మహిళా ఓటర్లదే పైచేయి
గుంటూరు వెస్ట్: జిల్లాలో స్పెషల్ సమ్మరి రివిజన్ 2025కు సంబంధించి మంగళవారం ప్రకటించిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రకారం మహిళా ఓటర్లే ఎక్కువ ఉన్నారు. జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 17,95,789 అని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో ఎస్‌ఎస్‌ఆర్ 2025తోపాటు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నియోజకవర్గ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల ఓటర్ల నమోదుపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కువగా మహిళ ఓటర్లే ఉన్నారన్నారు. వీరి సంఖ్య 9,27,157 మంది కాగా, పురుషులు 8,66,710 మంది అన్నారు. ట్రాన్స్‌జండర్స్ 158 మంది, సర్వీస్ ఓటర్లు 1764 మంది ఉన్నారని తెలిపారు. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాపై వచ్చేనెల 28వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వచ్చే నెల 9, 10, 23, 24వ తేదీల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. డిసెంబరు 24వ తేదీ నాటికి క్లయిమ్స్, అభ్యంతరాలు పరిష్కరించి, వచ్చే ఏడాది జనవరి 26న తుది ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తామని వివరించారు. పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ, నూతన కేంద్రాలకు సంబంధించి ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో 36 కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఆమోదించినట్లు చెప్పారు. ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల సంఖ్య 1,920కు చేరిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు 1,24,500 దరఖాస్తులు అందాయని తెలిపారు. నవంబరు 6న నమోదుకు చివరి తేదీగా పేర్కొన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటర్ల నమోదుపై అవగాహన కల్పించాలని కోరారు. సమావేశంలో డీఆర్వో పెద్ది రోజా, ఈఆర్వోలు గంగరాజు, లక్ష్మీకుమారి, డీఆర్‌డీఏ పీడీ విజయలక్ష్మి, జీఎంసీ అదనపు కమిషనర్ ఓబులేసు పాల్గొన్నారు.
జిల్లాలో ఓటర్ల సంఖ్య 17,95,789 జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment