55 ఏళ్లు పైబడిన వారే టార్గెట్
● ఆటోల్లో ఒంటరి ప్రయాణికులను దోచుకునే 10 మంది అరెస్ట్ ● వీరంతా గుంటూరు నగరానికి చెందినవారే.. ● వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్
నగరంపాలెం: ఆటోల్లో ఒంటరిగా ప్రయాణించే వారిని బెదిరించి నగలు, నగదు ఎత్తుకెళ్లే ముఠాలోని పది మందిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. వారి నుంచి 15 గ్రాముల బంగారు వస్తువులు, రూ.50 వేలు నగదు, మూడు ఆటోలు సీజ్ చేశామని అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో కేసుల వివరాలను ఆయన తెలిపారు. ఇటీవల తెనాలి మూడో పట్టణ పీఎస్ పరిధిలో ఆటోల్లో ఒంటరిగా ప్రయాణించే 55–70 ఏళ్ల వారిని లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ క్రమంలో ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. మంగళవారం తెనాలి సుల్తాన్‌బాద్, ఆర్టీసీ బస్టాండ్, వీఎస్‌ఆర్, ఎన్‌వీఆర్ వద్ద ఆటోల్లో అనుమానాస్పదంగా సంచరిస్తోన్న పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. విచారణలో నేరం రుజువు కావడంతో గుంటూరు కొరిటెపాడు నా యుడు పేట రెండో వీధికి చెందిన పానుగంటి వెంకటేశ్వరరావు, ఎస్‌వీఎన్ కాలనీ ఒకటోలైను వాసి షేక్ ఖాజా, శివరామనగర్ మూడో వీధి వాసి ముడియాల సుదర్శనరెడ్డి, నగరంపాలెంకు చెందిన వాలేరు క్రాంతి, మద్దూరి రమేష్, అంకమ్మనగర్ ఆరో వీధికి చెందిన బడుగు శ్యాంసన్, ఏటీ అగ్రహారం ఆరో వీధి వాసి ఎలమంచి రామారావు, శ్రీనివాస కాలనీకి చెందిన ఓర్చు వెంకటేశ్, వెంగళాయపాలెం గ్రామానికి చెందిన ఓ మైనర్, బాలాజీనగర్ ఒకటో వీధికి చెందిన షేక్ కాలేషాను అరెస్ట్ చేశామని ఎస్పీ తెలిపారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసుల్లో ప్రతిభ చూపిన తెనాలి మూడో పట్ణ పీఎస్ సీఐ రమేష్ బాబు, కానిస్టేబుళ్లు మురళీ, ఎస్.జయకర్‌బాబు, శ్రీనివాసరావు, రామకృష్ణ, నరేంద్ర, నాగశ్రీను, శ్రీరామమూర్తిలను అభినందించి, నగదు రివార్డులు, ప్రశంస పత్రాలను అందించారు.
పదుల సంఖ్యల్లో కేసులు..
కూరగాయలు విక్రయించే పానుగంటి వెంకటేశ్వరరావు ఒక ముఠాకు కీలకంగా వ్యవహరించేవాడు. అతని ముఠాలోని నలుగురితో చోరీలు చేయించేవాడు. ఇందులో యాభై ఏళ్ల రమేష్ జనం రద్దీగా ఉండే చోట నిలబడి, ఒంటరిగా ఉ న్న వారితో మాట్లాడేవాడు. వారితో ఎక్కడికెళ్తున్నారని తెలుసుకుని, ముఠా సభ్యు ల్లో ఒకరికి ఫోన్ ద్వారా స మాచారం చేరవేసేవారు. దీంతో ఆటోలో అయిదుగురితో పా టు ప్రయాణికుడ్ని ఎక్కించుకుని నిర్మాన్యుష ప్రదేశానికి తీసుకెళ్లేవారు. ఆటో నిలిపి, బెదిరించి డబ్బులు, నగలు తీసుకునేవారు. మిగతా రెండు ముఠాల్లోని సభ్యులు సైతం ఇదే తరహాలో చోరీలకు పాల్పడేవారు. అయితే వీరంతా గుంటూరు లోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు. చెడు అలవాట్లకు బానిసై, 2016 నుంచి ఈ తరహా చోరీలకు తెరలేపారు. విజయవాడ, గుంటూరు జిల్లాలో పానుగంటిపై 14 కేసులు, ముడియాల సుదర్శన్‌రెడ్డి 16 కేసులు, క్రాంతిపై 2 కేసులు, మద్దూరి రమేష్‌పై 3 కేసులు, మిగతా వారిలో కొందరిపైనా కేసులు ఉన్నాయన్నారు.
త్వరలో ఆటోలకు నంబర్లు
ట్రాఫిక్ పోలీసుల నంబర్లను పునఃప్రారంభిస్తామని అన్నారు. ఆటోల్లో ప్రయాణించే వేళల్లో వేరే దారిలోకి ఆటోలు వెళ్తే టోల్‌ఫ్రీ నంబర్– 112కు లేదా, స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని చెప్పారు. జిల్లా ఏఎస్పీ (క్రైం) కె.సుప్రజ, తెనాలి డీఎస్పీ బి.జనార్దనరావు, తెనాలి మూడో పట్టణ సీఐ రమేష్, ఎస్‌ఐ ఎన్.ప్రకాష్‌రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment