పట్నంబజారు: ‘సాక్షి’ గుంటూరు జిల్లా ఎడిషనల్‌లో మంగళవారం ప్రచురితమైన ‘అవినీతి అగ్ని’ కథనానికి అగ్నిమాపక శాఖ అధికారులు స్పందించినట్లు తెలిసింది. దీనిపై విచారణ చేపట్టినట్లు సమాచారం. అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు అధికారులకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు శాఖలో చర్చ నడుస్తోంది. ఇప్పటికే కొంతమంది స్పష్టంగా అవినీతికి పాల్పడ్డారని, వారి సిబ్బంది ద్వారా బాణసంచా దుకాణాలకు ఎన్‌ఓసీలు ఇచ్చే నేపథ్యంలో అక్రమాలు జరిగాయని ఓ నిర్ణయానికి ఉన్నతాధికారులు వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు గుంటూరు రేంజ్ పరిధిలోని ఓ ఉన్నతాధికారి నివేదికను డీజీకి సమర్పించనున్నట్లు తెలుస్తోంది.
మారని తీరు
అగ్నిమాపక శాఖలో దసరా, దీపావళికి సంబంధించి భారీ ఎత్తున అవినీతికి పాల్పడిన కొంత మంది అధికారుల తీరులో ఎలాంటి మార్పూ రాకపోవడం గమనార్హం. మంగళవారం సైతం వారి సిబ్బందిని పలు దుకాణాల వద్దకు పంపి తమకు ఈ మేరకు బాణసంచా కావాలంటూ హుకుం జారీ చేసినట్లు వ్యాపారులు చెప్పారు. తెనాలి, గుంటూరు, మంగళగిరిలో పనిచేసి ప్రస్తుతం గుంటూరులో ఉన్న ఓ అధికారి మరోమారు కీలక పాత్ర పోషిస్తున్నట్లు చెబుతున్నారు. జిల్లా ఉన్నతాధికారుల అండదండలతో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దానికి తగ్గట్లు సదరు అధికారి ఇప్పటికే కొంత మంది వ్యాపారులతో మాట్లాడారని, తన విషయం ఎక్కడా మాట్లాడవద్దంటూ చెప్పిన ఘటనలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment