గుంటూరు నగరంలో అక్రమాల పునాదులపై ప్లానింగ్ విభాగ అధికా
గుంటూరు నగరంలోని టౌన్ ప్లానింగ్ సిబ్బంది షార్ట్‌ఫాల్స్ పేరిట భారీగా వసూలు చేసి ఉంటారని ఒక అంచనా. డైరెక్టర్ ఆఫ్ టౌన్, సిటీ ప్లానింగ్ విభాగంలో పై స్థాయి నుంచి కింది స్థాయి వారి వరకు ఈ ముడుపులు చేరతాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇక్కడ టౌన్ ప్లానింగ్ విభాగంలో పోస్టింగ్ కావాలంటే రూ.కోటికిపైగానే చదివించుకోవాల్సి ఉంటుంది. అంత పెద్ద మొత్తం అయినా ఇక్కడి పోస్టింగ్‌లకు చాలా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చే ఆదాయం ఆ స్థాయిలో ఉంటుంది కాబట్టి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల 21 మంది గుంటూరు కార్పొరేషన్‌కు వచ్చారు. వీరంతా డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్‌తోపాటు స్థానిక ప్రజాప్రతినిధులకు రూ.కోట్లు ఇచ్చి మరీ వచ్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోస్టింగ్‌లకు వచ్చిన వారిలో అవినీతి అనకొండలే ఎక్కువగా ఉన్నాయి.
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిబంధనల అమలులో లోపాలు ఉన్నాయని 1,187 భవనాలను షార్ట్‌ఫాల్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో రాజకీయ పలుకుబడి ఉన్నవారు, అధికార పార్టీకి చెందిన వారిని పక్కన పెట్టేశారు. మిగిలిన వారిలో తాము పీక్కుతినే వారిని గుర్తించారు. వారికి మాత్రమే నోటీసులు ఇచ్చారు. వీరి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. ఇందులో కింది స్థాయి సిబ్బంది నుంచి పైస్థాయి అధికారుల వరకూ అందరి పాత్ర ఉందని తెలుస్తోంది. నాలుగు నెలల క్రితం గుంటూరుకు వచ్చిన అధికారులు ప్రతి డివిజన్‌లో తమ సొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకుని మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నా మున్సిపల్ కమిషనర్ మాత్రం నోరు మెదపడం లేదు. వాస్తవాలను, హైకోర్టు ఉత్తర్వులను కూడా మరుగున పెట్టి అధికార పార్టీ కాని వారిని టౌన్‌ప్లానింగ్ సిబ్బంది బెదిరిస్తున్నారు.
కమిషనర్‌ను తప్పుదోవ పట్టించి మరీ..!
గుంటూరులో ఒక భవనానికి సంబంధించిన బిల్డర్‌కు అధికారులు నోటీసు ఇచ్చారు. దీంతో బిల్డర్ వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలిచ్చింది. అయితే ఈ ఉత్తర్వులను సిటీ ప్లానింగ్ అధికారులు కమిషనర్‌కు చేరనివ్వలేదు. ప్రణాళికా విభాగంలోనూ ఉత్తర్వు కాపీని మాయం చేశారు. కాపీని నోట్‌ఫైల్‌లోనూ ఉంచలేదు. బిల్డర్ సమాధానం ఇవ్వలేదని సాకుతో కమిషనర్‌ను తప్పుదోవ పట్టించారు. భవన నిర్మాణదారులపై చర్యలకు సిటీప్లానర్ ఫైల్ నడిపారు. చివరి నిమిషంలో నిజం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవద్దని ఫైల్‌ను నిలుపుదల చేశారు. ఇదిలా ఉండగా మరికొందరు బిల్డర్ల విషయంలోనూ కోర్టు ఉత్తర్వులను మరుగున పెట్టినట్టు సమాచారం.
ఎల్‌టీపీకి నోటీసు జారీపై విస్మయం
సదరు భవన యజమానికి ప్లాన్ ఎందుకు రద్దు చేయకూడదని నోటీసు ఇచ్చిన ప్రణాళిక విభాగం అధికారులు ఎల్‌టీపీ విషయంలో అడ్డదిడ్డంగా వ్యవహరించారు. సదరు బిల్డింగ్ ప్లాన్ రద్దు అయిందని, మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదంటూ లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సన్‌కూ షోకాజ్ నోటీసు జారీ చేశారు. మేము బిల్డర్ ప్లాన్ రద్దు చేశామని అబద్ధంచెబుతూ ఎల్‌టీపీకి నోటీసు జారీ చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఎల్‌టీపీ లైసెన్స్ రద్దయిందని బయట దుష్ప్రచారం నడుస్తోంది. ఇంత అడ్డగోలుగా వ్యవహరిస్తున్న తీరు గతంలో కార్పొరేషన్‌లో ఎన్నడూ చూడలేదని బిల్డర్లు చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా ఒక అధికారిపై రెండు సార్లు ఏసీబీ రైడింగ్‌లు జరిగాయి. అదే టౌన్‌ప్లానింగ్ ఇన్‌స్పెక్టర్‌కు ఇప్పుడు ఏకంగా అసిస్టెంట్ సిటీప్లానర్ ఇన్‌చార్జిగా రెండు జోన్లు అప్పగించడమే కాకుండా ఏకంగా నగరంలోని సగానికి పైగా డివిజన్లు కట్టబెట్టారు. దీన్నిబట్టి ఇక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం 57కుగాను 29 డివిజన్ల బాధ్యత సదరు అధికారికి అప్పగించారు. కొంతమంది అధికారులు ఫేక్ సర్టిఫికెట్లతో ప్రమోషన్లు పొందారన్న అభియోగాలు కూడా ఉన్నాయి. ఉన్నతాధికారుల అండదండలతోనే టౌన్‌ప్లానింగ్‌లో ఇష్టారాజ్యంగా అక్రమాల వ్యవహారం నడుస్తోందని ఆరోపణలు బలంగా ఉన్నాయి.
ప్రజాప్రతినిధుల సహకారం
గుంటూరు నగరంలో అధికార పార్టీకి ఒక కేంద్ర సహాయ మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా ఈ దోపిడీకి పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరైనా తమకు అన్యాయం జరుగుతోందని గట్టిగా మాట్లాడితే.. వెంటనే ప్రజాప్రతినిధుల నుంచి టౌన్‌ప్లానింగ్ సిబ్బందికి మద్దతుగా ఫోన్లు వస్తున్నాయని చెబుతున్నారు.
రూ.కోట్లలోనే వ్యవహారాలు
అవినీతికి పక్కా ‘ప్లాన్’
ఎవరికి వారే డాన్! హైకోర్టు ఆదేశాలూ బేఖాతర్ షోకాజ్ నోటీసుల పేరుతో రూ.కోట్లలో వసూళ్లు అవీనితి అధికారులకే కీలక బాధ్యతలు అప్పగింత రెండు సార్లు ఏసీబీ దాడుల్లో చిక్కిన ఆ అధికారికే అందలం ఇదీ.. జీఎంసీ అధికారుల నిర్వాకం
Comments
Please login to add a commentAdd a comment