సర్కారు స్కూళ్లలో ఎక్కిళ్లు ! | - | Sakshi
Sakshi News home page

సర్కారు స్కూళ్లలో ఎక్కిళ్లు !

Published Fri, Sep 27 2024 3:52 AM | Last Updated on Fri, Sep 27 2024 3:52 AM

సర్కా

పాఠశాలల్లో విద్యార్థులకు సురక్షిత తాగునీరు కరువు

గుంటూరు ఎడ్యుకేషన్‌: నాడు–నేడు మొదటి దశలో ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా 1,149 పాఠశాలల్ని రూ. 256 కోట్లతో తొమ్మిది రకాల మౌలిక వసతుల ప్రాతిపదికన ఆధునికీకరించారు. వీటిలో ఆర్వో వాటర్‌ వ్యవస్థ కూడా ఉంది. విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని మూడు రకాల ఆర్వో వాటర్‌ సిస్టమ్స్‌ను ప్రత్యేకంగా తయారు చేయించి పాఠశాలల్లో అమర్చారు.

● విద్యార్థుల సంఖ్య 150 లోపు ఉన్న 155 బడులకు మినరల్‌ వాటర్‌ ఫ్రిజ్‌లు అందించారు.

● 150 మందికిపైబడిన 994 పాఠశాలల్లో ఆర్వో వాటర్‌ సిస్టమ్స్‌ ఏర్పాటు చేశారు.

● ఆర్వో వాటర్‌ సిస్టమ్స్‌ను మూడు రకాలుగా విభజించారు. వీటిలో 349 బడుల్లో టైప్‌–1, 111 పాఠశాలల్లో టైప్‌–2, 534 చోట్ల టైప్‌–3 రకం సిస్టమ్స్‌ ఏర్పాటు చేశారు.

క్లోరైడ్‌ ప్రభావిత ప్రాంతాల్లో..

భూమిలో క్లోరిన్‌, ఫ్లోరైడ్‌ మోతాదును ప్రయోగశాలల్లో పరీక్షించి, ఫలితాల ఆధారంగా తగిన సామర్థ్యాన్ని కలిగిన ఫిల్టర్లను ఆర్వో వాటర్‌ సిస్టమ్స్‌లో అమర్చారు. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలోని భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్‌ అధికంగా ఉంది. ఈ ప్రాంతాల పరిధిలోని స్కూళ్లలో పూర్తిస్థాయిలో ప్యూరిఫికేషన్‌ చేసేలా ఆర్వో వాటర్‌ సిస్టమ్స్‌ను అందుబాటులో ఉంచారు. 534 ఉన్నత పాఠశాలలకు ఒక్కోటి రూ.4.05 లక్షలతో తయారు చేయించి ఏర్పాటు చేశారు.

నిర్వహణ కరువు

పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్‌ సిస్టమ్స్‌, ఫ్రిజ్‌లు సక్రమంగా పని చేయాలంటే క్రమం తప్పకుండా నిర్వహించడం ఎంతో ముఖ్యం. ఆర్వో వాటర్‌ సిస్టమ్స్‌లో ఆరు నెలలకు ఒకసారి ఫిల్టర్లను శుభ్రం చేయడం తప్పనిసరి. ఫ్లోరైడ్‌ ప్రభావిత ప్రాంతాల్లో అయితే కొత్త వాటిని ఏర్పాటు చేయాలి. ఆర్వో వాటర్‌ ప్లాంటు, సిస్టమ్స్‌, ఫ్రిజ్‌లను తప్పనిసరిగా శుభ్రం చేయాలి. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో షెడ్యూల్‌ ప్రకారం సంబంధిత సరఫరాదారులు టెక్నీషియన్లను పంపి, సర్వీసింగ్‌ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నిర్వహణ గాలికి వదిలేశారు.

సగానికి పైగా బడుల్లో ఇదే దుస్థితి

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాడు–నేడు మొదటి దశలో ఏర్పాటు చేసిన సగానికి పైగా పాఠశాలల్లో ఆర్వో వాటర్‌ సిస్టమ్స్‌, ప్లాంట్లు ఇప్పుడు ప్రభుత్వం మారాక మూలనపడ్డాయి. కొన్నిచోట్ల చెరువులు, కాలువలు, బోర్ల నీటిని ఫిల్టర్‌ చేయడంతో ఆయా పరికరాల్లోని ఫిల్టర్లు మట్టి, వ్యర్థాలతో నిండిపోతున్నాయి. ఒక్కో సిస్టమ్‌లో ఫిల్టర్‌ను ఆర్నెల్లకోసారి మార్చడంగానీ, శుభ్రపర్చడంగానీ చేయాల్సి ఉంది. ఫిల్టర్లను పరిశుభ్రం చేయకపోవడంతో నీటిని శుద్ధి చేసే ప్రక్రియ నిలిచిపోయి, వాటర్‌ సిస్టమ్స్‌ను వినియోగించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. గుంటూరు, తెనాలి, బాపట్ల డివిజన్ల పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలతోపాటు పల్నాడు జిల్లాలోని సగానికి పైగా హైస్కూళ్లలో అవి నిరుపయోగంగా మారాయి.

ఉపాధ్యాయులపై తప్పని భారం

ఆర్వో వాటర్‌ ప్లాంట్లు, సిస్టమ్స్‌ మూలనపడటంతో ఆయా పాఠశాలల్లోని విద్యార్థులకు తాగునీటిని అందించడం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు భారంగా మారింది. గుంటూరు నగర పరిధిలోని ప్రభుత్వ, నగరపాలక సంస్థ పాఠశాలల్లో ఆర్వో వాటర్‌ ప్లాంట్లు మూలనపడ్డాయి. దీంతో వారే సొంత డబ్బులతో క్యాన్లు తెప్పిస్తున్నారు.

సగానికిపైగా పాఠశాలల్లో నిరుపయోగంగా ఆర్వో వాటర్‌ సిస్టమ్స్‌ నాడు–నేడుతో ఆధునికీకరించిన బడుల్లో అమర్చిన వైఎస్సార్‌ సీపీ సర్కార్‌ కూటమి ప్రభుత్వ పాలనలో మూలకు చేరిన పరికరాలు హెచ్‌ఎం, ఉపాధ్యాయుల సొంత ఖర్చుతోనే తాగునీటి సౌకర్యం

ఉమ్మడి గుంటూరు జిల్లాలో నాడు–నేడు ఫేజ్‌ 1లో ఆధునికీకరించిన బడులు : 1,149

ఆర్వో వాటర్‌ సిస్టమ్స్‌ పెట్టినవి : 994

మినరల్‌ వాటర్‌ ఫ్రిజ్‌లు పెట్టినవి : 155

విద్యార్థులకు సురక్షిత తాగునీటిని అందించేందుకు గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్‌ సిస్టమ్స్‌ నేడు మూలన పడ్డాయి. నాడు–నేడు మొదటి దశలో ఆధునికీకరించిన పాఠశాలల్లో తొమ్మిది రకాల మౌలిక వసతులు కల్పించారు. ఇందులో భాగంగా ఆధునిక ఆర్వో వాటర్‌ సిస్టమ్స్‌ను అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా ఎంపిక చేసి, ఏర్పాటు చేయించారు. ప్రస్తుతం కూటమి పాలనలో సగానికిపైగా స్కూళ్లలో ఈ పరికరాలు మూలనపడ్డాయి. సర్వీసింగ్‌ చేయిస్తే ఉపయోగించుకునే అవకాశమున్నప్పటికీ, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రూ.లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన పరికరాలు నిరుపయోగంగా మారాయి. విద్యార్థులకు కష్టాలే మిగిలాయి.

మరమ్మతులు చేయిస్తాం

– సమగ్రశిక్ష ఏపీసీ జి. విజయలక్ష్మి

పాఠశాలల్లో ఆర్వో వాటర్‌ సిస్టమ్స్‌ మూలనపడిన విషయమై సమగ్రశిక్ష ఏపీసీ జి. విజయ లక్ష్మిని వివరణ కోరగా, మొదటి దశలో ఏర్పాటు చేసినవి వినియోగంలో ఉన్నాయని తెలిపారు. ఎక్కడైనా మెయింట్‌నెన్స్‌ లేక పని చేయని పక్షంలో వాటిని సర్వీసింగ్‌ చేయిస్తామని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
సర్కారు స్కూళ్లలో ఎక్కిళ్లు !1
1/4

సర్కారు స్కూళ్లలో ఎక్కిళ్లు !

సర్కారు స్కూళ్లలో ఎక్కిళ్లు !2
2/4

సర్కారు స్కూళ్లలో ఎక్కిళ్లు !

సర్కారు స్కూళ్లలో ఎక్కిళ్లు !3
3/4

సర్కారు స్కూళ్లలో ఎక్కిళ్లు !

సర్కారు స్కూళ్లలో ఎక్కిళ్లు !4
4/4

సర్కారు స్కూళ్లలో ఎక్కిళ్లు !

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement