సెంచరీ దాటాకా ఆరోగ్యం కేక
పాములపాడు(తాడికొండ): నేటి తరం జీవనశైలితో యువకుల్లోనూ తలెత్తే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇందుకు భిన్నంగా శతాధిక వృద్ధుడు ఒకరు ఎలాంటి దీర్ఘకాలిక రోగాలు లేకుండా ఆరోగ్యంగా జీవిస్తున్నారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పాములపాడు గ్రామానికి చెందిన ఆలూరి పరంధామయ్య 1924 అక్టోబర్ 6వ తేదీన జన్మించారు. అప్పట్లోనే స్వగ్రామంలో 5వ తరగతి పూర్తి చేశారు. 1949లో వెంకట రత్నమ్మతో ఆయనకు వివాహం జరిగింది. ఐదుగురు ఆడపిల్లలు సంతానం. అందరికీ మంచి చదువులు చెప్పించారు. అమెరికా, ఇతర ప్రాంతాల్లో వారు స్థిరపడ్డారు. ఒక కుమార్తె, అల్లుడు గ్రామంలోనే ఉంటూ ఆయన బాగోగులు చూసుకుంటున్నారు.
అప్పట్లో జీతం రూ.3 మాత్రమే
అప్పట్లో 3వ తరగతి చదివినా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేవారు. నెల జీతం రూ.3 మాత్రమే కావడంతో పరంధామయ్య అటువైపు వెళ్లలేదని చెప్పారు. తనకున్న 20 ఎకరాల భూమిలో సాగు చేసి ఏడాదికి రూ.3 వేలు సంపాదించేవాడినని గర్వంగా చెబుతున్నారు. రోజుకు 15 గంటలు కష్టపడేవారమని, అప్పట్లో కేవలం సజ్జ అన్నం మాత్రమే తినేవారమని గుర్తుచేసుకున్నారు. 1966లో గ్రామ ఉప సర్పంచ్‌గా, 3 సార్లు వార్డు మెంబర్‌గా, వరుసగా రెండు సార్లు కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా ప్రజలకు సేవలు అందించారు. పరంధామయ్యకు ఇప్పటికీ షుగరు, బీపీ, మోకాలి నొప్పులు, కళ్ల మసకలు వంటి దీర్ఘకాలిక రోగాలు లేవు. తన పని తాను చేసుకోవడంతోపాటు కళ్లజోడు లేకుండానే దినపత్రిక కూడా ఆయన రోజూ సునాయాసంగా చదివేస్తారు. వీరి తాత ఆలూరి నరసయ్య 104 సంవత్సరాలు జీవించారని స్థానికులు తెలిపారు.
ఎవరి సాయం లేకుండానే రోజువారీ పనులు చేసుకుంటున్న వృద్ధుడు నాటి జీవనశైలి, ఆహారంతో దరిచేరని దీర్ఘకాలిక రోగాలు
Comments
Please login to add a commentAdd a comment