఆహారం విషతుల్యమైన ఘటనలు దిన దినం పెరిగిపోతున్నాయి. తాగే నీళ్ళు కూడా కలుషితమై పిల్లలకు వాంతులు, విరేచనాలు అవుతున్నాయి. దీంతో విద్యా ర్థులూ, వారి తల్లిదండ్రులూ భయాందోళనలకు గురవుతున్నారు.
ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల నుండి నవంబర్ మొదటి వారం వరకు గడిచిన పది నెలల్లో ఇలాంటి ఘటనలు 34 జరుగగా, ఇందులో 2,147 మంది విద్యార్థులు అస్వస్థ తకు గురైనట్లు ‘హక్కు ఇనిషియేటివ్’ అనే స్వచ్ఛంద సంస్థ చేసిన అధ్యయనంలో వెల్లడ యింది. ఇవి కూడా మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా తమ సంస్థ వెళ్లి సేకరించిన వివరాలేననీ, బయటికి రాని ఫుడ్ పాయిజ నింగ్ ఘటనలు అనేకం ఉన్నాయనీ ఆ సంస్థ ప్రతినిధి వెల్లడించారు.
రాష్ట్రంలోని గురుకులాలకు సరఫరా చేస్తున్న బియ్యాన్ని సరైన ప్రదేశంలో నిల్వ చేయకపోవడం కారణంగా పురుగులు పడుతున్నాయి. ఆ బియ్యాన్ని సరిగా కడుగక పోవడం, పాడైపోయిన కూరగాయలు వండటం, వంటగది శుభ్రంగా ఉంచకపోవడంతో వండే భోజనంలో బొద్దింకలు, బల్లులు పడి ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా వసతి గృహాల్లోనే ఉండి పర్యవేక్షణ జరుపవలసిన వార్డెన్లు స్థానికంగా ఉండకపోవటం వలన... వంట మనుషులు నిర్లక్ష్యంగా వంటచేస్తున్నారు. దీంతో పిల్లలు తినే ఆహారం, నీరు విషతుల్యం అవుతున్నాయని అస్వస్థతకు గురైన విద్యార్థులు తెలియజేస్తున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఖమ్మం జిల్లాలోని గిరిజన మహిళా కళాశాల ఘటన నుంచి నవంబరు నెలలో సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్‌లోని కేజీబీవీలో అటుకుల అల్పాహారంలో పురుగులు వచ్చిన ఘటన వరకూ... రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 34 ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరిగినట్లు హక్కు ఇనిషియేటివ్ సంస్థ తన నివేదికలోవెల్లడించింది. ఇందులో ఆదిలాబాద్, మెదక్, వరంగల్, మహబూబాబాద్, గద్వాల, నల్లగొండ, వికారాబాద్‌లో రెండు చొప్పున... సిద్ధిపేట, ఆసిఫాబాద్ , నిర్మల్, సంగారెడ్డిలో మూడు చొప్పున; మంచిర్యాల, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, మహబూబ్ నగర్, నారాయణపేట, ఖమ్మం, జనగామ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఘటనలు జరిగాయి. ఇందులో అత్యధికంగా జులై 15న బాసర ట్రిపుల్ ఐటీలో జరిగిన ఫుడ్ పాయిజనింగ్ ఘటనలో 150 మంది వరకు విద్యార్థులు అస్వస్థతకు గురికాగా, సిద్ధిపేట మైనారిటీ గురుకులంలో 120 మందీ, ఖమ్మం జిల్లాలో తనికెళ్ళ గిరిజన మహిళా డిగ్రీ కాలేజీలో 100 మందీ, గట్టు మండలం బాలికల గురుకుల విద్యాలయంలో వంద మంది వరకూ అస్వస్థ తకు గురై ఆస్పత్రి పాలయ్యారు.
రాష్ట్రంలో అన్ని సాంఘిక సంక్షేమ, గురుకుల, ఆశ్రమ పాఠశాలల వసతి గృహాల వార్డెన్లకు ‘ముఖ చిత్ర గుర్తింపు హాజరు యాప్ (ఫేస్ రికగ్నిషన్ ఎటెండెన్స్ యాప్) ప్రవేశ పెట్టాలి. వార్డెన్ వసతి గృహంలోనే ఉండి వంట గది ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచి, నాణ్యమైన నిత్యావసరాలు, కూరగాయలతో ఆహారం వండించాలి. మిషన్ భగీరథ తాగు నీళ్ళు తెప్పించాలి. విద్యార్థులతో కలిసి మూడు పూటలా భోజనం చేయాలి. అంతే గాకుండా అన్ని వసతి గృహాల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలి. ఆ దిశగా ప్రభుత్వం అడు గులు వేస్తుందని ఆశిద్దాం. (క్లిక్ చేయండి: వారి పోరాటం ఫలించాలంటే...)
- నల్లెల్ల రాజయ్య
వరంగల్ పౌర స్పందన వేదిక ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment