గుండెకు గుడ్ హాస్పిటల్!
కార్యక్రమానికి హాజరైన భక్తులు
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో పేద ప్రజలకు ఉచితంగా రూ. 3 లక్షల ఖరీదు చేసే గుండె బైపాస్ సర్జరీలు ఉచితంగా చేస్తున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ చెప్పారు. గురువారం జీజీహెచ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాను బాధ్యతలు చేపట్టాక 21 రోజుల్లోనే ఏడు బైపాస్ సర్జరీలు విజయవంతంగా చేశారన్నారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ఆపరేషన్లు చేస్తున్నట్లు వెల్లడించారు. మాడ్యూలర్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయని, డాక్టర్ పొదిల ప్రసాద్ సూపర్ స్పెషాలిటీ మిలీనియం బ్లాక్‌లో మంచి వైద్య సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
క్లిష్టమైన కేసుల్లోనూ...
గుండె శస్త్రచికిత్స వైద్య విభాగాధిపతి (సీటీవీఎస్) డాక్టర్ హరికృష్ణమూర్తి మాట్లాడుతూ ఐదు నెలల క్రితం ఇన్‌చార్జిగా విధుల్లో చేరానని, ఇప్పటివరకు 90 గుండె ఆపరేషన్లు విజయవంతంగా చేశామన్నారు. ఒక్కటి మాత్రమే ఫెయిల్ అయిందని చెప్పారు. సీటీవీఎస్, ఎనస్థీషియా తదితర వైద్య సిబ్బంది కృషితో ఇది సాధ్యం అయిందని తెలిపారు. అవుట్ పేషెంట్ విభాగంలో ప్రతి సోమ, శుక్రవారాల్లో ఉదయం 9 నుంచి 4 గంటల వరకు సీటీవీఎస్‌లో గుండె జబ్బుల రోగులకు వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇన్‌పేషెంట్ విభాగంలో 257 నంబరులో అత్యవసర కేసులు 24 గంటలూ అందుబాటులో ఉండి చూస్తున్నట్లు చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చేయలేని పరిస్థితుల్లో ఉన్న గుండె జబ్బు రోగులను తమ వద్దకు తీసుకురాగా విజయవంతంగా ఆపరేషన్లు చేశామన్నారు. త్వరలోనే కీ హోల్ సర్జరీలు సైతం అందుబాటులోకి తెస్తామన్నారు.
నెలకు సగటున 25 మందికి..
జీజీహెచ్‌లో ఐదు నెలల వ్యవధిలో
90 మందికి బైపాస్ సర్జరీలు
సుమారు రూ. 3 లక్షల
విలువైన ఆపరేషన్ ఉచితం
సూపరింటెండెంట్
డాక్టర్ యశస్వి రమణ వెల్లడి
అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పేరం కుప్పుస్వామి మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రులకు మించి వైద్య ప్రమాణాలు జీజీహెచ్‌లో తాము పాటిస్తున్నామన్నారు. ప్రతినెలా దాదాపు 25 మందికి వివిధ రకాల గుండె ఆపరేషన్లు చేస్తున్నామని చెప్పారు. ఎనస్థీషియా వైద్య విభాగాధిపతి డాక్టర్ పోలయ్య మాట్లాడుతూ... ఆపరేషన్ అంటే భయాన్ని తొలగించి విజయవంతంగా సర్జరీలు చేస్తున్నామన్నారు. వారం రోజుల వ్యవధిలో గుండె బైపాస్ సర్జరీలు చేయించుకుని డిశ్చార్జి అవుతున్న పెదకాకానికి చెందిన పెద్ద స్వాములు, విజయవాడకు చెందిన శ్రీనివాసరావు, తాడికొండకు చెందిన మేరిమ్మలు సంబంధిత వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక మొత్తంలో డబ్బులు అడిగారని, అయినప్పటికీ ఆపరేషన్ చేసినా గ్యారంటీ ఇవ్వలేమని చెప్పడంతో జీజీహెచ్‌కు వచ్చామన్నారు. సమావేశంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ యోగి, డాక్టర్ ప్రమోద తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment