ఇక సాగు నీటి సమరం
సాగునీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ప్రభుత్వం వీటి ఎన్నికల నోటిఫికేషన్‌ను బుధవారం విడుదల చేసింది. ఈ నెల 14న సాగునీటి సంఘాలకు, 17న డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రాజెక్టు కమిటీ ఎన్నికల తేదీని ఇందులో ప్రకటించలేదు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోని సాగునీటి సంఘాల వ్యవస్థను మళ్లీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చినట్టయింది. వాస్తవానికి ఈ నెల 5న రావాల్సిన నోటిఫికేషను ఆలస్యమైంది.
తెనాలి: కృష్ణా పశ్చిమ డెల్టాలో 5.71 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఉమ్మడి జిల్లాగా ఉన్నపుడు గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో ఆ ఆయకట్టు ఉండేది. ఇందులో అత్యధిక విస్తీర్ణం తెనాలి డివిజనులో ఉండేది. జిల్లాల విభజన అనంతరం ఇప్పుడు పశ్చిమ డెల్టా పరిధి గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు విస్తరించింది. ఆ ప్రకారం ఇప్పుడు సాగునీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ కొంతకాలంగా జరుగుతూ వస్తోంది. పశ్చిమ డెల్టాలో మొత్తం 144 సాగునీటి వినియోగదారుల సంఘాలను నిర్ణయించారు. వీటిలో గుంటూరు జిల్లాలో 50, బాపట్ల జిల్లాలో 92, ప్రకాశం జిల్లాలో రెండు చొప్పున ఉన్నాయి. డిస్ట్రిబ్యూటరీ కమిటీలు 20 కాగా, జిల్లాలో ఆరు, బాపట్ల జిల్లాలో 14 ఉన్నాయి. గుంటూరు చానల్ పరిధిలో మరో 14 సాగునీటి సంఘాలు, రెండు డిస్ట్రిబ్యూటరీ కమిటీలున్నాయి. వీటిన్నింటిపైన ప్రాజెక్టు కమిటీ ఉంటుంది. సాగునీటి సంఘాల ఎన్నికలకు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పర్యవేక్షిస్తారు. మూడు జిల్లాలకు ముగ్గురు నోడల్ అధికారులను నియమించారు. జిల్లాకు జలవనరుల శాఖ గుంటూరు ఈఈ కె.రమేష్, బాపట్లకు గుంటూరు జిల్లా ఇన్‌చార్జి సూపరింటెండెంట్ ఇంజినీరు పులిపాటి వెంకటరత్నం, ప్రకాశం జిల్లాకు జలవనరుల శాఖ ఏఈ శంకరరావు నియమితులయ్యారు.
చురుగ్గా ఏర్పాట్లు
కృష్ణా డెల్టా పరిధిలోని పశ్చిమ డెల్టాలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, సిబ్బందికి శిక్షణ తరగతులు గత నెల మూడో వారంలో నిర్వహించారు. మిగతా ఏర్పాట్లకు సంబంధించిన సన్నాహాలు చురుగ్గా జరుగుతున్నాయి. బుధవారం విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 14న సాగునీటి సంఘాలకు, 17న డిస్ట్రిబ్యూటరీ సంఘాలకు ఎన్నికలను నిర్వహిస్తారు. సాగునీటి సంఘాల ఎన్నికలు రెండు విభాగాలుగా జరుగుతాయని అధికారులు తెలియజేశారు. ఉదయం టీసీ సభ్యుల (ప్రాదేశిక సభ్యులు) ఎన్నిక ఉంటుంది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆయా సంఘాలకు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. ప్రాజెక్టు కమిటీ ఎన్నికను నోటిఫికేషన్‌లో ప్రస్తావించలేదు.
14, 17 తేదీల్లో సంఘాలకు ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికల అధికారులు, సిబ్బందికి శిక్షణ కృష్ణా పశ్చిమ డెల్టాలో ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
ఎన్నిక విధానం ఇలా...
కృష్ణా పశ్చిమ డెల్టాలోని నీటి సంఘాల్లో 3.5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 18 ఏళ్ల వయసు కలిగినవారు ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. ప్రభుత్వ ఉద్యోగి/పింఛనుదారు పోటీకి అర్హులు కారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారు, పారితోషికాలు పొందేవారు అనర్హులు. ఎన్నికల్లో పోటీచేసేవారు నీటిశిస్తు చెల్లించి ఉండాలనే నిబంధన ఉంది. ఇక ఎన్నికలను మూడు విధాలుగా జరుపుతారు. తొలుత అక్షరమాల ప్రకారం అభ్యర్థుల వరుసక్రమాన్ని నిర్ణయిస్తారు. ముందుగా ఏకగ్రీవం అవుతుందేమో చూస్తారు. లేకుంటే అభ్యర్థుల వరుసక్రమం ప్రకారం తొలి అభ్యర్థిని వేదికపైకి పిలిచి చేతులు పైకెత్తే విధానంలో ఎన్నిక జరుగుతుంది. ఎవరికి ఎక్కువ మద్దతు వస్తే వారిని విజేతలుగా ప్రకటిస్తారు. చేతులెత్తే విధానం వీలుపడకపోతే రహస్య బ్యాలెట్‌ను అనుసరిస్తారు. ఓటు చేసే రైతులకు పట్టాదారు పాసు పుస్తకం లేకపోయినా ఓటు హక్కును నిరాకరించరు. ఓటరు కార్డు, ఆధార్ కార్డు లేదా ఏ ఇతర గుర్తింపు కార్డుతోనైనా ఓటు చేసే అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment